AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ వేదికగా ఏపీ రాజకీయం.. ప్రోటోకాల్ దాటిన స్నేహం.. మిత్రుల ఇళ్లకు మోదీ!

హైదరాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన రాజకీయంగా విస్తృత చర్చకు దారి తీసింది. సాధారణంగా ప్రధాని ఏ రాష్ట్రానికి వెళ్లినా అధికారిక కార్యక్రమాలకే పరిమితం కావడం ఆనవాయితీ. కానీ ఈసారి తెలంగాణ పర్యటనలో భాగంగా జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసాలకు మోదీ వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

హైదరాబాద్ వేదికగా ఏపీ రాజకీయం.. ప్రోటోకాల్ దాటిన స్నేహం.. మిత్రుల ఇళ్లకు మోదీ!
Pm Modi, Chandrababu, Pawan Kalyan
Eswar Chennupalli
| Edited By: |

Updated on: May 10, 2026 | 7:09 PM

Share

హైదరాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన రాజకీయంగా విస్తృత చర్చకు దారి తీసింది. సాధారణంగా ప్రధాని ఏ రాష్ట్రానికి వెళ్లినా అధికారిక కార్యక్రమాలకే పరిమితం కావడం ఆనవాయితీ. కానీ ఈసారి తెలంగాణ పర్యటనలో భాగంగా జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసాలకు మోదీ వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా అధికారిక ప్రోటోకాల్‌కు అతీతంగా మిత్రపక్ష నేతల ఇళ్లకు వెళ్లడం, వ్యక్తిగతంగా పలకరించడం, ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీయడం వంటి పరిణామాలు ఎన్డీయే రాజకీయాల్లో కొత్త చర్చకు కారణమయ్యాయి.

తెలంగాణలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని సమయం చేసుకుని మరీ నేరుగా పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. ఇటీవల సైనస్ శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొంతసేపు కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడినట్లు సమాచారం. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లి భేటీ కావడం రాజకీయంగా మరింత ఆసక్తి రేకెత్తించింది. ఒకే పర్యటనలో ఏపీకి చెందిన ఇద్దరు కీలక నేతల నివాసాలకు ప్రధాని వెళ్లడం అరుదైన పరిణామంగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఎన్డీయే కూటమిలో ప్రస్తుతం టీడీపీ, జనసేన కీలక భాగస్వాములుగా ఉన్నాయి. ముఖ్యంగా 2024 ఎన్నికల తర్వాత కేంద్ర రాజకీయాల్లో చంద్రబాబు పాత్ర మరింత ప్రాధాన్యం పొందింది. సంఖ్యాపరంగా మాత్రమే కాదు, పరిపాలనా అనుభవం, పెట్టుబడుల ఆహ్వానం, దక్షిణాదిలో రాజకీయ ప్రభావం వంటి అంశాల్లో టీడీపీని బీజేపీ కీలక మిత్రపక్షంగా చూస్తోంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ యువతలో ప్రభావం ఉన్న నాయకుడిగా, జనసేన ద్వారా ఎన్డీయేకు సామాజికంగా విస్తరణ కల్పించే నేతగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో మోదీ వ్యక్తిగతంగా ఇద్దరి నివాసాలకు వెళ్లడం ద్వారా మిత్రధర్మానికి గౌరవం ఇచ్చినట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కూటమి రాజకీయాల్లో పరస్పర నమ్మకం, వ్యక్తిగత అనుబంధం కూడా ముఖ్యమనే సంకేతాన్ని ఈ భేటీలు ఇచ్చాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గతంలో బీజేపీ – టీడీపీ మధ్య విభేదాలు చోటుచేసుకున్నప్పటికీ, ఇప్పుడు అదే నాయకత్వంతో సమన్వయం బలపడుతున్న దృశ్యం దేశానికి కనిపించేలా చేయడంలో ఈ భేటీలు కీలకంగా మారాయని విశ్లేషణలు వస్తున్నాయి.

మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ వ్యూహంలో కూడా ఈ భేటీలకు ప్రాధాన్యత కనిపిస్తోంది. తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉండటంతో, బలమైన మిత్రపక్షాలతో కలిసి ముందుకు వెళ్లాలనే ఆలోచన బీజేపీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కోణంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను రాజకీయంగా ప్రాధాన్యంతో చూడడం ద్వారా దక్షిణాదిలో ఎన్డీయే బలం పెంచాలనే సంకేతాన్ని ప్రధాని పర్యటన ఇచ్చిందని భావిస్తున్నారు.

హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ భేటీలు మరో ఆసక్తికర చర్చకు కూడా దారి తీశాయి. రాష్ట్ర విభజన తర్వాత కూడా హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల రాజకీయ, వ్యాపార, మీడియా కేంద్రంగా కొనసాగుతోంది. అలాంటి నగరంలో ప్రధాని ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం నివాసాలకు వెళ్లడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ పర్యటనలో ఉండగానే ఏపీ రాజకీయ నాయకులతో ప్రత్యేక సమయం గడపడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

ఇటీవల అమరావతి, పోలవరం, పెట్టుబడులు, కేంద్ర సహకారం వంటి అంశాల్లో కేంద్రం నుంచి ఏపీకి అనుకూల సంకేతాలు వరుసగా వస్తున్నాయి. అలాంటి సమయంలో ప్రధాని ఈ భేటీలు చేయడం ద్వారా కేంద్ర – ఏపీ సమన్వయం బలంగా ఉందన్న అభిప్రాయం మరింత బలపడుతోంది. ముఖ్యంగా ఎన్డీయేలో ఏపీ భాగస్వామ్యానికి ఉన్న ప్రాధాన్యతను బహిరంగంగా చాటే చర్యగా ఈ పర్యటనను రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మొత్తంగా చూస్తే, ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశం లేదా ఆరోగ్య పరామర్శ మాత్రమే కాదు. దక్షిణాదిలో ఎన్డీయే వ్యూహం, మిత్రపక్షాలకు ఇస్తున్న ప్రాధాన్యత, కేంద్ర–ఏపీ రాజకీయ సమన్వయం, భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై సంకేతాలు ఇచ్చిన పరిణామంగా ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నిలిచింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us