Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: యువకుడి కాళ్ళను మింగి.. వళ్లంతా చుట్టేసిన కొండ చిలువ.. పోరాడి మరీ ప్రాణాలు దక్కించుకున్న వైనం..

కొండ చిలువ బారి నుంచి తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్నా రహదారి మార్గం లేకపోవడం తో హాస్పిటల్ కు వెళ్ళే వరకూ ఆ యువకుడికి ఏమవుతుందో అన్న ఆందోళన ఆ గ్రామస్థులను వెంటాడింది. అసలు చిట్టి బాబు కొండ చిలువ బారి నుంచి ఇంటికి వచ్చే సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులు లేరు. రహదారి కోసం గత 30 రోజులుగా రెండు కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న నిరాహార దీక్ష శిబిరానికి  కుటుంబ సభ్యులు వెళ్లారు

Andhra Pradesh: యువకుడి కాళ్ళను మింగి.. వళ్లంతా చుట్టేసిన కొండ చిలువ.. పోరాడి మరీ ప్రాణాలు దక్కించుకున్న వైనం..
Anakapali District News
Follow us
Eswar Chennupalli

| Edited By: Ravi Kiran

Updated on: Aug 07, 2023 | 4:45 PM

కొండ చిలువ నోటికి చిక్కి తప్పించుకోవడం అంటే పునర్జన్మ అన్నట్టే లెక్క. అడవిలో దొరికిన వ్యక్తి కాళ్ళను మింగేసి నోటిలోకి లాగుతూ శరీరాన్ని చుట్టిముట్టేసిన సమయంలో పక్కన ఉన్న స్నేహితులు రక్షించాల్సింది పోయి.. భయపడి పారిపోగా ధైర్యం తెచ్చుకున్న ఆ యువకుడు కొండ చిలువ తో పోరాడి ప్రాణాలు దక్కించుకున్నాడు. అదొక ఎత్తైతే అక్కడ నుంచి హాస్పిటల్ కు వెళ్ళడానికి రహదారి లేక, డోలీ లో తీసుకెళ్లి అతన్ని హాస్పిటల్ లో చేరే వరకు అతని పరిస్థితి ఏమవుతుందో తెలియని కుటుంబ సభ్యుల ఆందోళన మరోవైపు.. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

జిల్లాలోని కోటవురుట్ల మండలంలోని గొట్టివాడ గ్రామ పంచాయతీ లోని హామ్లెట్ విలేజ్ ఆయిన అణుకు గిరిజన గ్రామానికి చెందిన సింబేరి చిట్టిబాబు, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆదివారం అటవీ వుత్పత్తుల కోసం సమీపంలోని అడవికి వెళ్లారు. చెట్టు బెరడు నుంచి వచ్చే తాళ్ల కోసం చిట్టి బాబు ప్రయత్నిస్తున్న సమయం లో వెనకనుంచి వచ్చిన కొండచిలువ ఒకటి దాడి చేసింది. అమాంతం చిట్టిబాబు రెండు కాళ్ళను నోటిలోకి లాగేసుకుని శరీరాన్ని చుట్టుముట్టింది. దీంతో పెద్దగా అరవడం తో అది చూసి భయపడిన అతని స్నేహితులు రాము, శ్రీరామ్‌ ప్రాణభయంతో పారిపోయారు.

ధైర్యం కూడగట్టుకుని

ఇవి కూడా చదవండి

ఒక వైపు మృత్యు నోట్లో, మరో వైపు పారిపోతున్న స్నేహితులు.. అదే సమయంలో ధైర్యాన్ని కూడగట్టుకున్న చిట్టిబాబు.. మనోధైర్యం కోల్పోకుండా తన శక్తిని కూడతీసుకుని కొండచిలువ తో పోరాడాడు. అతికష్టం పై దాని నోటినుంచి బయటపడి ఊపిరి పీల్చుకున్నాడు. అక్కడనుంచి కొంత దూరం వచ్చి కేకలు వేయగా సమీపంలో అడవికి వచ్చిన గ్రామస్థుడు నరసింహ రావు సహాయంతో చిన్నగా ఊరికి చేరుకున్నాడు.

తప్పని డోలీ మోత

కొండ చిలువ బారి నుంచి తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్నా రహదారి మార్గం లేకపోవడం తో హాస్పిటల్ కు వెళ్ళే వరకూ ఆ యువకుడికి ఏమవుతుందో అన్న ఆందోళన ఆ గ్రామస్థులను వెంటాడింది. అసలు చిట్టి బాబు కొండ చిలువ బారి నుంచి ఇంటికి వచ్చే సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులు లేరు. రహదారి కోసం గత 30 రోజులుగా రెండు కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న నిరాహార దీక్ష శిబిరానికి  కుటుంబ సభ్యులు వెళ్లారు. వారికీ అసలు విషయం తెలియడంతో అక్కడ దీక్ష చేస్తున్న వారందరూ అణకు వచ్చి డోలీ లో ఆగమేఘాలపై గ్రామానికి చేరుకొని మూడు కిలోమీటర్లు కొండపై నడిచి ఆటోలో కోటవురట్ల ఆస్పత్రికి తరలించారు.

నిలకడగా ఆరోగ్యం

అయితే అప్పటికే సమాచారం అందుకున్న వైద్యశాల సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. డాక్టర్లు పరిశీలించి చిట్టి బాబు కు ప్రాణపాయం లేదని చెప్పడంతో కుటుంబ సభ్యులుతో పాటు గ్రామం అంతా ఊపిరి పీల్చుకుంది. చిట్టిబాబు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఈరోజు మరికొన్ని రక్త పరీక్షలు నిర్వహించి, ఇంటికి పంపించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మొత్తానికి చిట్టిబాబు కు ప్రాణాపాయం లేకపోవడం అందరిలో కాస్త రిలీఫ్ ఇచ్చినట్లైంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..