Andhra Pradesh: కాఫర్ డ్యాం కట్టకపోయినా ఫర్వాలేదు.. పోలవరం పై మంత్రి అంబటి షాకింగ్ కామెంట్స్
గోదావరి వరదలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. జులై నెలలో గోదావరికి వరదలు అరుదుగా వస్తుంటాయని, కానీ ఈ ఏడాది భారీ స్థాయిలో ప్రవాహం రావడం ఆశ్చర్యం కలిగించిందని వ్యాఖ్యానించారు. అది ప్రకృతి విపత్తు అన్న...
గోదావరి వరదలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. జులై నెలలో గోదావరికి వరదలు అరుదుగా వస్తుంటాయని, కానీ ఈ ఏడాది భారీ స్థాయిలో ప్రవాహం రావడం ఆశ్చర్యం కలిగించిందని వ్యాఖ్యానించారు. అది ప్రకృతి విపత్తు అన్న మంత్రి.. మనమేం చేయలేమని చెప్పడం గమనార్హం. ఆకస్మాత్తుగా వరదలు వచ్చినప్పటికీ ముంపు ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టామని వెల్లడించారు. పునరావాస కేంద్రాలకు రాలేని వారికి అక్కడే ఆహారం, ఇతర సదుపాయాలు అందించామని చెప్పారు. విజయవాడలో మంత్రి అంబటి రాంబాబు ఈ కామెంట్స్ చేశారు. 1986 తరువాత ఇంత ఎక్కువ వరదలు ఇప్పుడే వచ్చాయని అంబటి రాంబాబు చెప్పారు. జూలైలో వరదలు వచ్చినా గోదావరి పరీవాహక ప్రాంతాలలో జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. వరద ప్రభావిత జిల్లాలు ఇప్పుడు ఆరు జిల్లాలుగా పునర్విభజన జరిగిందన్న మంత్రి అంబటి.. గతంలో ఇద్దరు కలెక్టర్లు ఉన్న వరద ప్రభావిత ప్రాంతాలకు ఇప్పుడు ఆరుగురు కలెక్టర్లు, ఎస్పీలు ఉన్నారని పేర్కొన్నారు.
పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి ప్రధాన కారణం టీడీపీనే. దీనిపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. కాఫర్ డ్యాం పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్ నిర్మించిన పరిస్థితి ఎక్కడా లేదు. అసలు కాఫర్ డ్యాం కట్టకపోయినా ఫర్వాలేదని ఇంజినీర్లు చెబుతున్నారు. సగం పని చేసి వదిలేయడంవల్లే డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. అయినప్పటికీ.. జులై నెలాఖరు వరకు నిర్మాణం పూర్తి చేయాలని ప్రణాళిక వేసుకున్నాం. నేను ఇంజినీరును కాదు. తెలియని విషయాల్ని అధికారుల్ని అడిగి తెలుసుకుంటున్నా. అన్నీ తెలిసిన టీడీపీ నేతలు 2018 నాటికి పోలవరానికి ఎందుకు పూర్తి చేయలేదు.
– అంబటి రాంబాబు, ఆంధ్రప్రదేశ్ మంత్రి
కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సీఎం ఏరియల్ సర్వే చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కాలికి బురద అంటకుండా హెలికాప్టర్‌లో తిరిగితే ప్రజల కష్టాలు తెలుస్తాయా అని ప్రశ్నించారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజల కష్టాలు తెలుసుకోడానికి ఈ నెల 21, 22 తేదీల్లో తానే.. ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు చెప్పారు. పోలవరం పునరావాస కాలనీలను ఈ మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే ముంపు గ్రామాలకు ఈపరిస్థితి వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.