AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ముహూర్తం ఆసన్నమైంది.. రేపే గిరిజన యూనివర్సిటీకి పునాదిరాయి వేయనున్న సీఎం జగన్..

ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారం రాష్ట్రానికి కేటాయించిన అత్యంత కీలకమైన విద్యాసంస్థల్లో సెంట్రల్ ట్రైబుల్ యూనివర్శిటీ ఒకటి. తొమ్మిదిన్నర సంవత్సరాల తరువాత నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో అటు విద్యార్థులు, ఇటు గిరిజన సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధత్తిరాజేరు, మెంటాడ మండలాల్లో సుమారు 561 ఎకరాల్లో నిర్మించనున్న గిరిజన యూనివర్శిటీ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. అందుకు కేంద్రం కూడా ఇప్పటికే 341 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇందుకు మెంటాడ మండలం చిన మేడపల్లి వద్ద..

Andhra Pradesh: ముహూర్తం ఆసన్నమైంది.. రేపే గిరిజన యూనివర్సిటీకి పునాదిరాయి వేయనున్న సీఎం జగన్..
AP-CM-YS-Jagan-to-Lay-Stone for Tribal University
Gamidi Koteswara Rao
| Edited By: Shiva Prajapati|

Updated on: Aug 24, 2023 | 9:41 PM

Share

విజయనగరం జిల్లాలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ శంకుస్థాపనకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. ముఖ్యమంత్రి జగన్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతుల మీదుగా ఈ నెల 25 న లాంఛనంగా భూమి పూజ చేయనున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని వివాదంలోకి లాగుతున్నాయి పలు విపక్షపార్టీలు. అందుకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్య అతిథిగా రావడమే తగదంటూ తప్పుబడుతున్నాయి. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారం రాష్ట్రానికి కేటాయించిన అత్యంత కీలకమైన విద్యాసంస్థల్లో సెంట్రల్ ట్రైబుల్ యూనివర్శిటీ ఒకటి. తొమ్మిదిన్నర సంవత్సరాల తరువాత నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో అటు విద్యార్థులు, ఇటు గిరిజన సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధత్తిరాజేరు, మెంటాడ మండలాల్లో సుమారు 561 ఎకరాల్లో నిర్మించనున్న గిరిజన యూనివర్శిటీ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. అందుకు కేంద్రం కూడా ఇప్పటికే 341 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇందుకు మెంటాడ మండలం చిన మేడపల్లి వద్ద ముఖ్యమంత్రి జగన్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భూమి పూజ చేయనున్నారు. అందు కోసం అధికారులు కూడా భారీగానే ఏర్పాట్లు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ భూమి పూజకి ముఖ్య అతిథిగా ధర్మేంద్ర ప్రధాన్ రావడాన్ని తప్పు పడుతున్నారు విపక్ష నాయకులు. అందుకు ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కారణంగా చెబుతున్నారు.

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఏంటి?

ఈ ఏడాది ఏప్రిల్ 1 న ఆంధ్రా ఒడిశా వివాదాస్పద గ్రామాలైన కొటియా గ్రామాల్లో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పర్యటించారు. అక్కడికి పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రిని ప్రొటోకాల్ లో భాగంగా ఏపికి చెందిన కొటియా సీఐ రోహిణిపతి మర్యాదపూర్వకంగా కలిసేందుకు వెళ్లారు. అలా వెళ్లిన సిఐ పై కేంద్రమంత్రి విరుచుకుపడ్డారు. కొటియా గ్రామాలు ఒడిశాకు చెందినవని, మీకు ఒడిశాలో ఏం పని అని మండిపడ్డారు. దీంతో వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా సి ఐ మాటలు పట్టించుకోకుండా ఆగ్రహంతో ఏపి గో బ్యాక్ అంటూ ధర్మేంద్ర ప్రధాన్ నినాదాలు చేశారు. దేశానికి మంత్రి గా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఒక రాష్ట్రాన్ని గో బ్యాక్ అనడం ఏంటని మండిపడ్డారు ఏపి ప్రజలు. ఇదే వ్యవహారం అప్పట్లో సంచలనం గా మారింది.

ధర్మేంద్ర ప్రధాన్ గో బ్యాక్ అని కౌంటర్ ఇస్తున్న విపక్షాలు..

ఆ వివాదం జరిగిన సుమారు నాలుగు నెలల తరువాత ఇప్పుడు కేంద్రీయ గిరిజన యూనివర్శిటీ శంఖుస్థాపన కి ముఖ్య అతిథిగా వస్తున్నారు ధర్మేంద్ర ప్రధాన్. దీంతో జిల్లాకు చెందిన పలువురు విపక్ష నాయకులు, గిరిజన సంఘాల నాయకులు ధర్మేంద్ర ప్రధాన్ రాకను వ్యతిరేకిస్తున్నారు. దేశానికి మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ దేశంలో అంతర్భాగం అయిన ఆంధ్రాని గో బ్యాక్ అన్న ధర్మేంద్ర ప్రధాన్ జిల్లాకు రావడానికి వీల్లేదని హెచ్చరిస్తున్నారు. అలా వచ్చే పని అయితే ఆంధ్రాకు బహిరంగ క్షమాపణ చెప్పి రావాలని డిమాండ్ చేస్తున్నారు. రేపు ధర్మేంద్ర ప్రధాన్ వస్తున్న నేపథ్యంలో నిరసనలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు పలువురు నాయకులు. కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ శంఖుస్థాపన సందర్భంగా ఇదే అంశం ఇప్పుడు దుమారం రేపుతుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..