Thummala Tour: తెలంగాణ కాంగ్రెస్ మంత్రికి ఆంధ్ర టీడీపీ నేతల ఘన స్వాగతం.. ఎందమ్మా ఈ విడ్డూరం!

తెలంగాణ కాంగ్రెస్ మంత్రి చుట్టూ ఆంధ్ర ప్రాంతం తెలుగుదేశం పార్టీ నేతలు చక్కర్లు కొట్టారు. ఆ సీన్ చూస్తే ఆంధ్రాలో కొత్త ప్రేమలు పుట్టాయా అన్నట్టుందీ..! ఇటీవల జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పరస్పరం అనధికారికంగా సహకరించుకున్నాయనే చర్చ జోరుగా సాగింది. అయితే ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రస్తుతం దీనికి భిన్నమైన వాతావరణం నెలకొంది.

Thummala Tour: తెలంగాణ కాంగ్రెస్ మంత్రికి ఆంధ్ర టీడీపీ నేతల ఘన స్వాగతం.. ఎందమ్మా ఈ విడ్డూరం!
Thummala Nageswara Rao Eluru Tour
Follow us
B Ravi Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Feb 20, 2024 | 7:33 PM

తెలంగాణ కాంగ్రెస్ మంత్రి చుట్టూ ఆంధ్ర ప్రాంతం తెలుగుదేశం పార్టీ నేతలు చక్కర్లు కొట్టారు. ఆ సీన్ చూస్తే ఆంధ్రాలో కొత్త ప్రేమలు పుట్టాయా అన్నట్టుందీ..! ఇటీవల జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పరస్పరం అనధికారికంగా సహకరించుకున్నాయనే చర్చ జోరుగా సాగింది. అయితే ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రస్తుతం దీనికి భిన్నమైన వాతావరణం నెలకొంది.

తాజాగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏలూరు జిల్లాలో పర్యటించారు. ముందుగా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అయితే ఆలయానికి విచ్చేసిన ఆయనకు చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గంలో ఆయన పర్యటనలో ఎక్కడ చూసినా టీడీపీ నేతలే కనిపించారు. అలాగే పెదవేగి మండలం రాట్నాలకుంట లో రాట్నాలమ్మ అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు. అయితే అక్కడా టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆయనకు స్వాగతం పలికి, సత్కరించారు. అనంతరం చింతలపూడి నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా ప్రయత్నిస్తున్న సొంగ రోషన్ కుమార్ సైతం తుమ్మల నాగేశ్వరావును కలిసి సత్కరించారు.

తుమ్మల నాగేశ్వరరావు పర్యటనలు యావత్తు టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరగటం తీవ్ర చర్చ నీయాంశంగా మారాయి. గత ఏడాది సెప్టెంబర్ లో చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. ఆ సమయంలో చంద్రబాబు అరెస్టును కాంగ్రెస్ పార్టీ ఖండించింది. దాంతో టీడీపీ అభిమానులు, నాయకులు బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. దాంతో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరి కాంగ్రెస్ గెలుపునకు కారణమైందని టీడీపీ నేతలు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రాలో టీడీపీ, జనసేనతో పొత్తులో ఉంది. రేపో మాపో పొత్తులో భాగంగా పోటీలో ఉండే అభ్యర్థులను ప్రకటించనున్నారు. మరో పక్క బీజేపీతో పొత్తుకు ప్రయత్నాలు చేస్తోంది.

మరోవైపు, ఇటీవల వైయస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా నియమించింది. ఈ క్రమంలో ఆమె రాష్ట్రంలో వరుస పర్యటనలు చేస్తూ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని తెస్తూ ఒకవైపు వైసిపి మరోవైపు టిడిపి పై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఎన్నికల సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తారనే వార్తలు సైతం పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మళ్ళీ ఆంధ్రాలో తిరిగి బలం పుంజుకునే విధంగా తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణలో ఎలా ఉన్నా ఆంధ్రాలో మాత్రం టీడీపీ, కాంగ్రెస్ ప్రత్యర్థులనే అని చెప్పాలి. ఎందుకంటే టీడీపీ – జనసేన – బీజేపీలతో పొత్తుకు ప్రయత్నించడం, ఇప్పటికే మూడు పార్టీలకు సంబంధించిన అగ్ర నేతలు పలు దఫాలుగా చర్చించడం ఇందుకు ముఖ్య కారణంగా కనిపిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రాలో ఒంటరిగా పోటీ చేసే విధంగా ముందుకు సాగుతుంది. ఇప్పటివరకు కాంగ్రెస్‌తో పొత్తు అని ఏ పార్టీ నుంచి స్పష్టమైన సంకేతాలు లేవు. అయితే తాజాగా తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరావు చుట్టూ టీడీపీ నేతలు చక్కర్లు కొట్టడం ఏటువంటి సంకేతాలకు దారితీస్తుందో అని పలువురు అభిప్రాయపడుతున్నారు. దాంతో టీడీపీ అధిష్టానం బీజేపీ వైపు పరుగులు పెడుతుంటే శ్రేణులు మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతల వెనుక తిరగడాన్ని టీడీపీ ఏ విధంగా సమర్థిస్తుందో చూడాలని పలువురు భావిస్తున్నారు.

ఏదేమైనా ఈ పర్యటనతో ఆంధ్రాలో కాంగ్రెస్ టీడీపీ మధ్య ఏదో జరుగుతుందనే చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. అయితే టీడీపీ నేతలు మాత్రం గతంలో తుమ్మల నాగేశ్వరరావు తమ పార్టీలో ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆ సమయంలో గోదావరి జిల్లాల్లోని టీడీపీ నేతలతో ఆయనకు విస్తృత పరిచయాలు ఉన్నాయి. దీంతోనే టీడీపీ నేతలు తుమ్మల ఏలూరు జిల్లా పర్యటనను తమ సొంత నేత పర్యటనగా మార్చేశారు. రాజకీయాల్లో వింతలు, విడ్డూరాలకు కొదవేముంటుంది చెప్పండీ..! ఎవరి అవసరాలు, ఎజెండాలు వాళ్లవే కదా..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…