కేంద్ర ప్రకటనతో మారిన విశాఖ పరిస్థితులు.. అపాయింట్‌మెంట్ కోరుతూ ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
CM YS Jagan letter to PM Modi : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి లేఖ రాశారు. తాను స్వయంగా కలిసి పరిస్థితిని వివరించేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలంటూ సీఎం జగన్ కోరారు. తనతో పాటూ అఖిలపక్ష నేతలు, కార్మిక సంఘాల నాయకుల్ని ఢిల్లీకి తీసుకొస్తానని లేఖలో పేర్కొన్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగి తీరుతుందని కేంద్రం ప్రకటించిన వేళ… ముఖ్యమంత్రి జగన్ ప్రధాని అపాయింట్‌మెంట్ కోరారు. కార్మిక సంఘాల నేతలతో కలుపుకుని అఖిలపక్షంతో వస్తామని, వీలైనంత త్వరగా అపాయింట్‌మెంట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నాలుగు పేజీలతో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు సీఎం జగన్. అలాగే, ప్లాంట్ ప్రైవేటీకరణను నాలుగు ప్రత్యామ్నాయాలను జగన్ సూచించారు. ఏపీ ముఖ్యమంత్రి రాసిన లేఖపై ప్రధాని ఎలా స్పందిస్తాన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదిలావుంటే, పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వక సమాధానం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని అందులో ప్రధానంగా ప్రస్తావిస్తూ… ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు ముఖ్యమంత్రి. గతంలో సూచించిన ప్రత్యామ్నాయాలను మరోసారి ఈ లేఖలో పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏపీ ప్రజల సెంటిమెంట్ అని, విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు పేరుతో ఉద్యమించి సాధించుకున్న ప్లాంట్ అని గుర్తు చేశారు. 1970 ఏప్రిల్ 17న 32 మంది ప్రాణాలు వదిలారని లేఖలో వివరించారు.
2015 వరకు స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉందని, ప్రస్తుతం 6.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి స్థాయికి ప్లాంట్ చేరిందని వివరించారు. ఇప్పుడు నెలకు రూ.200 కోట్ల లాభం వస్తోందని, ఇలాగే కొనసాగితే రెండేళ్లలో ఆర్థికంగా బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు. ప్లాంట్ కోసం ప్రత్యేకంగా గనులను కేటాయించాలని, ఉన్న అప్పులను ఈక్విటీ కింద మారిస్తే భారం తగ్గుతుందని సూచించారు. ప్లాంట్ కింద 7 వేల ఎకరాల అమ్మకం ద్వారా నిధులు సమకూర్చొచ్చని, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని లేఖలో పేర్కొన్నారు సీఎం జగన్.
సోమవారం రాత్రి నుంచి కార్మిక సంఘాలు ఆందోళనలు తీవ్రతరం చేశారు.. కార్మికుల నిరసనలతో విశాఖలో పరిస్థితులు మారిపోయాయి. సోమవారం రాత్రి నుంచి కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన నిరసన కొనసాగుతూనే ఉంది. కేంద్రం ప్రకటనతో ఉన్న ప్రతులను దగ్దం చేశారు. కేంద్రం తీరుకు నిరసనగా మంగళవారం విశాఖలోని ఉక్కుపరిపాలనా భవనం ముట్టడించారు. దీంతో ప్రస్తుత పరిస్థితులను వివరించడానికి, ప్రత్యామ్నాయాలపై చర్చించడానికి అవకాశం ఇవ్వాలని, అఖిలపక్షాన్ని తీసుకొని వస్తామని, అపాయింట్‌మెంట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.