ఏపీ మంత్రులు.. వారి హిస్టరీ

ఏపీ సీఎం జగన్ తన కేబినెట్లో 25మందికి చోటు కల్పించారు. ఐతే జగన్ మంత్రివర్గ కూర్పులో సామాజిక సమీకరణలేంటి..? జిల్లాల ప్రాధాన్యతలేంటి..? రాజకీయ వ్యూహమా..? అభివృద్ధి మంత్రమా..? ఎమ్మెల్యేలకున్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్నారా..? జూనియర్లకు ఎలాంటి ప్రాధాన్యమిచ్చారు..? జిల్లాల వారీగా మంత్రులు, వారి రాజకీయ నేపథ్యాన్ని ఓసారి పరిశీలిద్దాం…   ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కృష్ణదాస్..నరసన్న పేట నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఈయన ధర్మాన ప్రసాదరావుకు స్వయానా సోదరుడు. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా […]

ఏపీ మంత్రులు.. వారి హిస్టరీ
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Jun 08, 2019 | 3:50 PM

ఏపీ సీఎం జగన్ తన కేబినెట్లో 25మందికి చోటు కల్పించారు. ఐతే జగన్ మంత్రివర్గ కూర్పులో సామాజిక సమీకరణలేంటి..? జిల్లాల ప్రాధాన్యతలేంటి..? రాజకీయ వ్యూహమా..? అభివృద్ధి మంత్రమా..? ఎమ్మెల్యేలకున్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్నారా..? జూనియర్లకు ఎలాంటి ప్రాధాన్యమిచ్చారు..? జిల్లాల వారీగా మంత్రులు, వారి రాజకీయ నేపథ్యాన్ని ఓసారి పరిశీలిద్దాం…

ధర్మాన కృష్ణదాస్

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కృష్ణదాస్..నరసన్న పేట నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఈయన ధర్మాన ప్రసాదరావుకు స్వయానా సోదరుడు. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన కృష్ణదాస్..వరుసగా 2009, 2014, 2019లోనూ విజయం సాధించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయనకు జగన్ కేబినెట్లో చోటు లభించింది.

బొత్స సత్యనారాయణ

విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన బొత్స సత్యనారాయణ..వైఎస్ఆర్, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేసిన అనుభవముంది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందారు బొత్స. వైసీపీ కీలక నేతగా బొత్స..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ చీఫ్ గా కూడా పనిచేశారు.

పుష్ప శ్రీవాణి

విజయనగరం జిల్లా కురుపాం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు పుష్ప శ్రీవాణి. ఎస్టీ వర్గానికి చెందిన శ్రీవాణి..రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బీఎస్సీ పూర్తి చేసిన శ్రీవాణి..అతి పిన్న వయసులోనే..అంటే 31 ఏళ్లకే మంత్రి పదవిని దక్కించుకున్నారు.

అవంతి శ్రీనివాస్

అవంతి శ్రీనివాస్ అసలు పేరు. ముత్తంశెట్టి శ్రీనివాసరావు. విద్యాసంస్థల అధినేతగా ఉన్న ఆయన..ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంటరయ్యారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే వైసీపీలో చేరి భీమిలి నుంచి గెలుపొందారు. ఒకసారి ఎంపీ, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అవంతి శ్రీనివాస్..కాపు సామాజిక వర్గం నుంచి జగన్ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు.

పిల్లి సుభాష్ చంద్రబోస్

తూర్పుగోదావరి జిల్లా నుంచి ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ ను తన కేబినెట్ లోకి తీసుకున్నారు సీఎం జగన్. బీసీ వర్గానికి చెందిన ఈయన..మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన అనుభవముంది. పార్టీ గెలుపులో ఈయన కీలకపాత్ర పోషించారనే పేరు సంపాదించారు.

కురసాల కన్నబాబు

తూర్పు గోదావరి జిల్లా నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన కురసాల కన్నబాబుకు జగన్ కేబినెట్లో చోటు దక్కింది. కాకినాడ రూరల్ నుంచి గెలుపొందిన ఈయన..జర్నలిస్ట్ గా పనిచేసి ప్రజారాజ్యం సమయంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

పినికే విశ్వరూప్

తూర్పు గోదావరి జిల్లా నుంచి మరో నేత పినిపే విశ్వరూప్ ఎస్సీ సామాజిక వర్గం నుంచి జగన్ కేబినెట్లో మంత్రి పదవిని దక్కించుకున్నారు. అమలాపురం నుంచి గెలుపొందిన విశ్వరూప్ గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీఎస్సీ, బీఈడీ చదివిన ఈయనకు వైఎస్సార్, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన అనుభవముంది.

రంగనాథ రాజు

చెరుకువాడ శ్రీరంగనాథరాజు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి జగన్ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు చెరుకువాడ శ్రీరంగనాథరాజు. ఆచంట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈయనకు..క్షత్రియ కోటాలో మినిస్ట్రీ దక్కింది.

తానేటి వనిత

పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎస్సీ సామాజిక వర్గ కోటాలో మంత్రి పదవిని దక్కించుకున్నారు తానేటి వనిత. కొవ్వూరు నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వనిత..ఎమ్మెస్సీ పూర్తి చేశారు.

ఆళ్ల నాని

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి మూడుసార్లు విజయం సాధించారు ఆళ్ల నాని. కాపు సామాజిక వర్గం నుంచి ఆళ్ల నానికి జగన్ టీమ్ లో స్థానం లభించింది.

కొడాలి నాని

కృష్ణాజిల్లా నుంచి జగన్ కేబినెట్లో ముగ్గురికి చోటు దక్కింది. అందులో గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కొడాలి నాని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. 2004,2009లో టీడీపీ నుంచి గెలుపొందిన నాని..ఆ తర్వాత వైసీపీలో జాయినయ్యారు. 2014, 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవంతో కొడాలి నానికి మంత్రి పదవి దక్కింది.

పేర్ని నాని

కృష్ణా జిల్లా నుంచి జగన్ టీంలో చోటు లభించిన మరో ఎమ్మెల్యే పేర్ని నాని. కాపు సామాజిక వర్గానికి చెందిన నాని..మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న పేర్ని కృష్ణమూర్తి కుమారుడే పేర్ని నాని. వారసత్వంగా రాజకీయాలను పుణికిపుచ్చుకున్న నాని..2004, 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2011లో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ప్రభుత్వ విప్ గా పనిచేసిన అనుభవముంది.

వెల్లంపల్లి శ్రీనివాస్

కృష్ణా జిల్లా వెస్ట్ నుంచి గెలుపొందిన వెల్లంపల్లి శ్రీనివాస్ కు జగన్ కేబినెట్లో చోటు దక్కింది. వైశ్య సామాజిక వర్గ కోటాలో ఆయనను మంత్రి పదవి వరించింది. ప్రజారాజ్యం, కాంగ్రెస్, బీజేపీలో పనిచేసిన ఆయన..రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

మేకతోటి సుచరిత

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి గెలుపొందిన సుచరితకు.. ఎస్సీ కోటాలో జగన్ మంత్రివర్గంలో స్థానం లభించింది. సుచరితకు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అనుభవముంది. జిల్లాలోని రాజకీయ సమీకరణల దృష్ట్యా సుచరితకు అవకాశం కల్పించారు జగన్.

మోపిదేవి వెంకటరమణ

గుంటూరు జిల్లా నుంచి బీసీ వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణకు తన టీమ్ లో అవకాశం కల్పించారు సీఎం జగన్. రాజకీయ అనుభవంతో పాటు పార్టీ పట్ల ఉన్న విధేయతతో మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఐతే ప్రస్తుతం ఏ సభలోనూ సభ్యుడు కాని మోపిదేవి..ఆరు నెలల్లోగా ఎమ్మెల్సీగా ఎన్నిక కావలసి ఉంది.

బాలినేని శ్రీనివాసరెడ్డి

ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డిని మంత్రి పదవి వరించింది. రెడ్డి సామాజిక వర్గ కోటాలో కేబినెట్లోకి తీసుకున్నారు సీఎం జగన్. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలినేనికి గతంలో వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేసిన అనుభవముంది.

ఆదిమూలపు సురేష్ ప్రకాశం జిల్లా నుంచి మంత్రి పదవి దక్కించుకున్న మరో నేత ఆదిమూలపు సురేష్. ఎర్రగొండపాలెం నుంచి గెలుపొందిన సురేష్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీలో అధికార ప్రతినిధిగా పనిచేసిన ఈయనకు..ఎస్సీ కోటాలో మంత్రి పదవి లభించింది.

మేకపాటి గౌతంరెడ్డి ఇక నెల్లూరు జిల్లా నుంచి రెడ్డి సామాజికి వర్గానికి చెందిన మేకపాటి గౌతంరెడ్డికి జగన్ కేబినెట్లో మంత్రి పదవి లభించింది. ఆత్మకూరు నియోజకవర్గం గెలుపొందిన గౌతంరెడ్డి..రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లా నుంచి జగన్ కేబినెట్లో చోటు దక్కించుకున్న మరో నేత అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరు సిటీ నుంచి గెలుపొందిన ఈయన..ఒకసారి కార్పొరేటర్ గా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీసీ సామాజిక వర్గం నుంచి అనిల్ కుమార్ కు మంత్రి పదవి లభించింది.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక రాయలసీమకొస్తే..చిత్తూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏపీ కేబినెట్లో చోటు దక్కింది. వైసీపీలో సీనియర్ నేతైన పెద్దిరెడ్డి..తొలి నుంచి జగన్ తో కలిసి నడిచారు. పార్టీ బలోపేతంలో తన పాత్ర పోషించారు. జిల్లాలో మెజార్టీ స్థానాలు సాధించేందుకు కృషి చేశారు. పుంగనూరు నుంచి గెలుపొందిన ఆయన..పీహెచ్డీ చేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి.. వైఎస్సార్ హయాంలో అటవీశాఖా మంత్రిగా పనిచేసిన అనుభవముంది.

నారాయణస్వామి చిత్తూరు జిల్లా నుంచి జగన్ కేబినెట్లో చోటు దక్కిన మరో నేత నారాయణస్వామి. ఈయనకు ఎస్సీ కోటాలో మంత్రి పదవి లభించింది. గంగాధర నెల్లూరు నుంచి గెలుపొందిన నారాయణస్వామి..రెండుసార్లు విజయం సాధించారు. రాజకీయ నేపథ్యంతో పాటు కష్టకాలంలో పార్టీని సమర్థవంతంగా నడిపిస్తూ..జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు నారాయణస్వామి.

శంకర్ నారాయణ అనంతపురం జిల్లా నుంచి శంకర్ నారాయణకు బీసీ కోటాలో మంత్రి పదవి దక్కింది. పెనుకొండ నుంచి గెలుపొందిన శంకర్ నారాయణకు..అనుభవం లేకపోయినా..రాజకీయ సమీకరణల దృష్ట్యా తన కేబినెట్లోకి తీసుకున్నారు సీఎం జగన్.

అంజాద్ బాషా సీఎం జగన్ సొంత జిల్లాలో మైనారిటీ వర్గానికి చెందిన అంజద్ బాషా మంత్రి పదవిని దక్కించుకున్నారు. కడప నుంచి గెలుపొందిన ఆయన..రెండుసార్లు ఎమ్మెల్యేగా, కార్పొరేటర్ గా పనిచేశారు.

రాజేంద్రనాథ్ రెడ్డి కర్నూలు జిల్లా నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంత్రయ్యారు. వైసీపీలో కీలక నేతైన రాజేంద్రనాథ్ రెడ్డి..రెడ్డి సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి దక్కింది. డోన్ నుంచరి గెలుపొందిన ఈయన..రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పీఏసీ ఛైర్మన్ గా పనిచేశారు.

జయరామ్ ఇక ఇదే జిల్లా(కర్నూల్) నుంచి జగన్ కేబినెట్లో చోటు దక్కించుకున్న మరో నేత గుమ్మనూరు జయరామ్. ఎస్సీ కోటాలో జయరామ్ ను మంత్రి పదవి వరించింది. ఆలూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఈయన..గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. జడ్పీటీసీగా పనిచేశారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu