Amaravati: ఐదేళ్ల వరకు రాజధాని నిర్మాణం సాధ్యం కాదు.. హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించిన ఏపీ సర్కార్!

అమరావతి రాజధాని కేసులో ఈనెల 3లోగా రైతులకు ఇచ్చిన స్థలాల్లో పనులు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. గడువు ముగుస్తుండటంతో శనివారం ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది.

Amaravati: ఐదేళ్ల వరకు రాజధాని నిర్మాణం సాధ్యం కాదు.. హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించిన ఏపీ సర్కార్!
Amaravathi
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 02, 2022 | 7:13 PM

AP CS on Amaravati: రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు ఐదేళ్ల సమయం ఇవ్వాలని హైకోర్టు(High Court)ను కోరింది ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం. ప్లాట్ల అభివృద్ధి, నిర్మాణం కోసం నిధుల కొరత ఉందని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే నిధుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. ల్యాండ్ వివాదాలు, కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొంది. హైకోర్టు నిర్దేశించిన గడువులోగా రాజధాని నిర్మాణం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుపై సీఎస్‌ సమీర్‌శర్మ(CS Sameer Sharma) ఉన్నత న్యాయస్థానంలో అఫిడవిట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 190 పేజీల అఫిడవిట్‌ను హైకోర్టుకు సమర్పించారు. అమరావతి రాజధాని కేసులో ఈనెల 3లోగా రైతులకు ఇచ్చిన స్థలాల్లో పనులు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. గడువు ముగుస్తుండటంతో శనివారం ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది.

అమరావతి నిర్మాణంపై ఏపీ హై కోర్టులో సీఎస్ సమీర్ శర్మ అఫిడవిట్ దాఖలు చేశారు.190 పేజీలతో గడువు కోరుతూ అఫిడవిట్ సబ్మిట్ చేశారు. గత నెల మూడో తేదీన అమరావతి నిర్మాణంపై హై కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నెలరోజుల్లోగా రైతుల ప్లాట్ల కేటాయింపు చేయడంతో పాటు ప్రతి నెలా అభివృద్ధి పనులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో వాస్తవ పరిస్థితిని వివరిస్తూ ఐదేళ్ల గడువు ఇవ్వాలని సీఎస్ అఫిడవిట్ లో పేర్కొన్నారు.

కోర్టు ఆదేశాల ప్రకారం రైతులకు ప్లాట్ ల కేటాయింపుపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో భూసమీకరణ ద్వారా రైతులు భూములు ఇవ్వలేదని…అక్కడ భూసేకరణ జరగాల్సి ఉందని తెలిపారు. మిగిలిన చోట్ల 17 వేలకు పైగా ప్లాట్లు రిజిస్ట్రేషన్‌కు సిద్ధంగా ఉన్నట్లు కోర్టుకు వివరించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఇక మౌలిక వసతుల కల్పనకు సంబంధించి కూడా ప్రణాళిక సిద్ధం చేసినట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. గత ప్రభుత్వ సమయంలో రూ.41,678 కోట్ల విలువైన పనులు గ్రౌండింగ్ అయినట్లు చెప్పారు. ఆయా పనులకు సంబంధించి కాంట్రాక్టు సంస్థలకు గత నెల 15న లేఖ రాసినట్లు చెప్పారు. అయితే, ఒప్పందం ప్రకారం పెండింగ్ నిధులు చెల్లింపునకు కృషి చేస్తున్నట్లు తెలిపారు సీఎస్.

నిధుల కోసం గత నెల బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకూ కేంద్రం నుంచి రూ.1500 కోట్లు వచ్చాయని.. ఇతర బ్యాంకులు, సంస్థల నుంచి వచ్చిన నిధుల వివరాలు కూడా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇప్పటిదాకా అయిన ఖర్చు వివరాలు కూడా కోర్టుకు సమర్పించారు. గతంలో వేసిన అంచనాలు ప్రకారం ఎంతెంత ఖర్చు అవుతుందనేది లెక్కలతో సహా అఫిడవిట్ లో పొందుపరిచారు. గతంలో మొత్తం ప్రొబేక్ట్ పూర్తికి రూ.లక్ష 9 వేల కోట్లు అవసరం అవుతుందని.. ఒక్కో ఎకరం అభివృద్ధికి రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు వివరించారు. ఇక నిర్మాణంలో ఉన్న MLA, MLC నివాస భవన సముదాయ పనులను ఈ నవంబర్ చివరి నాటికల్లా పూర్తి చేస్తామని సీఎస్ దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు..

కాంట్రాక్టు ఏజెన్సీలకు గడువు పొడిగింపునకు రెండు నెలలు సమయం పడుతుందని సీఎస్ సమీర్ శర్మ పేర్కొన్నారు. నిర్మాణాల డిజైన్లు సర్వే చేయడానికి నాలుగు నెలలు, మెషినరీ, లేబర్‌ను తీసుకురావడానికి రెండు నెలల సమయం పడుతుందని తెలిపారు. మొత్తంగా పనులు ప్రారంభానికి 8 నెలలు పడుతుందని వివరించారు. రోడ్ల నిర్మాణానికి 16 నెలలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు 36 నెలలు పడుతుందని.. మొత్తంగా అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం పనులు పూర్తి చేయడానికి ఐదేళ్లు సమయం పడుతుందని సీఎస్ సమర్పించిన అఫిడవిట్‌లో వివరించారు.

మరోవైపు, హైకోర్టు ఆదేశాలు పాటిస్తామని… అయితే అందుకు కావాల్సిన గడువు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతోంది. కాగా, హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో సీఆర్డీఏ సీడ్ క్యాపిటల్, సీఆర్డీఏ క్యాపిటల్ రీజియన్ మాస్టర్ ప్లాన్ కూడా జతపరిచారు. భూసమీకరణలో ఉన్న లోపాలు, కేసులపై వివరాలు అందించారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణపై ఉన్న కేసుల వివరాలను కూడా అఫిడవిట్‌లో పేర్కొన్నారు సీఎస్ సమీర్ శర్మ.

—– ఎం.పీ.రావు, టీవీ 9 ప్రతినిధి, విజయవాడ.

Read Also…. Governor Yadadri Tour: గవర్నర్ తమిళిసై యాదాద్రి పర్యటన.. స్వాగత కార్యక్రమంలో కనిపించని అలయ ఈవో!