ఇసుక, ఇంగ్లీషు ముగిసింది.. ఇక రంగుల రాజకీయం
ఏపీలో ఇప్పటివరకు హాట్‌హాట్‌గా జరిగిన ఇసుక, ఇంగ్లీషు పాలిటిక్స్ కాస్త సైలెంట్ అయ్యాయి. ఇప్పుడు అవి కాస్త రంగుల వైపు మళ్లాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కూడా వైసీపీ జెండా రంగులు వేయడం వివాదం రేపింది. తాజాగా గాంధీ విగ్రహం స్థూపానికి కూడా వైసీపీ రంగులు వేయడం దుమారాన్ని రేపుతోంది. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం భైరపురం గ్రామ సచివాలయం ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం స్థాపానికి, అధికారులు వైసీపీ రంగులు […]
ఏపీలో ఇప్పటివరకు హాట్‌హాట్‌గా జరిగిన ఇసుక, ఇంగ్లీషు పాలిటిక్స్ కాస్త సైలెంట్ అయ్యాయి. ఇప్పుడు అవి కాస్త రంగుల వైపు మళ్లాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కూడా వైసీపీ జెండా రంగులు వేయడం వివాదం రేపింది. తాజాగా గాంధీ విగ్రహం స్థూపానికి కూడా వైసీపీ రంగులు వేయడం దుమారాన్ని రేపుతోంది. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం భైరపురం గ్రామ సచివాలయం ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం స్థాపానికి, అధికారులు వైసీపీ రంగులు వేశారు. ఇది వివాదానికి దారితీస్తోంది. గతంలో పలు ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేశారు అధికారులు. ఒక దశలో అది జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఇప్పుడు విజయనగరం జిల్లాలో గాంధీ విగ్రహ స్థూపానికి వైసీపీ రంగులు వేయడంతో మరోసారి వివాదం చెలరేగింది.
మహాత్మాగాంధీ ఒక ప్రాంతానికో, కులానికో, మతానికో సంబంధించిన వ్యక్తి కాదని, ఆయన విగ్రహ స్థూపానికి వైసీపీ జెండా రంగులు ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. ఈ విషయంలో అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ వివాదాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన చంద్రబాబు, వైసీపీ సర్కార్‌పై మండిపడుతున్నారు. అధికార పార్టీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని, గాంధీ విగ్రహానికి వైసీపీ రంగులు వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఈ ఘటనపై అందరూ స్పందించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం ఈ ఇష్యూపై ట్విట్టర్ వేదికగా ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు.
విపక్ష నేతల విమర్శలతో వెంటనే గాంధీ విగ్రహం స్థూపానికి వేసిన రంగులను మార్చేశారు అధికారులు. తిరుపతిలోని ఓ ప్రభుత్వ కార్యాలయానికి కూడా వైసీపీ జెండా రంగులు వేశారు . దీనిపై కూడా ప్రతిపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని మండిపడుతున్నారు. అయితే అధికార పార్టీ నేతలు మాత్రం ప్రతిపక్షాలకు పనిలేక విమర్శలు చేస్తున్నారని ఎదురుదాడికి దిగుతున్నారు.