AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్ ఎఫెక్ట్.. బంగారం,వెండి ధరలు ఇలా పడిపోయాయ్ ఏంటి..

పశ్చిమాసియా యుద్ధం సృష్టిస్తున్న ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు.. వార్‌ దెబ్బకు బంగారం , వెండి ధరలు కూడా ఊహించని రీతిలో పడిపోతున్నాయి. బంగారం, వెండి మాత్రమే కాదు విలువైన లోహాల ధరలన్నీ నేలచూపు చూస్తున్నాయి. ఇన్వెస్టర్లు డాలర్లు , ఎనర్జీ రంగాలపై ఫోకస్‌ పెట్టడంతో అనూహ్య పరిణామాలు వస్తున్నాయని ఆర్ధిక రంగ నిపుణులు చెబుతున్నారు.

వార్ ఎఫెక్ట్.. బంగారం,వెండి ధరలు ఇలా పడిపోయాయ్ ఏంటి..
Gold And Silver Price
Ram Naramaneni
|

Updated on: Mar 20, 2026 | 8:51 PM

Share

స్టాక్‌ మార్కెట్లు కాదని.. బంగారం, వెండిలో పెట్టుబడి పెడితే అది కూడా ఢమాల్‌.. పశ్చిమాసియా యుద్ధంతో గ్లోబల్ మార్కెట్లలో పెను ప్రకంపనలు మొదలయ్యాయి… ప్రపంచ పారిశ్రామిక రంగంలో డిమాండ్ దారుణంగా పడిపోతోంది. విలువైన లోహాల ధరలు కూడా అనూహ్యంగా ఊహించని రీతిలో పడిపోతున్నాయి. గురువారం ఒక్కరోజే అల్యూమినియం ధరలు ఏకంగా 8.4 శాతం కుప్పకూలాయి… 2018 తర్వాత ఈ స్థాయిలో భారీ పతనం నమోదు కావడం ఇదే మొదటిసారి. కాపర్ ధరలు కూడా 5.2 శాతం మేర పడిపోయి… ఈ ఏడాది వచ్చిన లాభాలన్నీ ఒక్కసారిగా ఆవిరైపోయాయి. జనవరిలో ఆల్ టైమ్ హైకి చేరిన కాపర్… ఈ ఒక్క మార్చి నెలలోనే 11 శాతం పతనం కావడం ట్రేడర్లను తీవ్రంగా కలవరపెడుతోంది.

గోల్డ్‌, సిల్వర్‌ నుంచి .. క్రూడ్‌, డాలర్‌కు మళ్లుతున్న పెట్టుబడులు

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఒకే రోజు రూ.8030 తగ్గింది బంగారం ధర. రూ.13,700 తగ్గింది కిలో వెండి ధర. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10గ్రా. ధర 1,52,370 కాగా .. కిలో వెండి ధర రూ.2,40,900 ఉంది. బంగారం, వెండి నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు ఇన్వెస్టర్లు. గోల్డ్‌, సిల్వర్‌ నుంచి క్రూడ్‌, డాలర్‌కు మళ్లుతున్నాయి పెట్టుబడులు.

మెటల్స్ అన్నీ భారీ అమ్మకాల ఒత్తిడి

లండన్ మెటల్ ఎక్స్‌చేంజ్‌లో బేస్ మెటల్స్ అన్నీ భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి… టిన్ 7 శాతం, నికెల్ 3 శాతానికి పైగా పడిపోయాయి. ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు మండిపోతుండటంతో… ప్రపంచవ్యాప్తంగా మాన్యుఫాక్చరింగ్ రంగంపై తీవ్ర ముప్పు పొంచి ఉంది. క్రూడ్ ఆయిల్ ధరలు ఇలాగే పెరిగితే ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరి… బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ మెటల్ ధరల పతనం చైనాకు మాత్రం కొంత కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భారీ మాంద్యం దిశగా.. అడుగులు వేస్తోందా అన్న ఆందోళన

విలువైన లోహాల ధరలు నిన్న మొన్నటిదాకా ఎక్కువగా రేట్లు ఉండటంతో ఆగిపోయిన చైనా మాన్యుఫాక్చరర్లు… ఇప్పుడు భారీగా కొనుగోళ్లు చేసే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే… ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భారీ మాంద్యం దిశగా అడుగులు వేస్తోందా అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. పసిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. స్టాక్ మార్కెట్ అయితే రక్త పాతమే చూస్తోంది. విలువైన లోహాల ధరలు అమాంతం పడిపోయాయి. అయితే ఈ ఆందోళనకర పరిస్థితుల మధ్య గ్యాస్ ధరలు అమాంతం ఎగబాకాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. ప్రపంచ వస్తు మార్కెట్లు అయితే ఇటీవల గణనీయమైన అస్థిరతను ఎదుర్కొంటున్నాయి. వెండి 6 శాతం పైగా విలువ కోల్పోయి ఔన్సుకు 71.04 డాలర్ల వద్దకు పడింది. బంగారం కూడా 1 శాతానికి పైగా పడిపోతూ ఔన్సుకు 4,768.19 డాలర్ల వద్ద స్థిరపడింది. ఈ అకస్మిక పతనానికి ప్రధాన కారణం ఇంధన మార్కెట్‌లో త్వరితగతిన మార్పులు వస్తున్నాయి.

ప్రపంచ వడ్డీ రేట్ల అనిశ్చితి, ద్రవ్యోల్బణం భయాలు

సాధారణ పరిస్థితుల్లో గోల్డ్‌ , వెండి లాంటి సురక్షిత పెట్టుబడులు ఇలాంటి గందరగోళంలో విలువ పెంచుతాయి. అయితే ఈసారి పరిస్థితి తలకిందులయింది. బంగారం ధరలు భారీగా తగ్గాయి.. దీనికి ప్రధాన కారణం.. పెట్టుబడిదారులు వేగంగా ఇంధన రంగం వైపు మళ్లడం కూడా కారణమని చెప్పవచ్చు. ముడి చమురు, గ్యాస్ ధరల పెరుగుదల కొత్త పెట్టుబడి అవకాశాలను అందించడం వల్ల, నిధులను లోహాల నుండి ఇంధన రంగానికి మళ్లించడం జరుగుతోంది. అంతేకాక, ప్రపంచ వడ్డీ రేట్ల అనిశ్చితి, ద్రవ్యోల్బణం భయాలు కూడా విలువైన లోహాలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు బంగారం వంటి ఆస్తులు స్థిరమైన రాబడిని అందించవు, కాబట్టి వాటి ఆకర్షణ తగ్గుతుంది. ప్రస్తుత పరిస్థితులు పెట్టుబడిదారులకు కీలక సమయాన్ని సూచిస్తున్నాయి. ఇంధన రంగం పుంజుకుంటుండగా.. విలువైన లోహాలు ఒత్తిడిలో ఉన్నాయి. ఒకే ధోరణిని అనుసరించడం ప్రమాదకరమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బంగారం , వెండి, ప్లాటినం ధరల తగ్గుదల మార్కెట్ ఎల్లప్పుడూ ఒకే దిశలో పయనించవని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. ఒకే రంగంలో పెట్టుబడులపై ఆధారపడడం వల్ల రిస్క్ పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో, ఇంధన రంగం, లోహాలు, స్టాక్ మార్కెట్లు, ఇతర కమోడిటీలు ఒక సమగ్ర వ్యూహంతో విశ్లేషించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. గోల్డ్, సిల్వర్, ప్లాటినమ్ ధరలు పడిపోవడం, గ్యాస్ ధరలు పెరగడం, వడ్డీ రేట్ల, ద్రవ్యోల్బణంపై ఉన్న అనిశ్చితి కలిపి, ప్రపంచ మార్కెట్లలో అస్థిరతను తెచ్చాయి.

Follow Us