Poker Sites : గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున పేకాట.. చిలకలూరిపేట పరిధిలో ఎస్పీ నేతృత్వంలో దాడులు.. లక్షల్లో సొమ్ములు స్వాధీనం

పేకాట శిబిరాలపై దాడులు చేసి ఇప్పటివరకు 33 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుండి 13, 38, 000/- నగదు..

Poker Sites : గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున పేకాట.. చిలకలూరిపేట పరిధిలో ఎస్పీ నేతృత్వంలో దాడులు.. లక్షల్లో సొమ్ములు స్వాధీనం
Poker Players
Follow us

|

Updated on: Jun 06, 2021 | 10:20 PM

Guntur Rural : గుంటూరు ఎస్పీ నేత‌ృత్వంలో పేకాట స్థావరాలపై పోలీసు ప్రత్యేక బృందాల దాడులు ఇవాళ వరుస దాడులు నిర్వహించాయి. చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పేకాట స్థావరంపై ఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాల దాడులు చేశాయి. గుంటూరు రూరల్ పరిధిలోని వివిధ ప్రాంతల్లోని పేకాట శిబిరాలపై దాడులు చేసి ఇప్పటివరకు 33 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుండి 13, 38, 000/- నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందని వెల్లడించారు.

కాగా, జిల్లాలో ఏర్పాటు చేసిన పేకాట స్థావరాలపై ఇంకా పోలీసు దాడులు కొనసాగుతున్నాయి. కాగా, ఇటీవలే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తోన్న పేకాట శిబిరాలపై సాగించిన దాడుల్లో కనీవినీ ఎరుగని రీతిలో భారీగా సొమ్ములు పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ కొనసాగుతోన్న వేళ పేకాట రాయుళ్లు గుంటూరు జిల్లాలో రెచ్చిపోతున్నారు. పెద్ద ఎత్తున శిబిరాలు ఏర్పాటు చేసి పేకాట, గుండాట, మూడుముక్కలాటలు నిర్వహిస్తున్నారు.

జిల్లాలోని నిజాంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 29వ తేదీన పేకాట శిబిరాలపై పోలీసులు నిర్వహించిన దాడుల్లో భారీ మొత్తములో నగదు, కార్లు, మోటార్ వాహనాలు, సెల్ ఫోన్లు మొదలగు వాటిని స్వాధీనం చేసుకుని, పేకాట రాయుళ్లని గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో SEB(Special Enforcement Bureau)పోలీసులు.. గుంటూరు రూరల్ పోలీసులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు.

చింతరేవు గ్రామానికి వెళ్ళే దారిలో నున్న భూశంకర్ రావు అనే వ్యక్తి యొక్క రొయ్యల చెరువు వద్ద గల ఒక షెడ్డులో నిర్వహిస్తోన్న పేకాట శిబిరంపై రేపల్లె టౌన్ సిఐ, నగరం SEB SI నేతృత్వంలో సంయుక్త దాడులు నిర్వహించి పేకాట (కోతముక్క) ఆడుతున్న 21 మందిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ దాడిలో రూ. 42, 58, 420/- నగదును, ఒక నగదు లెక్కింపు యంత్రాన్ని, 27 బాక్సుల పేక ముక్కలను, 153 ప్లాస్టిక్ నాణేలను, 32 మొబైల్ ఫోన్లు, 22 కార్లు, 8 మోటార్ బైకులను, 10 కుర్చీలను, 3 టేబుళ్లను, 1- విద్యుత్ జనరేటర్ ను స్వాధీనం చేసుకుని వాటిని సీజ్ చేశారు.

అదే విధంగా నిజాంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ముండ్రేడు గ్రాముములో మోపిదేవి నాగరాజు అనే వ్యక్తికి చెందిన రేకుల షెడ్డునందు నిర్వహిస్తున్న పేకాట(కోతముక్క) స్థావరంపై బాపట్ల రూరల్ సీఐ, నగరం SEB SI నేతృత్వంలోని బృందం దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న 58 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో రూ. 6, 17, 145/- నగదును, ఒక నగదు లెక్కింపు యంత్రాన్ని, 20 కార్లను, 16 మోటార్ బైకులను, 46 మొబైల్ ఫోన్లను, 1 ఆటో, 2 – జనరేటర్లను, 480 పేక ముక్కల బాక్సులను, 580 ప్లాస్టిక్ కుర్చీలు, 27 ప్లాస్టిక్ టేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు.

పేకాట వంటి చట్టవ్యతిరేక ఆటలు ఆడే వారే కాకుండా ఆడటానికి సహకరించడం, ఆడించడం, చూడడం, ఆట ఆడేవారికి కాపలా కాయడం వంటి చర్యలకు పాల్పడే వారిని కూడా ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్టు క్రింద ముద్దాయిలు గా భావించి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని పోలీసులు తెలిపారు.

కావున ప్రజలు ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కోరారు. ఇలాంటి సమాచారం ఉంటే వెంటనే SEB కంట్రోల్ రూమ్ నంబర్ 9490619395 కు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పోలీస్ అధికారులు గుంటూరు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Read also : Hacking : మరింత దగ్గరగా వచ్చేస్తోన్న సైబర్ నేరాలు, ఫేస్‌బుక్ అకౌంట్లు హ్యాక్ చేసి మోసాలు, ఎమ్మెల్యే తల్లి, మహిళానేతకు షాక్.!