Andhra: రిజర్వాయర్‌లో దొరికిన కుళ్లిన డెడ్‌బాడీ.. 6 నెలల తర్వాత తేలిన అసలు నిజం..
భర్త దగ్గర దొరకని సంతోషం.. వేరే మగాడి దగ్గర దొరుకుతుందని కొంతమంది భార్యలు.. వివాహ బంధాన్ని తెంచుకోవటానికి కూడా వెనుకాడడం లేదు.. ఆఖరికి అడ్డొచ్చిన భర్తలను కూడా చంపేస్తున్నారు.. రోజు తాగి వచ్చి కొడుతున్నాడని.. వేధిస్తున్నాడని.. ప్రియుడితో కలిసి ఇంట్లోనే భర్తను హత్య చేయించింది ఓ భార్య. భర్తను హత్య చేసి ఆ డెడ్‌బాడీని రిజర్వాయర్ నీటిలో పడేసింది. ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసిన ఆ భార్య బాగోతాన్ని ఆరు నెలల తర్వాత పోలీసులు బట్టబయలు చేశారు. శ్రీ సత్య సాయి జిల్లా లో ఆరు నెలల క్రితం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన మర్డర్ మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు చేధించారు. భార్య అసలు నిందితురాలని తెలుసుకొని పోలీసులు షాక్ అయ్యారు.

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం వంకరకుంట గ్రామానికి చెందిన రామప్ప, గంగాభవాని భార్యాభర్తలు. ఆరు నెలల క్రితం గంగాభవాని భర్త రామప్ప బుక్కపట్నం మండలం మారాల రిజర్వాయర్‌లో శవమై కనిపించాడు. అప్పట్లో గుర్తుతెలియని వ్యక్తిని హత్య చేసి.. కాళ్లు, చేతులు కట్టేసి చాపలో చుట్టి మారాల రిజర్వాయర్లో పడేసినట్లు బుక్కపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. చుట్టుపక్కల పోలీస్ స్టేషన్‌లలో ఎక్కడా మిస్సింగ్ కేసులు నమోదు కాకపోవడంతో… చనిపోయిన వ్యక్తి ఎవరు అనేది కనుక్కోవడం పోలీసులకు పెద్ద సవాల్ గా మారింది. డెడ్‌బాడీని మారాల రిజర్వాయర్లో పడేసిన 10 రోజుల తర్వాత దొరకడంతో…. పూర్తిగా బాడీ డికంపోజ్ అవడం వల్ల చనిపోయిన వ్యక్తి ఎవరు అనేది గుర్తించలేకపోయారు. మృతుడి చేతికి ఉన్న రాగి కడియం ఆధారంగా.. అదే విధంగా మారాల రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్స్ సిగ్నల్స్ ట్రాక్ చేయడం ద్వారా అసలు విషయం బయటపడింది. చనిపోయిన వ్యక్తి నల్లమోడ మండలం వంకర కుంట గ్రామానికి చెందిన రామప్పగా గుర్తించిన పోలీసులు…. ప్రియుడితో కలిసి రామప్ప భార్య గంగాభవానియే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
రామప్ప రోజు తాగి వచ్చి కొడుతున్నాడని.. వేధిస్తున్నాడని… వంకర కుంట గ్రామానికి చెందిన గంగాద్రి అనే వ్యక్తితో గత కొన్ని సంవత్సరాలుగా గంగాభవాని అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. ఓవైపు భర్త రామప్ప వేధింపులు.. మరోవైపు భర్త తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్య గంగాభవాని ప్రియుడుతో కలిసి మర్డర్ స్కెచ్ వేసింది. ఆరు నెలల క్రితం అంటే జూలై 27వ తేదీన భర్త రామప్పకు ఇంట్లోనే ఫుల్‌గా మద్యం తాగించి.. మత్తులోకి జారుకున్న తర్వాత భార్య గంగాభవాని, ప్రియుడు గంగాద్రి తోపాటు మరో ఇద్దరితో కలిసి రామప్పను హత్య చేశారు. మొదట తలపై బండరాయితో మోది… అనంతరం గొంతు నులిమి రామప్పను హత్య చేశారు. హత్య అనంతరం మృతదేహాన్ని ప్రియుడు గంగాద్రి స్నేహితులైన విష్ణు, సుదర్శన్‌లు బైక్‌పై తీసుకొని వెళుతుండగా బైక్ పంచర్ అయింది. దీంతో గంగాభవాని ప్రియుడు గంగాద్రి ఆటోలో మారాల రిజర్వాయర్ వైపు డెడ్ బాడీని తీసుకుని వెళ్లి.. అక్కడ కాళ్లు చేతులు కట్టేసి.. చాపలో చుట్టి.. రిజర్వాయర్‌లో పడేశారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో మరుసటి రోజు భార్య పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్త కనిపించడం లేదని మిస్సింగ్ కేస్ పెడుతుంటారు. కానీ ఈ కేసులో భార్య గంగాభవాని తన భర్త కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదు. దీంతో జులై 27వ తేదీన హత్యకు గురైన రామప్ప డెడ్ బాడీ మారాల రిజర్వాయర్లో ఆగస్టు 8వ తేదీన నీటిపైకి తేలడంతో పోలీసులు గుర్తించారు… అంటే హత్య జరిగిన పది రోజుల తర్వాత డెడ్ బాడీ గుర్తుపట్టలేని విధంగా ఉన్న స్థితిలో పోలీసులు గుర్తించారు. దీంతో చనిపోయిన వ్యక్తి ఎవరు అనేది గుర్తుపట్టడం కష్టంగా మారడంతో పాటు.. కచ్చితంగా హత్య చేసి అనంతరం కాళ్లు చేతులు కట్టేసి రిజర్వాయర్లో పడేశారు అని పోలీసులు ప్రాథమికంగా ఓ నిర్ధారణకు వచ్చారు.
దీంతో సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా… సెల్‌ఫోన్ సిగ్నల్స్ మారాల రిజర్వాయర్ చుట్టుపక్కల జల్లెడ పట్టడంతో…. జూలై 27వ తేదీ అర్ధరాత్రి మారాల రిజర్వాయర్ దగ్గర భార్య గంగాభవాని ప్రియుడు గంగాద్రి… హత్యకు సహకరించిన అతని స్నేహితులు విష్ణు, సుదర్శన్‌ల సెల్ ఫోన్ సిగ్నల్ ఆ సమీప ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. హత్య జరిగిన ఆరు నెలల తర్వాత పోలీసులు నిందితులను పట్టుకొని తమదైన శైలిలో విచారించడంతో.. రామప్పని చంపిన అసలు హంతుకురాలు భార్య గంగ భవాని అని…. ప్రియుడు గంగాద్రితో కలిసి రామప్పను అతి దారుణంగా హత్య చేశారని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.
మారాల రిజర్వాయర్‌లో డెడ్ బాడీ దొరికిన రోజే హత్య చేసే పడేశారు అని పోలీసులకు తెలిసినా.. చనిపోయిన వ్యక్తి ఎవరు అన్నది…. అదే విధంగా ఎవరు హత్య చేసి రిజర్వాయర్లో పడేసారు అన్నది తెలుసుకోవడం పెద్ద సవాలుగా మారింది. ఈ కేసును సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ చాలా సీరియస్‌గా తీసుకోవడంతో… ఎట్టకేలకు ఆరు నెలల తర్వాత రామప్ప హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు.. పోలీసులు ఊహించినట్లే ప్రియుడుతో కలిసి భర్త రామప్పను భార్య గంగాభవానియే హత్య చేసి…. రిజర్వాయర్లో పడేసి…. చేసిన పాపం కప్పిపుచ్చుకోవాలనుకున్నప్పటికీ… పోలీసులకు చిక్కారు. రామప్ప హత్య కేసులో భార్య ప్రధాన నిందితురాలిగా పేర్కొన్న పోలీసులు… ప్రియుడు గంగాధ్రి ఎ2గా, సహకరించిన విష్ణు, సుదర్శన్‌లను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు. కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాల్సిన చోట… ఏకంగా హత్యల వరకు వెళ్లడం సరైనది కాదు అంటున్నారు పోలీసులు.
