AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టెంపుల్ సిటీ తిరుపతిలో మరో వివాదం.. వన్ ప్రాజెక్టుకు భూ కేటాయింపులపై రాజకీయ రచ్చ!

టెంపుల్ సిటీ తిరుపతిలో ఇప్పుడు మరో వివాదంపై రచ్చ నడుస్తోంది. తిరుపతి వన్ ప్రాజెక్టుకు కేటాయించిన 22 ఎకరాల ప్రభుత్వ భూముల వివాదంపై సర్కార్‌తో వైసీపీ ఢీ అంటే ఢీ అంటోంది. విలువైన భూములను అనుభవం లేని సంస్థలకు కారుచౌకగా కట్టబెట్టారని, దీని వెనుక వందల కోట్ల అవినీతి దాగి ఉందని వైసీపీ ఆరోపిస్తుంటే, ఆ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని టీడీపీ అంతే బలంగా తిప్పికొడుతోంది

టెంపుల్ సిటీ తిరుపతిలో మరో వివాదం.. వన్ ప్రాజెక్టుకు భూ కేటాయింపులపై రాజకీయ రచ్చ!
Tirupati One, Mice Complex
Balaraju Goud
|

Updated on: Apr 03, 2026 | 10:42 AM

Share

టెంపుల్ సిటీ తిరుపతిలో ఇప్పుడు మరో వివాదంపై రచ్చ నడుస్తోంది. తిరుపతి వన్ ప్రాజెక్టుకు కేటాయించిన 22 ఎకరాల ప్రభుత్వ భూముల వివాదంపై సర్కార్‌తో వైసీపీ ఢీ అంటే ఢీ అంటోంది. విలువైన భూములను అనుభవం లేని సంస్థలకు కారుచౌకగా కట్టబెట్టారని, దీని వెనుక వందల కోట్ల అవినీతి దాగి ఉందని వైసీపీ ఆరోపిస్తుంటే, ఆ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని టీడీపీ అంతే బలంగా తిప్పికొడుతోంది. ఈ అంశంపై ఎలాంటి చర్చకైనా తాము సిద్ధమని అధికార పార్టీ సవాల్ విసురుతోంది.

తిరుపతిలోని దామినేడు దగ్గర ‘తిరుపతి వన్’ ప్రాజెక్టు కోసం కేటాయించిన 21.10 ఎకరాల భూములపై అధికార కూటమి, వైసీపీ మధ్య రాజకీయ యుద్ధం మొదలైంది. ప్రభుత్వం తన పర్యాటక విధానం 2024-29లో భాగంగా రూ. 1,226 కోట్ల పెట్టుబడి, 1,500 మందికి ఉపాధి లక్ష్యంతో దివ్యశ్రీ హోల్డింగ్స్, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు ఈ భూమిని కేటాయించింది. ఇందులో ఫైవ్ స్టార్ హోటల్స్, థీమ్ పార్కులు, 5,000 మంది సామర్థ్యంతో కూడిన MICE కాంప్లెక్స్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. అయితే, సబ్-రిజిస్ట్రార్ విలువ ప్రకారం రూ. 1,000 కోట్లు ఉన్న భూమిని కేవలం రూ. 90 కోట్లకు ధారాదత్తం చేశారని, దీని వెనుక రూ. 400 కోట్ల మేర అవినీతి జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ డీల్ వెనుక మంత్రి నారా లోకేష్ హస్తం ఉందని, 15 ఏళ్ల జీఎస్టీ మినహాయింపు వంటి రాయితీల ద్వారా ఆ సంస్థలకు రూ. 1,400 కోట్ల లబ్ధి చేకూరుస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.

తిరుపతి వన్ ప్రాజెక్టుకు భూముల కేటాయింపుపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను కూటమి సర్కార్ తప్పుపడుతోంది. భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడేవన్నీ అబద్ధాలేనని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మండిపడ్డారు. రూ. 1000 కోట్ల విలువైన స్థలాన్ని రూ. 94 కోట్లకే ఇచ్చారనడం పచ్చి అబద్ధమని, ప్రభుత్వ ధర ప్రకారమే పారదర్శకంగా భూకేటాయింపులు జరిగాయని స్పష్టం చేశారు. భూముల కేటాయింపులో ఎలాంటి అవినీతి జరగలేదని, దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని భూమనకు సవాల్ విసిరారు.

టూరిజం డెవలప్‌మెంట్‌లో భాగంగా నిబంధనల ప్రకారమే భూములు కేటాయిస్తే, భూమన కరుణాకర్ రెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం టెంపుల్ సిటీని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తుంటే, భూమన మాత్రం కావాలనే అడ్డంకులు సృష్టిస్తూ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని దివాకర్ ఆరోపించారు. మొత్తానికి టెంపుల్ సిటీ తిరుపతిలో ‘తిరుపతి వన్’ ప్రాజెక్టు చుట్టూ ముదురుతున్న ఈ భూ వివాదం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us