AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Assembly: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. రాజధానులపై ప్రభుత్వ నిర్ణయం ఇదేనా..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 15వ తేదీ గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదట ప్రశ్నోత్తరాలు

AP Assembly: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. రాజధానులపై ప్రభుత్వ నిర్ణయం ఇదేనా..?
Ap Assembly
Amarnadh Daneti
|

Updated on: Sep 15, 2022 | 9:01 AM

Share

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 15వ తేదీ గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదట ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు. తర్వాత శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ(BAC) సమావేశం నిర్వహిస్తారు. అలాగే దివంగత సభ్యులు శత్రుచర్ల చంద్రశేఖరరాజు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పులవర్తి నారాయణమూర్తి, జేఆర్‌ పుష్పరాజ్‌, నల్లమిల్లి మూలారెడ్డిల మృతిపట్ల సభలో సంతాపతీర్మానాన్ని సభాపతి తమ్మినేని సీతారాం ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లో రెవెన్యూశాఖ 4 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటివరకు అసెంబ్లీ అధికారిక వెబ్ సైట్ లో పొందుపర్చిన ఎజెండాలో మాత్రం ఏ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది, ఏయే అంశాలపై చర్చిస్తారనేది పేర్కొనలేదు. కేవలం దివంగత సభ్యుల మృతిపట్ల సంతాప తీర్మానంతో పాటు.. ప్రశ్నోత్తరాల సెషన్ ను మాత్రమే పొందుపర్చారు. అయితే రెవెన్యూ శాఖకు సంబంధించి 3 బిల్లులు చట్ట సవరణకు, ఒక బిల్లు రద్దుకు సంబంధించినవి ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆటో మ్యుటేషన్‌ విధానానికి అనుగుణంగా రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్‌ 1971 చట్టాన్ని సవరించనున్నారు. ప్రస్తుత మ్యుటేషన్‌ విధానంలో కొనుగోలు చేసిన వ్యక్తి పేరు 30 రోజుల్లో వెబ్‌ల్యాండ్‌లో నమోదు కావట్లేదు. కొత్త సవరణతో సబ్‌డివిజన్‌ జరిగిన తర్వాతే రిజిస్టర్‌ చేస్తారు. దీనివల్ల ఆటోమ్యుటేషన్‌ సులువవుతుంది. భూమి కొన్నవారి పేరు వెంటనే వెబ్‌ల్యాండ్‌లో నమోదవుతుంది.

మరోవైపు భూముల రీ-సర్వే అనంతరం యజమానులకు శాశ్వత భూ యాజమాన్య హక్కు కల్పించేందుకు ఉద్దేశించిన టైటిలింగ్‌ యాక్టులో ప్రభుత్వం సవరణ తీసుకురానుంది. ఈబిల్లును మూడోసారి సభలో పెడుతున్నారు. దీనికి చట్టసభల్లో ఆమోదం తెలిపిన తర్వాత ఆమోదం కోసం కేంద్ర హోంశాఖకు పంపనున్నారు. గతంలో ఒకసారి కేంద్రానికి పంపగా హోంశాఖ కొన్ని అభ్యంతరాలు తెలిపింది. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం నల్సార్‌ విశ్వవిద్యాలయంతో అధ్యయనం చేయించింది. తాజా సవరణలకు కేంద్రం ఆమోదం తెలిపితే ఇళ్లు, భూములపై యజమానులకు శాశ్వత హక్కులు దక్కనున్నాయి.

ఇవి కూడా చదవండి

1956 నాటి కౌలు చట్టాన్ని రద్దు చేసే బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. కౌలుదారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ని రాయితీలు, సంక్షేమ పథకాలు అందించే లక్ష్యంతో 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూమి సాగుదారుల చట్టాన్ని తెచ్చారు. దీన్నే కౌలురైతు చట్టంగా భావిస్తున్నారు. 2019లో ఈ చట్టంలోని కౌలు అన్న పదాన్ని తొలగించారు. కొత్తగా ఏపీ పంట సాగుదారు హక్కుల చట్టం-2019ను అమల్లోకి వచ్చింది. దాంతో 1956నాటి కౌలుచట్టం రద్దు బిల్లును ప్రవేశపెట్టనున్నారు.

ఏపీ ఇనామ్స్‌ అబాలిషన్‌ చట్టం (1956)కు సవరణ తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో జమీందారులు, ఇతర పెద్దల నుంచి పొందిన భూముల్లో ఇనాందారులు 33% మాత్రమే సాగు చేసుకోవాలి. మిగిలిన దాన్ని రైతులకు కౌలుకు ఇవ్వాలి. కౌలుకు ఇవ్వకుండా మొత్తం భూమి ఇనాందారు పర్యవేక్షణలో ఉంటే… 64% భూమి ప్రభుత్వ పరమయ్యేలా చట్టసవరణ తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై మరింత స్పష్టత రావల్సి ఉంది.

ప్రధానంగా రాష్ట్ర రాజధానులపై ప్రభుత్వం తొలిరోజు చర్చించే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. రాష్ట్రానికి అమరావతి ఒకటే రాజధాని అంటూ రైతులు ఒకవైపు మహాపాదయాత్ర చేస్తుండగా… మరోవైపు 3 రాజధానుల అంశమే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం శాసనసభ సమావేశాలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం 3 రాజధానుల బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉండొచ్చన్న చర్చ రాజకీయవర్గాల్లో విస్తృతంగా సాగుతోంది. ఈ బిల్లు విషయంలో ప్రభుత్వం గోప్యత పాటిస్తున్నా.. సభలో ప్రత్యేక చర్చ కచ్చితంగా ఉండే అవకాశాలున్నట్లు సమాచారం. మొత్తంగా ఈసమావేశాల్లో 25 అంశాలపై చర్చించాలని అధికార పక్షం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల అంశంపై గురువారం ప్రత్యేకంగా చర్చ చేపట్టే అవకాశం ఉందని, దీనిపై ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో చర్చ జరుగుతున్న తరుణంలో రాజధానుల అంశంపై సీఏం రాజకీయంగా కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..