Andhra: సిటీల్లో డజను రూ.60, 70 అమ్ముతున్నారు.. పండించే చోట ఇది పరిస్థితి…
ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా అనుకునే అనంతపురంలో అరటి రైతుల పరిస్థితి కంటతడి పెట్టిస్తోంది. ఓప్పుడు విదేశాలకు ఎగుమతయ్యే ఈ అరటిపళ్లు, ఏకంగా బనానా ట్రైన్ నడిపించేంత డిమాండ్ ఉన్న పంట… ఇప్పుడు గిట్టుబాటు లేక రోడ్లపై పారబోసే స్థితికి చేరింది.

ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా పిలుచుకునే అనంతపురం జిల్లాలో అరటిపండ్లను రోడ్లపై పారబోస్తున్నారు రైతులు. దేశ, విదేశాల్లో అనంతపురం జిల్లాలో పండించే అరటిపళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో.. తాడిపత్రి నుంచి ఏకంగా ఓ బనానా ట్రైన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇవాళ అదే అరటిపళ్లను గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్లపై పారబోస్తున్నారు. గత కొన్ని రోజులుగా అరటి ధరలు భారీగా పడిపోయాయి.. టన్ను అరటి పండ్ల ధర 28 వేల నుంచి ఏకంగా 1000 రూపాయలకు పడిపోవడం గమనార్హం. దీంతో కిలో అరటిపండు ధర హోల్‌సేల్ మార్కెట్‌లో రూపాయికి దిగజారింది. అరటి రైతులకు ఈ ఏడాది ఎంత ఆధ్వానంగా ఉందో చెప్పేందుకు ఆ గణాంకాలు చాలు. దీంతో వారి ఆవేదన అంతా ఇంతా కాదు.
అనంతపురం జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేసిన ఈ పంట ఇంత దారుణ స్థితికి చేరడానికి రెండు కారణాలు చెబుతున్నారు రైతులు. ఒకటి దళారుల దోపిడీ అయితే… మరొకటి మహారాష్ట్ర నుంచి వస్తున్న అరటి పండ్లు దిగుబడి ఎక్కువగా ఉండటం. పట్టణాల్లో డజను అరటి పళ్లు డజను 60, 70 రూపాయలు ఉంటే. వాటిని పండించిన రైతుకు మాత్రం కనీసం 10 రూపాయలు కూడా ఉండటం లేదు. దీంతో రవాణా ఖర్చులు దండగా అని భావించిన అనంత అరటి రైతులు..గెలలను కోసి… ట్రాక్టర్లలో తరలించి రోడ్డు పక్కన పారబోస్తున్నారు. అలాగే మరి కొంతమంది అసలు అరటి పంటే వేస్ట్ అని భావించి.. తోటను ట్రాక్టర్ డోజర్లతో తొలగించి చదును చేస్తున్నారు. అలా రైతులు రోడ్డు పక్కన పారబోసిన అరటి గెలలు పశువులకు, ఇతర జీవాలకు ఆహారంగా మారుతున్నాయి. దిగుబడి బాగానే ఉన్నా.. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక కన్నీళ్లే మిగిలాయి అంటున్నారు రైతులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
