AP Weather Alert: ఏపీకి ఈరోజు కూడా తప్పని వాన గండం.. ఈ మూడు జిల్లాలో నేడు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
AP Weather Alert: అండమాన్ తీరంలో అల్పపీడనం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ..
AP Weather Alert: అండమాన్ తీరంలో అల్పపీడనం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. దీంతో ఈరోజు చిత్తూరు, కడప, అనంతరపురం, ప్రకాశం, గుంటూరు జిల్లాలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. దక్షిణ కోస్తా జిల్లాలో పలు చోట్ల సాధారణ వర్ష పాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలల్లో ఈ రోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఇక దక్షిణాంధ్ర,రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణ శాఖ హెచ్చరకల నేపథ్యంలో ఈ నేపథ్యంలో చిత్తూరు, కడప జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. విద్యాశాఖ అధికారులు చిత్తూరు, కడప జిల్లాలోని స్కూళ్లకు ఈరోజు సెలవు ప్రకటించారు. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఇక రాబోయే రెండు రోజుల్లో ఈ వర్షాలు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అల్పపీడన ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు గుంటూరు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, డిసెంబర్ 1 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.