AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: స్టేషన్లో తచ్చాడుతున్న ఇద్దరిని గుర్తించిన రోబో కాప్ అర్జున్

విశాఖ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన రోబోకాప్‌ శభాష్‌ అనిపిస్తోంది. డేగ కన్నేసి దొంగలకు దడ పుట్టిస్తోంది. ఏకంగా ఇద్దరు దొంగలను పట్టుకుని.. భద్రతలో రోబోకాప్‌ల వినియోగం ఎంత కీలకమో నిరూపిస్తోంది. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం .. ..

Vizag: స్టేషన్లో తచ్చాడుతున్న ఇద్దరిని గుర్తించిన రోబో కాప్ అర్జున్
Robot Cop Arjun
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Feb 03, 2026 | 9:51 PM

Share

ప్రయాణికుల భద్రత, దొంగలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు చెక్‌ పెట్టడమే లక్ష్యంగా రైల్వేశాఖ గత నెలలో విశాఖ రైల్వే స్టేషన్‌లో అసిస్టెంట్‌ సెక్యూరిటీ కమిషనర్‌ అర్జున్‌ పేరుతో ఓ రోబోను ఏర్పాటు చేసింది. భారతీయ రైల్వేలోనే తొలిసారిగా వాల్తేరు డివిజన్‌లో రోబో సేవలకు శ్రీకారం చుట్టగా.. ఈ రోబో ఆర్పీఎఫ్‌కు అదనపు బలంగా మారింది. విశాఖ రైల్వే స్టేషన్‌లో డేగ కన్నేస్తూ శభాష్‌ అనిపిస్తోంది. ఈ క్రమంలోనే.. రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఇద్దరు పాత నేరస్తులను రోబోకాప్‌ అర్జున్ గుర్తించింది. వారు రాయగడకు చెందిన శివ, బంగారు అని నిర్ధారించిన తర్వాత.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు సమాచారం అందించింది. వెంటనే స్పందించిన RPF సిబ్బంది.. ఇద్దర్నీ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఎంక్వైరీలో వీరిద్దరిపై ఒడిశాలోని రాయగడ పోలీస్‌స్టేషన్‌లో దోపిడీతో పాటు అక్రమ ఆయుధాల కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఇద్దర్ని ప్రశ్నించిన పోలీసులు.. రైల్వే స్టేషన్‌కు ఎందుకు వచ్చారు?.. ఎటు వెళ్తున్నారు?.. నేరాలకు ఏమైనా పాల్పడుతున్నారా?.. అనే విషయాలపై ఆరా తీశారు. అయితే.. ప్రస్తుతం ఎలాంటి నేరాలకు పాల్పడడం లేదని ఇద్దరు వ్యక్తులు సమాధానం ఇవ్వడంతో.. ఇదే అంశాన్ని రాయగడ పోలీసులకు తెలియజేసి.. క్రాస్‌ చెక్‌ చేశారు విశాఖ RPF. ఆ తర్వాత ఆయా వివరాలను రికార్డ్‌ చేసి.. కౌన్సిలింగ్‌ ఇచ్చారు. మొత్తంగా.. రద్దీ ప్రదేశాల్లో భద్రతకు రోబోకాప్‌ల వినియోగం ఎంత ముఖ్యమో విశాఖ స్టేషన్‌లోని రోబో రుజువు చేస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..