Andhra Pradesh: పిల్లనిచ్చిన మామపై ఆర్మీ జవాన్ దాడి.. కోర్టు ప్రాంగణంలోనే బరితెగింపు
జుటిలాగే కోర్టు ప్రారంభమైంది. గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలోకి అప్పుడప్పుడే కక్షిదారులు వస్తున్నారు. అదే విధంగా న్యాయవాదులు, కోర్టు కాని స్టేబుల్స్, వివిధ వర్గాల ప్రజలు కోర్టులోకి వివిధ పనుల నిమిత్తం విచ్చేస్తున్నారు. అయితే ఫ్యామిలీ కోర్టు సమీపంలో ఒక వ్యక్తి రక్తం మడుగులో గిలగిలా కొట్టుకుంటున్నాడు. మరోవైపు ఒక మహిళ అతన్ని..

గుంటూరు, సెప్టెంబర్ 11: రోజుటిలాగే కోర్టు ప్రారంభమైంది. గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలోకి అప్పుడప్పుడే కక్షిదారులు వస్తున్నారు. అదే విధంగా న్యాయవాదులు, కోర్టు కాని స్టేబుల్స్, వివిధ వర్గాల ప్రజలు కోర్టులోకి వివిధ పనుల నిమిత్తం విచ్చేస్తున్నారు. అయితే ఫ్యామిలీ కోర్టు సమీపంలో ఒక వ్యక్తి రక్తం మడుగులో గిలగిలా కొట్టుకుంటున్నాడు. మరోవైపు ఒక మహిళ అతన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తుంది. ఈలోగానే చుట్టుపక్కల వారు గుమికూడి అతన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అసలేం జరిగిందంటే..
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం కొర్రపాడుకు చెందిన దారా శ్రీనివాసరావు ఆర్మీలో జవాన్ గా పనిచేస్తున్నాడు. అతనికి నర్సరావుపేటకు చెందిన జోత్స్నకి ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం శ్రీనివాసరావు పంజాబ్ లో విధులు నిర్వహిస్తున్నాడు. గత కొంతకాలంగా భార్య భర్తల మధ్య విబేధాలు ఏర్పడ్డాయి. ఏడాదిన్నర క్రితం దారా శ్రీనివాసరావు విడాకులు కావాలంటూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. జోత్స్న తన తండ్రి శ్రీనివాసరావు వద్దే ఉంటూ కోర్టుకు హాజరవుతుంది. ఎప్పటిలాగే ఈ రోజు కూడా జోత్స్న తన తండ్రితో కలిసి కోర్టుకు వచ్చింది. దారా శ్రీనివాసరావు ఇప్పటి వరకూ కోర్టుకు హాజరు కాలేదు. జిపిఏ ఇచ్చి తన తల్లినే కోర్టుకు పంపించేవాడు.
అయితే పంజాబ్ లో విధులు నిర్వహిస్తున్న దారా శ్రీనివాసరావు గత నెల 27వ తేదిన సెలవు పెట్టి కొర్రపాడు వచ్చాడు. ఈ రోజు ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యాడు. వాయిదాకు వచ్చిన జోత్స్న కోర్టులోకి వెళ్లింది. కోర్టు నుండి బయటకు వచ్చే సరికి జోత్స్న తండ్రి శ్రీనివాసరావు రక్తపుమడుగులో పడి ఉన్నాడు. కొద్దీ సేపటి క్రితమే అల్లుడు శ్రీనివాసరావు మామ వద్దకు వచ్చి తన చేతిలో ఉన్న బైక్ కీ తో చెవిపై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయమైన మామ శ్రీనివాసరావు కింద పడిపోయాడు. దీంతో అల్లుడు శ్రీనివాసరావు అక్కడ నుండి వెళ్లిపోయాడు. ఈ ఘటన జరగటంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. పోలీసులకు సమాచారం అందంటంతో వెంటనే రంగంలోకి దిగి అల్లుడు దారా శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు.
ఎప్పుడు కోర్టుకు హాజరుకాని అల్లుడు శ్రీనివాసరావు కోర్టుకు రావడం తన తండ్రిపై దాడి చేయడంతో జోత్స్న కన్నీరు మున్నీరుగా విలపించింది. అయితే సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రమాదం తప్పినట్లు వైద్యులు చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.