Andhra Pradesh: ప్రేమించుకున్నారు.. ఇంట్లో నుంచి వెళ్లిపోయారు.. కట్‌చేస్తే ఊహించని నిర్ణయం.. దేవుడిలా వచ్చిన పోలీసులు..
వారిద్దరు ప్రేమించుకున్నారు. పెద్దవాళ్లు ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయారు. కొన్నాళ్లు బాగానే ఉన్నప్పటికీ భవిష్యత్ వారిని భయపెట్టింది. ఊరు వెళ్తే అందరూ ఏమనుకుంటారో.. ఇక్కడే ఉండి ఎలా బతకాలి అనే ప్రశ్నలు వారిని సతమతం చేశాయి. దీంతో ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. కానీ అక్కడే ట్విస్ట్ నెలకొంది.

ప్రేమించిన వ్యక్తిని వదిలి ఉండలేక, పెద్దలు పెళ్లికి అంగీకరించలేదనే మనస్థాపంతో క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవాలనుకున్న ఒక యువ జంటను పోలీస్ సిబ్బంది సమయస్ఫూర్తితో కాపాడారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఆ ప్రేమికులను కాపాడి.. ఖాకీలంటే కేవలం చట్టాన్ని అమలు చేయడమే కాదు.. ప్రాణాలు కాపాడే దేవుళ్ళు కూడా అని శక్తి టీమ్ మహిళా పోలీసులు నిరూపించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలానికి చెందిన లావణ్య, గణేష్ గత నాలుగు నెలలుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమకు ఇరువైపులా ఉన్న కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదిరించలేక, అలాగని విడిపోలేక ఈ నెల 19న ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయారు.
వెంటాడిన భవిష్యత్తు ఆందోళన
ఇల్లు వదిలి వచ్చిన కొత్తలో అంతా బాగానే ఉన్నా.. రోజులు గడుస్తున్న కొద్దీ వారి వద్ద ఉన్న డబ్బులు అయిపోయాయి. దాంతో భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం కాక ఇద్దరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒకవేళ తిరిగి ఊరు వెళితే పెద్దలు తమ ప్రేమను అంగీకరించకపోగా, ఇల్లు వదిలి వెళ్లిపోయామన్న కోపంలో ఎలాంటి గొడవలు చేస్తారో అని భయపడ్డారు. ఇటు బంధువులను, అటు స్నేహితులను కూడా సహాయం అడగలేని దయనీయ పరిస్థితి నెలకొంది. చివరికి జీవితంపై విరక్తి చెంది, తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్యే శరణ్యమని భావించారు.
రైల్వే పట్టాల వద్ద హైడ్రామా.. దేవుడిలా పోలీసులు
ఈ నేపథ్యంలో సోమవారం నాడు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న రైల్వే పట్టాల వద్దకు చేరుకున్న ఈ యువ జంట, అక్కడ ఆత్మహత్యకు యత్నించింది. సరిగ్గా అదే సమయంలో అక్కడ విధుల్లో ఉన్న శక్తి టీమ్ 2 ఇన్‌చార్జి ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ తమ్మినేని అమ్మాజీ, ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ ధనలక్ష్మి వీరిని గమనించారు. ఆ యువ జంట ప్రవర్తనపై అనుమానం రావడంతో వెంటనే అప్రమత్తమై, క్షణాల వ్యవధిలో వారిని రైల్వే పట్టాల పైనుంచి పక్కకు లాగి సురక్షితంగా రక్షించారు.
కౌన్సిలింగ్ ఇచ్చి.. స్వగ్రామానికి తరలింపు
రక్షించిన అనంతరం ఆ యువతీ యువకులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, వారు భయాందోళనల నుండి కోలుకునేలా చేశారు. వారి నుండి పూర్తి వివరాలు సేకరించి, ప్రాణాలు తీసుకోవడం వల్ల కుటుంబాలు ఎంతలా రోడ్డున పడతాయో వివరిస్తూ ఆమదాలవలస పోలీసులు వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం ఈ విషయాన్ని పాలకొండ ఎస్‌ఐకు చేరవేసి, యువ జంటను సురక్షితంగా పాలకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
శక్తి టీమ్ సిబ్బందికి జిల్లా ఎస్పీ అభినందనలు
సమయస్ఫూర్తితో వ్యవహరించి ఇద్దరి ప్రాణాలను కాపాడిన శక్తి టీమ్ సిబ్బంది తమ్మినేని అమ్మాజీ, ధనలక్ష్మిలను శ్రీతికాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన యువతకు ఒక కీలక సందేశాన్ని ఇచ్చారు. “యువతకు నిత్య జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా క్షణికావేశంలో ఆత్మహత్య లాంటి తీవ్ర నిర్ణయాలకు పాల్పడవద్దు. సమస్య ఏదైనా సరే కుటుంబ సభ్యులు, నమ్మకమైన స్నేహితులతో పంచుకోవాలి. లేదా స్థానిక పోలీసులను సంప్రదించి సహాయం కోరాలే తప్ప, అమూల్యమైన ప్రాణాలను బలితీసుకోవద్దు.” అని సూచించారు.
