Andhra Pradesh: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. ప్రజలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర మంత్రి రోజా అన్నారు. తిరుపతిలోని ఎస్‌వి యూనివర్సిటీ స్టేడియంలో ‘వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం’ను ప్రారంభించారు మంత్రి రోజా. పథకం లబ్ధిదారులకు ట్రాక్టర్లు చేశారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి మంత్రి రోజా ట్రాక్టర్ నడిపారు. ఈ సందర్భంగా ప్రజలనుద్ధేశించి మాట్లాడిన ఆమె.. ప్రభుత్వ పథకాలను, అమలు తీరును వివరించారు. అదే సమయంలో రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై స్పందించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు మంత్రి రోజా.
సినిమాలో ప్రధాని కూడా అవ్వొచ్చు..
పవన్ రీల్ హీరో మాత్రమే.. రియల్ హీరో కాదంటూ విమర్శలు గుప్పించారు. రెండున్నర గంటల సినిమాల్లో పవన్ కల్యాణ్.. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్ కూడా కావొచ్చు అంటూ సెటైర్లు వేశారు. రియల్ లైఫ్‌లో పవన్ సీఎం అస్సలు కాలేరని అన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు ఏ మాత్రం లేదని అన్నారు. ఏం చేయాలో ప్రజలకు స్పష్టంగా చెబితే ఎవరైనా సీఎం కావొచ్చన్నారు. పొత్తులు పెట్టుకున్నంత మాత్రాన వైసీపీని ఎవరు ఏం చేయలేరని అన్నారు. గుంపులు గుంపులుగా ఎవరు వచ్చినా.. సింహం సింగిల్ గానే వస్తుందని, ఆ సింహమే సీఎం జగన్ అని వ్యాఖ్యానించారు మంత్రి రోజా. వచ్చే ఎన్నికల్లో 160 ఎమ్మెల్యే స్థానాలు వైసీపీ గెలుచుకుంటుందని మంత్రి రోజా జోస్యం చెప్పారు.