Weather Report: తరుముకొస్తున్న మరో తుపాను.. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!
నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక, హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాలలో తీవ్రఅల్పపీడనం కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది దాదాపు ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ రేపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందంది. ఆ తరువాత 48 గంటల్లో ఇది ఉత్తర..

అమరావతి, నవంబర్ 26: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక, హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాలలో తీవ్రఅల్పపీడనం కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది దాదాపు ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ రేపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందంది. ఆ తరువాత 48 గంటల్లో ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేసింది.
సెన్యార్ తుపాను పశ్చిమ-నైరుతి దిశలో కదులుతూ గురువారం ఉదయం వరకు దాని తీవ్రతను కొనసాగిస్తుంది. ఈ క్రమంలో గురువారం (నవంబర్ 27) నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 35-55కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇక శని, ఆదివారల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మలక్కా జలసంధి, ఇండోనేషియాను ఆనుకుని ఉన్న ‘సెన్యార్’ తుపాను తీరం దాటిందని తెలిపింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది ఉత్తర తమిళనాడు వైపు పయనిస్తుందని, దీని ప్రభావం కూడా ఏపీ, తమిళనాడులపై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి దిత్వా తుఫానుగా నామకరణం చేశారు.
దీంతో ఈ నెల 29 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్‌ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీసత్యసాయి, నంద్యాల, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనావేసింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




