AP News: ఇది నిజమండీ బాబు.. ఒక మొక్కకు 20 రకాలు పూలు.. మరో మొక్కకు 20 రకాల పండ్లు
మన పెరట్లో మనకు ఉండే కొద్దిపాటి స్థలంలోనే రకరకాల పూలు, ఇష్టమైన రకాల మామిడి పండ్లు పండించాలని అంతా అనుకుంటాం..
సహజంగా పూలు, పండ్లు అంటే అందరికీ చాలా ఇష్టమే. అందులోనూ పండ్ల రారాజు మామిడి అన్నా, జిగేల్ మనే మందారం అన్నా ఇంకా ఇంకా ఇష్టం..! అయితే మామిడి పండులో, మందార పువ్వులో అనేక జాతులు ఉన్నాయి. అయితే అన్ని రకాల మామిడి పండ్లు, మందార పువ్వులు ఒకే చోట వేయాలంటే చాలా స్థలం కావాలి. అలాగే పట్టణాల్లో ఉండే వారికి అన్ని జాతులు ఒకే చోట వేసే అంత స్థలం ఉండదు. పల్లెటూరులో కూడా కొద్దిపాటి స్థలం ఉండే వారికి అన్నిరకాల మామిడి లేదా మందార పువ్వుల మొక్కలు వేయడం సాధ్యం కాదు.
అందుకోసం మన పెరట్లో మనకు ఉండే కొద్దిపాటి స్థలంలోనే రకరకాల పూలు, ఇష్టమైన రకాల మామిడి పండ్లు పండించాలని అంతా అనుకుంటాం.. కానీ అంత స్థలం లేకపోవడం వల్ల ఎక్కువ రకాల పూలు, పండ్లు పండించలేకపోతున్నామే అని భాధ పడుతుంటాం. అలాంటి వారికి పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు శుభవార్త చెప్తున్నారు. వినూత్న పద్ధతిలో సాగు చేసి ఒకే మొక్కకు మీకు ఇష్టమైన ఇరవై రకాల పండ్లు, ఇరవై రకాల పూలు పండించేలా శిక్షణ ఇస్తున్నారు.
మామిడికాయ సీజన్ వస్తే మార్కెట్లో అనేక రకాల మామిడి పండ్లు మనం చూస్తుంటాం. వాటిలో బంగినపల్లి, నీలం, చందూర, రుమనియా, మాల్గోవా, చక్కెర కట్టి, గిర్ కేసర్, రసాలు, కొలంగోవా వంటి భిన్న రకాల మామిడి పండ్లు మనకి నోరూరిస్తుంటాయి. అలాగే మందారంలో కూడా తెల్ల, నల్ల, ఎర్రతో పాటు సుమారు ఇరవై రకాల మందారాలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని రకాల మామిడి జాతులు ఒకే మామిడి చెట్టుకి అంటుకట్టు విధానం ద్వారా సాగు చేసి పండిస్తున్నారు. ఈ సాగులో ఒక మామిడి మొక్క తీసుకొని ఆ మొక్కకు పలు రకాల మామిడి మొక్కల చిన్న సైజు కొమ్మలను అంటుకట్టి పెంచుతారు. అలా అంటుకట్టి పెంచిన మొక్కలు పండ్లు సాగు సమయానికి వచ్చేసరికి ఏ రకం మొక్క అంటుకడితే అదే రకం మామిడి పండు దిగుబడి వస్తుంది.
అలాగే మందార మొక్కకు కూడా ఆంటుకట్టు విధానం ద్వారా ఇరవై రకాల మందార జాతుల పూలు ఒకే మొక్కకు సాగు చేయవచ్చు. ఈ విధానాన్ని గిరిజన రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నారు ఉద్యానవన శాఖ అధికారులు.. ఉద్యానవన శాఖ అధికారులు చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..