Jagananna Palavelluva: పాలు పోసే రైతులే అమూల్ సంస్థ ఓనర్లు.. జగనన్న పాలవెల్లువ ప్రారంభోత్సవంలో ఏపీ సీఎం జగన్
పాలు పోసే రైతులే అమూల్ సంస్థ యాజమనుల అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ధరలస్థిరీకరణతో ప్రభుత్వం మార్కెట్లోకి ప్రవేశించి.. రైతులకు మంచి ధరలు ఇచ్చే ప్రక్రియకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది.
Jagananna Palavelluva: పాలు పోసే రైతులే అమూల్ సంస్థ యాజమనుల అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ధరలస్థిరీకరణతో ప్రభుత్వం మార్కెట్లోకి ప్రవేశించి.. రైతులకు మంచి ధరలు ఇచ్చే ప్రక్రియకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా బుధవారం ‘జగనన్న పాలవెల్లువ’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. తొలి విడతలో కృష్ణా జిల్లా నూజివీడు క్లస్టర్‌గా అమలు చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో 264 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువ అమలులోకి రానుందని తెలిపారు. పాలవెల్లువ ద్వారా రైతులకు మెరుగైన ధర అందుతుందన్నారు. అమూల్ సంస్థకు పాలు పోయడం వల్ల రూ.10 కోట్ల ఆదాయం వస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు. అమూల్‌అనేది కంపెనీ కాదు.. సహకార సంస్థ అన్నారు. ఐదు జిల్లాల్లో పాడి రైతులకు మెరుగైన ధర లభించిందని సీఎం తెలిపారు. 1064 గ్రామాల నుంచి పాలసేకరణ చేస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఆర్థిక చైతన్యానికి ఈ పాలవెల్లువ కార్యక్రమం ఊతమిస్తోందని పేర్కొన్నారు.
అమూల్‌ద్వారా పాలసేకరణ ప్రారంభించిన ఏడాదిలోగానే 5 జిల్లాల్లో కార్యక్రమం కొనసాగుతుంది. మిగిలిన 7 జిల్లాల్లో కూడా త్వరలోనే పాలసేకరణ ప్రారంభం అవుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో 245 గ్రామాలు, చిత్తూరు జిల్లాలో 275 గ్రామాలు, కడప జిల్లాలో 149 గ్రామాలు, పశ్చిమగోదావరి జిల్లాలో 174, గుంటూరు జిల్లాలో 203 గ్రామాల నుంచి అమూల్ సంస్థ పాలను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 148.50 లక్షల లీటర్ల పాల సేకరణ జరిగింది. పాడి రైతులకు దాదాపు రూ.71 కోట్లు చెల్లించారు. ఇతర డైరీలతో పోల్చితే అమూల్ పది కోట్లు అదనంగా ఇచ్చింది. పాల ఉత్పత్తి దారుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడానికి ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. పాలను ఉత్పత్తి చేసేవారికి అన్యాయం జరుగుతుంది. పాల రైతులకు మరింత మంచి ధర లభిస్తుందన్నారు. అమూల్ దగ్గర మంచి ప్రాససింగ్ యూనిట్లు ఉన్నాయి.. వచ్చే లాభాలను పాడిరైతులకే తిరిగి ఇస్తారని సీఎం జగన్ స్పష్టం చేశారు.