AP News: చేసింది రూ.10లక్షల కోట్ల అప్పు.. చూపించేది రూ.4కోట్లే: వైసీపీపై పురంధేశ్వరి ఫైర్..
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టగానే అధికార వైసీపీపై అటాక్ మొదలుపెట్టారు పురంధేశ్వరి. డే వన్ నుంచి సమరమే అంటున్నారు ఆమె. సోము వెళ్లిపోయాక వచ్చిన పురంధేశ్వరి తగ్గేదే లా అంటున్నారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. రూ.10 లక్షల కోట్లు అప్పు చేసి 4 లక్షల కోట్లుగా చూపిస్తున్నారంటూ ఏపీ ప్రభుత్వంపై ఏకంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదు చేశారు పురంధేశ్వరి.

ఆంధ్రప్రదేశ్: ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టగానే అధికార వైసీపీపై అటాక్ మొదలుపెట్టారు పురంధేశ్వరి. డే వన్ నుంచి సమరమే అంటున్నారు ఆమె. సోము వెళ్లిపోయాక వచ్చిన పురంధేశ్వరి తగ్గేదే లా అంటున్నారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. రూ.10 లక్షల కోట్లు అప్పు చేసి 4 లక్షల కోట్లుగా చూపిస్తున్నారంటూ ఏపీ ప్రభుత్వంపై ఏకంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదు చేశారు పురంధేశ్వరి. ఆంధ్రప్రదేశ్ పరిమితికి మించి అడ్డదారుల్లో అప్పులు చేస్తోందని, ఆర్థిక అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కొన్ని గణాంకాలతో కూడిన రాసిన లేఖను కేంద్రమంత్రికి ఏపీ బీజేపీ చీఫ్ అందజేశారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే జగన్ సర్కార్‌పై ఢిల్లీ సర్కార్‌కు కంప్లయింట్ ఇచ్చారు ఆమె.
అధికారిక అప్పు రూ. 2,39,000 కోట్లు..అనధికారిక అప్పు రూ. 4,74,000 కోట్లు..
ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా జిల్లాల పర్యటన చేపట్టిన పురంధేశ్వరి ఏ జిల్లాకు వెళ్లినా, అధికార వైసీపీపై అటాక్ చేస్తున్నారు. అత్యంత తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించి జేబులు నింపుకుంటున్నారని ఏపీ సర్కార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు పురంధేశ్వరి. వైసీపీ సర్కార్ ఆంధ్రప్రదేశ్‌ని అప్పులకుప్పగా మార్చిందని ఆరోపించారు పురంధేశ్వరి. ఏపీ ప్రభుత్వం… 2 లక్షల 39 వేల కోట్ల రూపాయలు అధికారికంగా అప్పు చేసిందని, అనధికారికంగా 4 లక్షల 74 వేల కోట్ల రూపాయలు రూపాయలు అప్పు చేసిందనేది పురంధేశ్వరి వాదన. కార్పొరేషన్ల పేరుతో అప్పులు చేశారని ఆమె ఆరోపిస్తున్నారు.
ఇక్కడే…సరిగ్గా ఇక్కడే…బీజేపీ, వైసీపీ మధ్య వార్ మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌ని అప్పులకుప్ప చేశారంటూ బీజేపీ దాడి…మీరు చెప్పే లెక్కలన్నీ తప్పులకుప్ప అంటూ వైసీపీ ఎదురుదాడి. దీంతో ఏపీలో పొలిటికల్ బీపీ పెరిగిపోతోంది. రెండు పార్టీలూ…రౌద్రం, రుణం, రణం అంటూ తలపడుతున్నాయి. అంకెల పేరుతో నేతలు రంకెలు వేస్తున్నారు. వైసీపీ, బీజేపీ నేతల మధ్య అప్పు పెట్టిన నిప్పుతో పొలిటికల్ మంటలు చెలరేగుతున్నాయి.




ఇంతకీ ఏపీ అప్పు ఎంత? దానిచుట్టూ రగులుతున్న రాజకీయమెంత? దానిలో నిజాల సంగతేమో కానీ రాజకీయ ఇజాలే ఎక్కువగా కనిపిస్తున్నాయనేది పొలిటికల్ వెర్షన్. నువ్వొకటంటే నే రెండంటా అన్నట్టు వైసీపీ, బీజేపీ నేతలు డైలాగ్ వార్‌తో దుమ్ము లేపుతున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరిపై వ్యక్తిగతంగా కూడా అటాక్ మొదలు పెట్టారు వైసీపీ నేతలు. మరిది చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ని పురంధేశ్వరి చదువుతున్నారంటూ విమర్శిస్తున్నారు. చిన్నమ్మ గారు అంటూ పురంధేశ్వరిపై అధికార పార్టీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. అసలు మీది భారతీయ జనతా పార్టీనా? బాబు గారి జనతా పార్టీనా అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. దీనికి బీజేపీ నేతలు కూడా అదే స్టైల్‌లో జవాబిస్తున్నారు. పురంధేశ్వరిని విమర్శించిన నేతలపై వ్యక్తిగత దాడికి దిగుతున్నారు. మాటల తూటాలు పేలుస్తున్నారు.
మా అప్పుకో లెక్కుంది. కానీ మీ తిక్క మాటలకు లెక్కుందా అంటూ బీజేపీపై వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ఏపీ అప్పులపై పురంధేశ్వరి చెబుతున్నవన్నీ తప్పు లెక్కలే అంటున్నారు వాళ్లు. సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతారా అంటూ వైసీపీపై కౌంటర్ అటాక్ చేస్తోంది కమలం పార్టీ. అప్పులపై సమాధానం చెప్పలేక ఇలా మాటల దాడి చేస్తున్నారంటోంది బీజేపీ.
అతిగా అప్పులు చేస్తున్నారంటూ జగన్ సర్కార్‌పై స్టేట్ బీజేపీ యుద్ధం ప్రకటించింది. ఏపీలో బీజేపీ, వైసీపీల మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి. రాష్ట్రం అప్పులపై రెండు పార్టీల మధ్య రచ్చ కొనసాగుతున్న నేపథ్యంలో…లోక్‌సభలో ఎంపీ రఘురామ కృష్ణరాజు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి లోబడే ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఫైనాన్స్ కమిషన్ సిఫారసులకు లోబడే ఏపీ అప్పులు ఉన్నాయన్నారు ఆమె. 2019 మార్చి నాటికి ఏపీ అప్పులు రూ. 2,64,451 కోట్లు. 2023 నాటికి ఏపీ అప్పులు రూ. 4,42, 442 కోట్లకు చేరాయి. నాలుగేళ్లలో ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులు రూ. 1,77,991కోట్లు’ అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
లెక్కల్లో తేడా ఏంటంటున్న వైసీపీ..
ఇక్కడే పురంధేశ్వరి చెప్పే లెక్కలకు, నిర్మలా సీతారామన్ చెప్పే లెక్కలకు స్పష్టంగా తేడా కనపడుతోందంటోంది వైసీపీ. ఏపీ అప్పుపై పురంధేశ్వరి మాటలకు నిర్మలా సీతారామన్ లెక్కలకు కాంట్రాడిక్షన్ ఎందుకు ఉందని లాజిక్ లాగుతోంది వైసీపీ.
ఇక GSDPలో రాష్ట్ర అప్పు వాటాపై గణాంకాలను కేంద్రం విడుదల చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీలో రాష్ట్ర అప్పు 32.95 శాతం ఉందని పేర్కొంది. 2019-20 నాటికి జీఎస్డీపీలో రాష్ట్ర అప్పు వాటా 31.24 శాతం అని తెలిపింది. 2020-21లో జీఎస్డీపీలో రాష్ట్ర అప్పు 34.33 శాతంగా ఉందని పేర్కొంది. 2014-15లో జీఎస్డీపీలో రాష్ట్ర అప్పు 28.33 శాతం అని తెలిపింది. లోక్‌సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు పేర్కొన్నారు.
రౌద్రం, రుణం, రణం అనే పోరు ఏపీలో రాజకీయ సెగలు రాజేస్తోందిజ దీంతో ఈ రచ్చ ఇప్పట్లో క్లోజ్ అయ్యేలా లేదు. ఏపీ అప్పు అనే ధారావాహిక మరికొన్నాళ్లు కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. డైలీ సీరియల్‌లా వైసీపీ, బీజేపీ సీరియస్‌గా మాటల తూటాలు పేల్చుకుంటుంటే…ఈ అప్పుల ఎపిసోడ్‌కి ఇప్పుడే ఎండ్ కార్డ్ పడేలా లేదంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఏపీలో నిన్నటిదాకా వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన అన్నట్లు పోరు సాగితే…ఇప్పుడు నేనున్నా అంటోంది బీజేపీ. ఇప్పుడు వైసీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం మంటలు పుట్టిస్తోంది. . అప్పులపై మొదలైన వార్.. రాజకీయంగా ఎటు దారి తీస్తుందో చూడాలి.
