Fake Baba: వివాహితపై బురిడీ బాబా అత్యాచారం.. వీడియోతో బ్లాక్‌మెయిల్.. సీన్ కట్ చేస్తే, సెటిల్‌మెంట్ చేసిన సీఐ, ఎస్ఐలపై వేటు..!
బురిడీ బాబా దంపతుల మధ్య ప్రవేశించాడు. గొడవలు రాకుండా సమస్య పరిష్కరిస్తామని అందుకు పూజల పేరుతో దొంగ బాబా వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
Fake Priest Raped Married Woman: యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో పరిష్కారం కోసం మంత్రగాళ్లను ఆశ్రయించారు. దీంతో వివాహితను లొంగదీసుకుని దొంగ బాబా అత్యాచారం చేశాడు. పైగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతూ డబ్బులు దండుకున్నాడు బాబా. అలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన రామన్నపేట మండలం మునిపంపుల గ్రామంలో చోటు చేసుకుంది.
మునిపంపుల గ్రామంలో నివసిస్తున్న భార్య భర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ నేపథ్యంలో ఒక బురిడీ బాబా దంపతుల మధ్య ప్రవేశించాడు. గొడవలు రాకుండా సమస్య పరిష్కరిస్తామని అందుకు పూజలు చేయాలంటూ వారిని నమ్మబలికాడు. పూజల పేరుతో దొంగ బాబా వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, ఈ అత్యాచారం చేస్తున్న సమయంలో దొంగ బాబా అనుచరులు వీడియో చిత్రీకరించారు. ఈ వీడియోను చూపిస్తూ ఆమెను బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డారు.
ఆమె దగ్గర నుండి లక్షల రూపాయలను దోచుకున్నారు. ఇంకా డబ్బులు కావాలంటూ వేధిస్తుండడంతో సదరు బాధితురాలు గత్యంతరం లేక పోలీసులను ఆశ్రయించింది. అయితే, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయకుండా సెటిల్మెంట్ చేశారు. సదరు మహిళలకు సంబంధించిన వీడియోలు డిలీట్ చేసి బాధితురాలికి బాబా దగ్గరనుండి డబ్బులు ఇప్పించారు. అయితే, పోలీసుల ఒప్పందం మేరకు బాధితురాలుకు రావల్సిన మిగతా డబ్బులు ఇవ్వకపోవడంతో రాచకొండ పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించారు. దీంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న సీపీ మహేష్ భగవత్ పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించారు.
కాగా, ఈ విచారణలో పోలీసులు దొంగ బాబాల బాగోతం వెలుగులోకి వచ్చింది. కేసులో నిర్లక్ష్యం వహించిన రామన్నపేట సిఐ శ్రీనివాస్ ను, ఎస్ఐ చంద్ర శేఖర్ ను పోలీసు కమిషనర్ సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురి కోసం స్పెషల్ పార్టీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.