Amaravati 2.0: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. మరో 44 వేల ఎకరాల భూ సేకరణకు సన్నద్ధం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటోంది. అమరావతిని ఒక సమగ్ర, ప్రగతిశీల రాజధానిగా తీర్చిదిద్దే క్రమంలో చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. రాజధానిలో పెరుగుతున్న అవసరాలు, కీలక పౌర సదుపాయాలకు స్థలాభావం కారణంగా మరో 44,676 ఎకరాల భూమి సమీకరణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటోంది. అమరావతిని ఒక సమగ్ర, ప్రగతిశీల రాజధానిగా తీర్చిదిద్దే క్రమంలో చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. రాజధానిలో పెరుగుతున్న అవసరాలు, కీలక పౌర సదుపాయాలకు స్థలాభావం కారణంగా మరో 44,676 ఎకరాల భూమి సమీకరణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దీని కోసం సంబంధిత అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు.
రైతులే ముందుకొస్తున్నారు..
ఈసారి విశేషం ఏమిటంటే – గతానికి భిన్నంగా, రైతులే ముందుగా ప్రభుత్వాన్ని సంప్రదించి తమ భూములను అభివృద్ధి కోసం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. తూళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాలకు చెందిన పలు గ్రామాల రైతులు స్వయంగా ప్రభుత్వ అధికారులను కలసి, “అమరావతిని అభివృద్ధి చేయాలంటే మేము తోడ్పడతాం” అని స్పష్టం చేశారు.
అవసరాలు పెరిగినా, స్థలాభావంతో ఇబ్బందులు
ప్రస్తుతం రాజధానిలో అందుబాటులో ఉన్న భూమి కేవలం 2,000 ఎకరాలు మాత్రమే. కానీ ఒక్క గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కే 4,000 ఎకరాల స్థలం అవసరం. ఇక అంతర్జాతీయ ప్రమాణాల మౌలిక సదుపాయాలు, ఐటి పార్కులు, ప్రభుత్వ కార్యాలయాల కోసం కూడా భారీ స్థలాల అవసరం ఉంది.
ఫేజ్-2 లో భాగమైన 11 గ్రామాలు – పూర్తి వివరాలు
సీఆర్డీఏ (CRDA) ఈ కొత్త దశలో నాలుగు మండలాల్లోని 11 గ్రామాల్లో భూములు సేకరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
తూళ్లూరు మండలం: హరిచంద్రాపురం, వడ్డమాను, పెదపరిమి – 9,919 ఎకరాలు
అమరావతి మండలం: వైకుంఠపురం, ఎండ్రాయి, కార్లపూడి, మొత్తడాక, నిడముక్కల – 12,838 ఎకరాలు
తాడికొండ మండలం: తాడికొండ, కంతేరు – 16,463 ఎకరాలు
మంగళగిరి మండలం: కాజా – 4,492 ఎకరాలు
ఈ మొత్తం కలిపి 44,676 ఎకరాల భూమిని సమీకరించేందుకు సీఆర్డీఏ సన్నద్ధమవుతోంది.
భూముల వినియోగంపై స్పష్టత
ఈ కొత్త భూముల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, రాజధాని ఔటర్ రింగ్ రోడ్ (ORR), ఇన్నర్ రింగ్ రోడ్ (IRR), మల్టీ నేషనల్ కంపెనీల స్థల కేటాయింపులు మొదలైన వాటికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీంతో అమరావతికి మరింత ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది.
ప్రారంభం – రైతుల సహకారంతోనే
ప్రభుత్వం అభిప్రాయం ప్రకారం, ఎటువంటి బలవంతం లేకుండా, మెజారిటీ రైతులు ముందుకొచ్చిన గ్రామాలతో మొదటగా ఈ భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం త్వరలోనే అధికార నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రైతులకు ప్రోత్సాహక ప్యాకేజీలు, భవిష్యత్ రహదారి, విద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాల ప్రణాళిక కూడా రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటి వరకు ఎంత భూమి?
గతంలో 29 గ్రామాల్లో 34,689 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన సీఆర్డీఏ, ఇప్పుడు ఫేజ్-2 భూ సమీకరణతో అమరావతి విస్తరణకు మరో అడుగు ముందుకేస్తోంది.
కీలకం కానున్న అమరావతి
అమరావతి రీ-ఎంట్రీ ఈసారి రైతుల పునఃవిశ్వాసంతో, మౌలిక అవసరాలపై స్పష్టతతో కనిపిస్తోంది. కానీ గతంలో జరిగిన రాజకీయ అపోహలు, భూసేకరణ ప్రక్రియలపై జరిగిన విమర్శలు ఇప్పటికీ మిగిలే ఉత్కంఠగా ఉన్నాయి. ఈసారి రైతుల సహకారంతో, పారదర్శకతతో ముందుకెళితే – అమరావతి మరలా రాష్ట్ర అభివృద్ధికి కీలకం కావచ్చు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..