Andhra Pradesh: పెద్ద చదువులు చదివారు.. మూఢ నమ్మకాల మత్తులో తప్పు చేశారు.. ఆఖరికి అడ్డంగా బుక్కయ్యారు..
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని బిక్కవోలు మండలం, బిక్కవోలు గ్రామంలోని గోలింగేశ్వర స్వామి ఆలయంలో పురాతన నంది విగ్రహం చోరీ..
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని బిక్కవోలు మండలం, బిక్కవోలు గ్రామంలోని గోలింగేశ్వర స్వామి ఆలయంలో పురాతన నంది విగ్రహం చోరీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఈ నెల 6వ తేదీన నంది విగ్రహం అపహరణకు గురవగా.. తాజాగా పోలీసులు ఈ కేసును చేధించారు. నలుగురు నిందితులు ఈ విగ్రహాన్ని దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. కాగా, ఈ కేసు విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. నంది విగ్రహాన్ని దొంగిలించిన దుండగులు నలుగురూ.. ఉన్నత చదువులు చదువుకున్న వారు కావడం విశేషం. ఆర్ధిక ఇబ్బందులకు తోడు మూఢ నమ్మకాల నేపథ్యంలో.. పురాతన విగ్రహాలలో విలువైన వజ్రాలు వుంటాయనే ఆశ పడ్డారు. ఈ ఆశ నేపథ్యంలోనే.. గత కొంత కాలంగా రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక చారిత్రాత్మక పురాతన దేవాలయాలకు ప్రత్యక్షంగా వెళ్లి రెక్కి నిర్వహించారు.
ముద్దాయిలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో రెక్కి నిర్వహించి ఫోటోల ద్వారా సేకరించిన విగ్రహాల వివరాలు ఇవి.. 1. వీరభద్ర స్వామి, నంది విగ్రహం ఉంచాల (v), కర్నూల్ జిల్లా 2. వినాయకుని బొమ్మ, నంది విగ్రహం ఎనమదల (v), గుంటూరు జిల్లా ౩. మూడు నంది విగ్రహలు గూడూరు (v), నెల్లూరు జిల్లా 4. నల్ల నంది విగ్రహం గూడూరు (v), నెల్లూరు జిల్లా 5. నల్ల నంది, గోల్డ్ రంగు లో నగలు ఒంగోలు లోని శివాలయం 6. శిల్ప కళలతో ఉన్న నంది నెల్లూరు జిల్లా 7. స్తంబం మీద నంది బొమ్మ, వినుకొండ శివాలయం 8. నెమలి బొమ్మ, నెల్లూరు జిల్లా 9. నంది విగ్రహం, కమ్మం పాడు (v) గుంటూరు జిల్లా 10. నాగులు బొమ్మ, పగిలిన దేవుడు బొమ్మ నర్సాపురం, ప్రకాశం జిల్లా 11. తెల్ల నంది విగ్రహం కూడురి (v) నెల్లూరు జిల్లా 12. పసుపు నంది విగ్రహంఇంజమురు (v), నెల్లూరు జిల్లా 13. శివాలయం గుడి జగిత్యాల జిల్లా, తెలంగాణా 14. నల్ల నంది విగ్రహం, సోమేశ్వరం (v), తూ. గో.జిల్లా 15. నంది విగ్రహం, బిక్కవోలు (v), తూ. గో.జిల్లా
కాగా, చోరికి రెండు రోజుల ముందు నిందితులైన చుక్కపట్ల ప్రసాద్, గువ్వల భాస్కర రెడ్డి, కుంచాల వెంకటేష్, రవి పంతులు కారులో వచ్చి బిక్కవోలు ఆలయంలో రెక్కీ నిర్వహించారు. దీని ప్రకారం.. ప్రణాళికలు సిద్ధం చేసుకుని 6వ తేదీన అర్థరాత్రి దాటిన తరువాత గుడిలోకి చొరబడ్డారు. తమ కారును గుడి వెనుకవైపు నిలిపి.. ఆలయ ప్రహరి గోడను దూకి లోనికి ప్రవేశించారు. అతిపురాతనమైన నంది విగ్రహాన్ని దొంగిలించుకుని వెళ్లిపోయారు. జి మామిడాడ మార్గంలో వెళుతూ.. వారితో పాటు తెచ్చుకున్న సుత్తితో నంది విగ్రహాన్ని పగులగొట్టారు. అందులో విలువైనవి ఏమీ లేకపోవడంతో.. పగిలిగిన విగ్రహం రాతి ముక్కలను రోడ్డు పక్కనే ఉన్న పొదలలో పడేశారు. అటు నుంచి గుంటూరుకు వెళ్లిపోయారు.
నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. జి మామిడాడ లో నరసారావుపేట రోడ్డు పక్కన పొదలలో పడేసిన నంది విగ్రహం శకలాలు, చోరీకి ఉపయోగించిన కారును పోలీసులు సీజ్ చేశారు. అయితే, ఈ కేసులో ప్రసాద్, వెంకటేష్‌ను అరెస్ట్ చేయగా.. భాస్కర రెడ్డి, రవి పంతులు పరారీలో ఉన్నారు. వీరి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపడుతున్నాయి.
Also read:
Andhra Pradesh: సిండికేట్ అయిన వ్యాపారులు.. పంటకు దక్కని మద్దతు ధర.. ఆందోళనకు దిగిన రైతన్న..