Andhra Pradesh: కోనసీమ జిల్లాలో వింత కప్పలు కలకలం రేపాయి. వింత కప్పల దర్శనంతో ఎలాంటి విపత్తులు సంభవిస్తాయోనని భయపడుతున్నారు జిల్లా వాసులు. వివరాల్లోకెళితే.. కోనసీమ జిల్లా అమలాపురం మండలం బండారులంకలో వింత కప్పలు కలకలం రేపుతున్నాయి. గ్రామంలోని మట్టపర్తివారిపాలెంలో అరుదైన పసుపురంగు కప్పలు వరద నీటిలో కనిపించాయి. నైరుతి బుతుపవనాల నేపథ్యంలో గత మూడు రోజులుగా కురిసిన వర్షపు నీటిలో పసుపురంగు కప్పలు దర్శనమిచ్చాయి.
అయితే ఇలాంటి కప్పలను గతంలో ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు కోనసీమ జిల్లా వాసులు. వర్షాలు కురిసే సమయంలో ఈ వింత కప్పలు సెడన్ గా దర్శనమివ్వడంతో జిల్లా వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. వర్షాలు కురిసే సమయంలో ఇలాంటివి కనిపిస్తే తుఫాన్లు, వరదలు సంభవిస్తాయని ఆందోళన చెందుతున్నారు. ప్రకృతి విపత్తులకు ముందు ఇలా హెచ్చరిస్తుందని కోనసీమ ప్రజలు భావిస్తున్నారు. గతంలోనూ తునీగల గుంపులు ఆకాశంలో తెరిగితే తుఫాన్లు వచ్చేవని.. అలాంటి సందర్భాలు చాలా జరిగాయని చెప్తున్నారు. ఎన్నడు లేని విధంగా పసుపు రంగు కప్పలు కనిపించడంతో బయపడుతున్నారు కోనసీమ వాసులు. ఈ ఘటనపై పశుసంవర్ధక శాఖ అధికారులు స్పందించారు. ఇవి సాధారణ కప్పలేనని, వీటిని బుల్ ప్రాగ్స్ అంటారని చెబుతున్నారు. సాదారణంగా ఖాకీ, ఆలివ్ కలర్లో ఉండే ఈ కప్పలు సడన్ గా ఒక్కోసారి రంగు మారతాయన్నారు. ఇలా పసుపు రంగులో మారేవి మగ కప్పలేనని.. బ్రీడింగ్ సీజన్లో ఆడకప్పలను ఆకర్షించడానికి రంగును మార్చుకుంటాయని చెప్పారు. సీజన్ ముగిసాక యాధావిధిగా మామూలు రంగులోకి వస్తాయని చెబుతున్నారు పశుసంవర్ధక శాఖ అధికారులు. షో యల్లో కలర్ లో ఉన్న కప్పలను చూసి భయపడొద్దని చెబుతున్నారు అధికారులు.