Banana Prices: సామాన్యులకు షాకింగ్ న్యూస్.. ఒక్కసారిగా పెరిగిన అరటి పండ్ల ధరలు.. పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్
తెలుగు రాష్ట్రాల్లో అరటి పండ్ల ధరలు భారీగా పెరిగాయి. పెళ్లిళ్ల సీజన్ వస్తుండటం, సరఫరా తగ్గడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మరో మూడు నెలల పాటు ఇవే ధరలు కొనసాగే అవకాశముంది. పెళ్లిళ్ల సీజన్ క్రమంలో ధరలు పెరగడం సామాన్యులకు షాక్‌గానే చెప్పవచ్చు.

సామాన్యులకు బిగ్ షాక్ తగిలింది. ఎప్పుడూ సామాన్యులకు అందుబాటులో ఉండే అరటి పండ్ల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ప్రతీ ఇంట్లో తప్పనిసరిగా అరటి పండ్లు తింటూ ఉంటారు. తక్కువ ధరకే ఇవి లభిస్తుండటంతో ప్రతీఒక్కరూ తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇంట్లో ఎప్పుడూ వీటిని ఉంచుకుంటారు. ఇక జ్యూస్‌లు, సలాడ్‌ల రూపంలో కూడా అరటి పండ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఉత్పత్తి తక్కువగా ఉండటం, పెళ్లిళ్ల సీజన్ క్రమంలో డిమాండ్ పెరగడంతో అరటి ధరలు భారీగా పెరిగాయి. సమ్మర్ వస్తుండటంతో మామిడి పండ్లు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. ఇవి వచ్చేంతవరకు అరటి పండ్ల ధరలు ఇలాగే కొనసాగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.
గెల రూ.వెయ్యి
గత నెల వరకు కర్పూర చక్రకేళి, తెల్లచక్రకేళి, ఎర్రచక్రకేళి అరటి గెల రూ.200 నుంచి రూ.300 మధ్య పలికేంది. కానీ ఇప్పుడు ఒక గెల ఏకంగా రూ.700 నుంచి రూ.వెయ్యి వరకు మార్కెట్లో పలుకుతుంది. ఇక మధ్య రకం గెలలు కూడా రూ.800 నుంచి రూ.వెయ్యి పలుకుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ క్రమంలో అరటి పండ్లకు డిమాండ్ ఉంటుంది. ఫుడ్ మెనూలో అరటి పండును సర్వ్ చేస్తూ ఉంటారు. ఇక వాయనం, పూజల సమయంలో కూడా అరటి పండ్లను వాడతారు. డిమాండ్ కారణంగా ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. గత మూడేళ్లుగా వాతావరణ పరిస్థితుల కారణంగా అరటి ఉత్పత్తి ఎక్కువగా జరగలేదు. దీంతో వల్ల రైతుల నుంచి మార్కెట్లోకి సరఫరా తగ్గిపోయింది. వాతావరణ పరిస్థితులు వల్ల నష్టాలు వస్తుండటంతో అరటిని పండించడం రైతులు తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల అరటి ఉత్పత్తి తగ్గిపోవడంతో రేట్లు పెరిగాయి.
ఎప్పుడు తగ్గుతాయి..?
ఏప్రిల్ నెల వరకు ధరలు ఇలాగే కొనసాగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. మామిడి సీజన్ స్టార్ట్ అయితే ధరలు తగ్గుతాయని అంటున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో మామిడి పండ్ల సీజన్ మొదలవుతుంది. అవి మార్కెట్లోకి వస్తే అరటి పండ్ల ధరలు తగ్గుతాయని వ్యాపారులు చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అరటి సాగు ఎక్కువగా ఉంటుంది. గత మూడేళ్లుగా నష్టాల వల్ల అరటి సాగును రైతులు భారీగా తగ్గించారు. దీని వల్ల మార్కెట్లకి అరటి రావడం గణనీయంగా తగ్గింది. దీని వల్ల వ్యాపారులు కూడా ఎక్కువ మొత్తంలో చెల్లించి గెలలను కొనుగోలు చేస్తున్నారు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే అరటి పండ్ల ధరలు పెరగడం సామాన్యులకు షాక్‌గానే చెప్పవచ్చు.
