Andhra Pradesh: ప్రజల అత్యాశే వారి ఆసరా.. ఊళ్లకు ఊళ్లనే మోస చేసిన మాయ కంపెనీ..
Andhra Pradesh: అధిక వడ్డీల మాయలోపడి ఊళ్లకు ఊళ్లే మోసపోయాయ్. సామాన్య, మధ్యతరగతి ప్రజలే టార్గెట్‌గా కోట్లు కొల్లగొట్టి బిచాణా..
Andhra Pradesh: అధిక వడ్డీల మాయలోపడి ఊళ్లకు ఊళ్లే మోసపోయాయ్. సామాన్య, మధ్యతరగతి ప్రజలే టార్గెట్‌గా కోట్లు కొల్లగొట్టి బిచాణా ఎత్తేసింది ఓ కంపెనీ. వివరాల్లోకెళితే.. అధిక వడ్డీ ఆశ చూపించి, జనాలకు కుచ్చుటోపీ పెట్టింది చెన్నై బేస్డ్ నోబెల్ అసెట్స్ సంస్థ. పదో ఇరవైయ్యో కాదు, 150 కోట్ల రూపాయలకు పైగా మోసంచేసి బోర్డు తిప్పేసింది. చెన్నై బేస్డ్ నోబెల్ అసెట్స్ సంస్థ బాధితుల్లో అధికశాతం ఉమ్మడి చిత్తూరు వాసులే ఉండటం స్థానికంగా కలకలం రేపుతోంది. తిరుపతి, పుత్తూరు, తిరుత్తణి, చెన్నై ప్రాంతాల్లో ప్రజల నుంచి డబ్బు వసూలు చేసింది కంపెనీ. ఫారిన్ ట్రేడింగ్, షేర్ మార్కెట్ బిజినెస్ పేరుతో 2018లో కార్యకలాపాలు ప్రారంభించిన నోబెల్ అసెట్స్ సంస్థ, అధిక వడ్డీ ఆశచూపించి జనాలను బోల్తా కొట్టించింది.
తమ సంస్థలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించింది. మొదట్లో లక్ష రూపాయలకు నెలనెలా 8వేలు వడ్డీ చెల్లించడంతో జనం ఎగబడ్డారు. ఒకర్ని చూసి మరొకరు పెట్టుబడులు పెట్టారు. అయితే, కోవిడ్ పేరుతో ఏడాదిన్నరగా వడ్డీలు చెల్లించని కంపెనీ, ఆ తర్వాత అసలుకే ఎసరు పెట్టింది. తమ డబ్బు తమకు తిరిగి చెల్లించాలని బాధితులు ఒత్తిడి చేయడంతో రాత్రికి రాత్రే ఆఫీసులను ఖాళీచేసి ఉడాయించారు నిర్వాహకులు. ఒక్క తిరుపతి బ్రాంచ్‌లోనే 40కోట్ల రూపాయల మోసం జరిగినట్లు తేలింది. పుత్తూరు, తిరుత్తణి, చెన్నై బ్రాంచుల ద్వారా 100కోట్లకు పైగా దోచేసింది కంపెనీ. నోబెల్ అసెట్స్ సంస్థ లూటీ స్పష్టంగా కనిపిస్తున్నా, బాధితులు మాత్రం కంప్లైంట్ చేసేందుకు ముందుకు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.