AP CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఆరోగ్య శ్రీ పరిధిలోకి విష జ్వరాలు..!

రాష్ట్రంలో ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.

AP CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఆరోగ్య శ్రీ పరిధిలోకి విష జ్వరాలు..!
Cm Jagan
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 08, 2021 | 4:15 PM

AP CM YS Jagan Health Review: రాష్ట్రంలో ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్.. విష జ్వరాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా శిశు మరణాలను తగ్గించాలని అధికారులను సీఎం ఆదేశించారు. బుధవారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కోవిడ్ పరిస్థితులపై రివ్యూ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామిలీ హెల్త్‌ డాక్టర్‌ కాన్సప్ట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం.. ప్రజారోగ్యంపై నిరంతర పరిశీలన, పర్యవేక్షణ ఉండాలన్నారు. అలాగే కొత్తగా నిర్మిస్తున్న మెడికల్‌ కాలేజీల్లో పీజీ కోర్సులు కూడా ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో నమోదవుతున్న డెంగ్యూ, చికున్ గున్యా, మలేరియా కేసులు పెరగకుండా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ప్రజలు చికిత్స పరంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు విష జ్వరాలను కూడా ఆరోగ్య పరిధిలోకి తీసుకువస్తున్నట్లు మంత్రి నాని చెప్పారు.

ప్రస్తుతం విశాఖ జిల్లాలో 462 డెంగ్యూ, 31 చికెన్ గున్యా, 708 మలేరియా కేసులు నమోదయ్యాయని మంత్రి తెలిపారు. ఈ సంఖ్య ఇంకా పెరగకుండా, ప్రజలు చికిత్స పరంగా ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలో విషజ్వరాలు ఎక్కువగా నమోదవుతున్నందున దగ్గర అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తం అయిందన్నారు. ఎక్కువ కేసులు ఉన్నచోట స్పెషల్ శానిటేషన్ డ్రైవ్, మెడికల్ క్యాంపులు నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విష జ్వరాలను గుర్తించడానికి రెగ్యులర్‌గా సర్వే జరుగుతుందన్నారు. టెస్ట్స్ ఎక్విప్ మెంట్, మందులు సిద్దంగా ఉంచాలని అధికారులకు చెప్పామన్నారు. మిగతా జిల్లాల కంటే విశాఖపట్నం జిల్లాలో విషజ్వరాలు కాస్త ఎక్కువగా ఉన్నాయని మంత్రి ఆళ్ల నాని చెప్పారు.

ప్రజారోగ్యంపై నిరంతర పరిశీలన, పర్యవేక్షణ ఉండాలన్న సీఎం జగన్.. ఇందుకు అనుగుణంగా యుద్ధప్రాతిపాదికన ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని ప్రాంతాల్లో రక్తం, నీరు, గాలి ఈ మూడింటిపైన పరీక్షలు జరగాలని సీఎం సూచించారు. విలేజ్‌ క్లినిక్స్‌ స్థాయిలో ఈ పరీక్షలు అందుబాటులోకి ఉండాలన్నారు. అవసరమైన చోట సీహెచ్‌సీల్లో కూడా డయాలసిస్‌ యూనిట్లు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. హెల్త్‌డేటాపై అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్న సీఎం.. ఎక్కడ పరీక్షలు చేయించుకున్నా, ఎక్కడ చికిత్స తీసుకున్నా గుర్తింపు కార్డు ద్వారా ఆ వివరాలతో కూడిన డేటా అప్‌లోడ్‌ చేయాలన్నారు. థర్డ్‌వేవ్‌ సమాచారం నేపథ్యంలో కోవిడ్‌ నియంత్రణకు నూతన చికిత్సా విధానాలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

మురికివాడలు, ఏజెన్సీ ప్రాంతాల్లో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. ఎప్పటికప్పుడు నీరు నిల్వ ఉండకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి. సీజనల్ వ్యాధులను మానిటరింగ్ చేయడానికి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి నియమించాం. ఆరోగ్యశాఖ మున్సిపల్ పంచాయితీ శాఖలకు సంబంధించిన అధికారులు సమన్వయంతో పనిచేయాలి. మందులు అందుబాటులో ఉంచాలని జగన్ ఆదేశించారు.

Read Also…  India vs England: ఓటమి తర్వాత ఇంగ్లాండ్ జట్టులో మార్పులు.. ఇద్దరు మెరుగైన ఆటగాళ్లు జట్టులోకి.. ఎవరంటే..?