Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఏపీ పాఠశాల విద్యార్థులకు అలెర్ట్.. ఈ విషయం తెలుసుకోండి..

వేసవి కాలం వచ్చిందంటే మండే ఎండల కారణంగా... అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యి... ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు ఎండ వేడిమిని తట్టుకోవడంలో ఇబ్బంది పడతారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని రక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కొత్తగా ‘వాటర్ బెల్’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు తరచుగా నీరు తాగే అలవాటు పెంచుకోవడంతో పాటు డీహైడ్రేషన్ (నీటి లోపం) సమస్య నుంచి రక్షణ పొందడం లక్ష్యం.

Andhra: ఏపీ పాఠశాల విద్యార్థులకు అలెర్ట్.. ఈ విషయం తెలుసుకోండి..
Andhra Students
Follow us
Eswar Chennupalli

| Edited By: Ram Naramaneni

Updated on: Mar 26, 2025 | 7:30 PM

గత వేసవి కాలంలో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వేడి ప్రభావం కనిపించింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యార్థులు డీహైడ్రేషన్, అలసట, తలనొప్పి, ఒంటినొప్పి వంటి సమస్యలకు గురయ్యారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎండల వల్ల కలిగే అనారోగ్యాలను నివారించేందుకు పాఠశాలల్లో ‘వాటర్ బెల్’ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా క్లాసెస్ మధ్యలో ప్రత్యేక బెల్ మోగించి విద్యార్థులకు నీరు తాగే అవకాశం కల్పించనున్నారు.

వాటర్ బెల్ ఎలా పనిచేస్తుంది?

పాఠశాలల్లో ఉదయం 10 గంటలకు మొదటి వాటర్ బెల్ మోగుతుంది. ఈ సమయంలో ఉపాధ్యాయులు తరగతులను కాసేపు ఆపి, విద్యార్థులను నీరు తాగమని ప్రోత్సహిస్తారు. మరోసారి 11 గంటలకు, మూడోసారి మధ్యాహ్నం 12 గంటలకు వాటర్ బెల్ మోగుతుంది. ప్రతి బెల్ తర్వాత విద్యార్థులు నీరు తాగడానికి రెండు మూడు నిమిషాల సమయం ఉంటుంది.

ఈ కార్యక్రమం కేవలం విద్యార్థుల కోసం మాత్రమే కాకుండా ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది కూడా పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. తగినంత నీరు తాగడం శారీరక ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో అవగాహన కలిగించేందుకు స్కిట్లు, అవగాహన సమావేశాలు నిర్వహించాల్సిందిగా పాఠశాలలకు సూచనలు ఇచ్చారు.

పాఠశాలలకు ముఖ్యమైన బాధ్యతలు

వాటర్ బెల్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం కోసం పాఠశాలలకు కొన్ని ముఖ్యమైన బాధ్యతలు అప్పగించారు. ప్రతి పాఠశాలలో తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలి. అవసరమైన చోట ఆర్.ఓ. ప్లాంట్లు, వాటర్ కూలర్లు లేదా మట్టి కుండలు ఏర్పాటు చేయాలి. నీటి లభ్యతను పర్యవేక్షించి రోజుకు ఒక్కసారి శుభ్రమైన నీటిని నింపడం తప్పనిసరి.

ప్రతి తరగతి గదిలో “ప్రతి గంటకోసారి నీరు తాగండి – ఆరోగ్యంగా ఉండండి” అనే నినాదాలతో పోస్టర్లు పెట్టాలని సూచించారు. విద్యార్థులు నీటి బాటిళ్లు తెచ్చుకునేందుకు ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. నీటి కొరత లేకుండా నిరంతరం నీరు అందుబాటులో ఉంచే బాధ్యత హెడ్‌మాస్టర్లదే.

అమలు పర్యవేక్షణ

ఈ కార్యక్రమం పాఠశాలల్లో సమర్థవంతంగా అమలవుతున్నదో లేదో పర్యవేక్షించేందుకు మండల విద్యాశాఖాధికారులు (MEO), క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు (CRP) యాదృచ్ఛిక తనిఖీలు చేపడతారు. పాఠశాల హెడ్‌మాస్టర్లు ప్రతి వారం వాటర్ బెల్ అమలు గురించి నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.

“విద్యార్థుల ఆరోగ్యం మా ప్రథమ ప్రాధాన్యత. వేసవి కాలంలో విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు, నీరు తాగే అలవాటు పెంపొందించేందుకు ‘వాటర్ బెల్’ అనేది ముఖ్యమైన ముందడుగు,” అని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామ రాజు పేర్కొన్నారు.

ఈ వేసవిలో విద్యార్థులు వేడికి గురికాకుండా, ఆరోగ్యంగా ఉండేందుకు ఈ ‘వాటర్ బెల్’ ఒక చిరస్మరణీయమైన కార్యక్రమంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.