కరోనాతో చనిపోయాక దారుణ పరిస్థితులు.. పలుచోట్ల అంత్యక్రియలకు ముందుకురాని కుటుంబ సభ్యులు
కరోనాతో చనిపోయాక దారుణ పరిస్థితులు నెలకుంటున్నాయి. కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు చేయాలంటే బంధువులు ముందుకు రావడం లేదు... కొన్నిచోట్ల అంబులెన్స్ నిర్వాహకులే మృతదేహాలను...

కరోనాతో చనిపోయాక దారుణ పరిస్థితులు నెలకుంటున్నాయి. కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు చేయాలంటే బంధువులు ముందుకు రావడం లేదు… కొన్నిచోట్ల అంబులెన్స్ నిర్వాహకులే మృతదేహాలను శ్మశానాలకు తరలించి దహనం చేయిస్తున్న దుస్థితి. ఒంగోలులోని పలు శ్మశానాల్లో మృతదేహాలకు అంత్యక్రియలు చేయడం ఎక్కువ కావడంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మున్సిపల్ పరిధిలోని మహాప్రస్థానంలో కరోనా మృతుల అంత్యక్రియలతో నిరంతరం రావణకాష్టంలా రగులుతూనే ఉంది.
ఒంగోలు రిమ్స్‌లోని మార్చూరీలో పేరుకుపోతున్న మృతదేహాలే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం ఒంగోలు రిమ్స్ మార్చూరీలో కెపాసిటీకి మించి 20 మృతదేహాలు ఉన్నాయి. వీటిలో నాన్ కోవిడ్ మృతదేహాలు కూడా ఉన్నాయి. వీటిని తీసుకెళ్ళి అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ముందుకు రాకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు ఒంగోలు నగరంలోని పలు శ్మశానవాటికల్లో కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు స్థానికులు ఒప్పుకోవడం లేదు… తమ శ్మశానాల్లో కెపాసిటికి మించి మృతదేహాలను ఖననం చేశారని, ఇక ఇక్కడికి తీసుకురావద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు…
ఈ పరిస్థితుల్లో ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర మున్సిపాలిటీ నిర్వహణలో ఉన్న మహాప్రస్తానం శ్మశానవాటికకు మృతదేహాలు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి… సాధారణ పరిస్థితుల్లో రోజుకు ఒకటి లేదా రెండు మృతదేహాలు వచ్చేవి… అయితే ప్రస్తుతం కరోనా మరణమృదంగం కారణంగా ప్రతిరోజు పదుల సంఖ్యలో మృతదేహాలు వస్తున్నాయి… కొన్నింటిని బంధువులే తీసుకొచ్చి అంత్యక్రియలు చేస్తుంటే మరికొన్నింటిని అంబులెన్స్ నిర్వాహకులు తీసుకొచ్చి అంత్యక్రియలు చేసి వెళ్ళిపోతున్నారు… తమ కెపాసిటీకి మించి ప్రతిరోజు 13 నుంచి 15 వరకు మృతదేహాలు వస్తున్నాయని, అయినా సరే వాటన్నింటికి వారి ఆచారాల ప్రకారం దహన, ఖనన సంస్కారాలు నిర్వహిస్తున్నామని శ్మశానంలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బంది చెబుతున్నారు. తమకు తలకుమించిన భారంగా మారినా కేవలం మానవతాదృక్పధంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు అందరికీ సహకరిస్తున్నామని చెబుతున్నారు.
Also Read: తెలంగాణలోని ఈ గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా లేదు.. కారణాలు ఏంటంటే
