Casino Politics:ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్న క్యాసినో.. టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం! చిత్రాలు…
క్యాసినో కాక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది. ఈ అంశంలో అధికార, ప్రతిపక్షాల మధ్య వార్ అంతకంతకూ ముదురుతోంది.

1
- క్యాసినో కాక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది. ఈ అంశంలో అధికార, ప్రతిపక్షాల మధ్య వార్ అంతకంతకూ ముదురుతోంది. గుడివాడలో టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటనతో మొదలైన రచ్చ.. రగులుతూనే ఉంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్ .
- గుడివాడలో క్యాసినో జరిగిందని బలంగా ఆరోపిస్తున్న టీడీపీ.. ఇదిగో సాక్ష్యాలంటూ రోజుకో ఆధారాన్ని బయటకు తీసుకొస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై డీఐజీ, గుంటూరు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన నేతలు.. ఒక్కొక్కటిగా ఆధారాలను బయటకు తీసుకొస్తున్నారు. వాటి ఆధారంగా మంత్రి కొడాలి నానిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
- మరోవైపు, ‘నా సవాల్కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. నా కల్యాణ మండపంలో కాసినోలు, జూదాలు జరిగాయని నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేసి, పెట్రోలు పోసుకుని ఆత్మాహుతి చేసుకుంటా. నిరూపించలేకపోతే పెట్రోలు పోసుకుని ఆత్మాహుతి చేసుకుం టావా’ అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు మంత్రి కొడాలి నాని మరో మారు సవాల్ విసిరారు. ‘చంద్రబాబు నిర్ణయం కోసం పది రోజులు వేచి చూస్తా. అప్పటిలోగా నిరూపించలేకపోతే అక్కడ కాసినోలు జరగలేదని అంగీకరించినట్టే. కల్యాణ మండపం వద్ద ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తే అసలు నిజాలు తెలుస్తాయని మంత్రి నాని అన్నారు.
- ఈనెల 16న రాత్రి క్యాసినో జరిగాక.. 17న ఉదయం.. పదమూడు మంది చీర్ గర్ల్స్… గన్నవరం ఎయిర్పోర్టు నుంచి బెంగళూరుకు.. అక్కణ్నుంచి గోవాకు వెళ్లారని చెప్పారు వర్ల రామయ్య ఆరోపించారు. ఫ్లయిట్ టిక్కెట్ల ఆధారంగా ఈ విషయం స్పష్టమవుతోందన్నారు. ఆ చీర్ గర్ల్స్ గుడివాడకు ఎందుకొచ్చారు? ఎవరికోసం వచ్చారో మంత్రి కొడాలి నాని చెప్పాలని డిమాండ్ చేశారు వర్ల రామయ్య.
- క్యాసినో పేరిట టీడీపీ అనవసరం రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు. క్యాసినో జరిగిందనీ.. మహానుభావులు పుట్టిన గుడివాడ సంస్కృతి నాశనమైందనీ.. గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. మరి, టీడీపీ హయాంలో 365రోజులూ పేకాట క్లబ్బులు నడిపినప్పుడు.. ఆ సంస్కృతికి ఏం కాలేదా? అని ప్రశ్నించారు అంబటి.