AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Fungus: కోవిడ్ లేకున్నా బ్లాక్ ఫంగస్.. సంచలన విషయాలు వెల్లడించిన వైద్యాధికారులు..

Black Fungus: ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తితో జనాలు అల్లాడిపోతుంటే.. మరోవైపు బ్లాక్ ఫంగస్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇలాంటి తరుణంలో...

Black Fungus: కోవిడ్ లేకున్నా బ్లాక్ ఫంగస్.. సంచలన విషయాలు వెల్లడించిన వైద్యాధికారులు..
Anil Kumar Singhal
Shiva Prajapati
|

Updated on: May 31, 2021 | 6:04 PM

Share

Black Fungus: ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తితో జనాలు అల్లాడిపోతుంటే.. మరోవైపు బ్లాక్ ఫంగస్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇలాంటి తరుణంలో ఏపీ వైద్యాధికారులు సంచలన విషయం వెల్లడించి బాంబ్ పేల్చారు. కోవిల్ లేకున్నా బ్లాక్ ఫంగస్ సోకుతుందని, తమ పరిశీలనలో ఇది వెల్లడైందని అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం ఆధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్ష సమావేశం అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడారు. బ్లాక్‌ ఫంగస్ వ్యాప్తి గురించి కీలక అంశాలు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లో 1179 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయన్న ఆయన.. బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో 1139 మంది కోవిడ్ సోకిన వారు ఉన్నారని వివరించారు. 40 మందికి మాత్రం కరోనా రాకపోయినప్పటికీ బ్లాక్ ఫంగస్ సోకిందన్నారు. బ్లాక్ ఫంగస్ కారణంగా 14 మంది ప్రాణాలు కోల్పోగా.. 97 మంది పూర్తిగా కోలుకున్నారని అనిల్ సింఘాల్ వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1068 మంది బాధితులకు చికిత్స అందుతోందన్నారు. ఆక్సిజన్ సప్లై వల్ల బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగాయనడం సరికాదన్నారు. డయాబెటిస్ ఉన్న వారికి బ్లాక్ ఫంగస్ అధికంగా వస్తున్నట్లు గుర్తించామన్నారు. బ్లాక్ ఫంగస్ కేసుల్లో 370 మంది మాత్రమే ఆక్సీజన్ తీసుకున్నారని వెల్లడించారు. 678 మందికి స్టెరాయిడ్స్ ఉపయోగించారని, 748 మంది మాత్రమే డయాబెటిస్ పేషెంట్స్ ఉన్నారని అన్నారు. ఇక 18 ఏళ్ల లోపు వారికి ముగ్గురికి బ్లాక్ ఫంగస్ సోకిందని అనిల్ సింఘాల్ వెల్లడించారు.

బ్లాక్ ఫంగస్ సోకిన వారికి అవసరమైన ఇంజెక్షన్లు, మాత్రలు అందుబాటులోకి తెచ్చుకునేలా ప్రయత్నాలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారని, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. కేంద్రం కేటాయింపుల ప్రకారమే ఇంజెక్షన్లు వస్తున్నాయని చెప్పారు. మాత్రలను అవసరమైనంత మేర సిద్ధం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. అలాగే ప్రత్యామ్నాయ ఇంజెక్షన్ల కోసం కూడా కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

ఇదిలాఉంటే.. సోమవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో 14 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశారు. అనంతరం కోవిడ్ పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాజిటివ్ కేసులు తగ్గుతున్నప్పటికీ.. మరో 10 రోజుల పాటు కర్ఫ్యూ కొనసాగించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇదే సమయంలో కృష్ణపట్నం అంశంపై కూడా సీఎం జగన్ సమీక్షించారు. కాగా, రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. అదే సమయంలో కోలుకునే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతుండటంతో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.

Also read:

రెండు వేర్వేరు వ్యాక్సిన్లను కలిపితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందా….?అధ్యయనానికి త్వరలో రీసెర్చర్ల సన్నాహాలు ..?