AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: వింతగా ప్రవర్తిస్తున్న బాలిక.. చర్చికి తీసుకెళ్లి.. కరవకుండా నోటికి గుడ్డ కట్టారు.. కాసేపటికి..

మూఢనమ్మకం బాలిక ప్రాణాలపైకి తెచ్చింది. పదేళ్ల బాలిక వింత ప్రవర్తన  చేస్తుండడంతో.. ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన అమ్మ, అమ్మమ్మ చర్చికి తీసుకెళ్లారు. బాలికకు దెయ్యం పట్టిందని భావించి.. ప్రార్థనలు చేస్తే నయమవుతుందని అనుకొని రోజంతా తిప్పారు. చివరకు ఆమె నియంత్రణ తప్పడంతో.. నోటికి వస్త్రాన్ని కట్టారు. చర్చిలో కింద పడుకోబెట్టిన బాలిక మళ్లీ తిరిగి లేవలేదు. అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. విశాఖ జ్ఞానాపురం చర్చిలో ఈ ఘటన జరిగింది.

Andhra: వింతగా ప్రవర్తిస్తున్న బాలిక.. చర్చికి తీసుకెళ్లి.. కరవకుండా నోటికి గుడ్డ కట్టారు.. కాసేపటికి..
Purnachandrika In Church
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Apr 25, 2025 | 7:05 PM

Share

విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన పదేళ్ల పూర్ణచంద్రిక గత కొంతకాలంగా వింత వింతగా ప్రవర్తిస్తోంది. తల్లిదండ్రులు వేర్వేరుగా ఉండడంతో.. తల్లి, అమ్మమ్మ, చంద్రిక ఒకే దగ్గర ఉంటున్నారు. అయితే.. గత కొంతకాలంగా చంద్రిక మానసిక సమస్యలతో సతమతమవుతుంది. వింతగా ప్రవర్తిస్తూ ఉండటంతో.. దెయ్యం పట్టిందని అనుకున్నారు తల్లి వరలక్ష్మి, అమ్మమ్మ సావిత్రి. ఎవరు సలహా ఇచ్చారో ఏమో గానీ.. ఆసుపత్రికి చంద్రికను తీసుకెళ్లాల్సిన తల్లి, అమ్మమ్మ.. ప్రార్థనలు చేస్తే నయమవుతుందని భావించారు. చంద్రిక ఆరోగ్య పరిస్థితి నయం చేయించేందుకు.. విశాఖ వచ్చారు. ఒక చర్చికి వెళ్లి ప్రార్థనలు చేయమనడంతో అక్కడి నిర్వాహకులు అందుకు ఒప్పుకోలేదు. దీంతో  అక్కడి నుంచి కొత్తవలస బాలికను తీసుకెళ్లారు. అక్కడ కూడా వారు వద్దని చెప్పడంతో… మళ్లీవిశాఖకు తీసుకువచ్చి కాన్వెంట్ జంక్షన్‌లోని చర్చ్‌కు తీసుకొచ్చారు. అక్కడ తల్లి, అమ్మమ్మ ప్రాధేయపడడంతో… ఫాదర్ ప్రార్థన చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా బాలికతో పాటు వారు అక్కడే ఉన్నారు. బాలిక వింతగా ప్రవర్తించడంతో స్థానికులు ఏమైందని ప్రశ్నించారు. ఆరోగ్యం బాగోలేదని తల్లి, అమ్మమ్మ వారికి బదులిచ్చారు. సాయంత్రం సమయంలో మరికొంతమంది ప్రార్థనల కోసం చర్చికి వచ్చారు. ఆ సమయంలో బాలిక బోర్లా పడుకుని ఉండడాన్ని గమనించి ప్రశ్నించారు. బాలికను పలకరించేందుకు ప్రయత్నించిన వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో వారు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగారు పోలీసులు. వారు చర్చి వద్దకు వెళ్లే సమయానికి బాలిక చలనం లేకుండా ఉంది. ముఖానికి వస్త్రాలు చుట్టినట్టు కనిపించింది. 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న సిబ్బంది బాలికను పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు.

మూఢనమ్మకమే ప్రాణం తీసిందా..!

మానసిక ప్రవర్తన సరిగా లేకుంటే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన తల్లి, అమ్మమ్మ.. ప్రార్థన కోసం తీసుకువచ్చి.. చికిత్స అందించకపోవడంతో బాలిక ప్రాణాలు కోల్పోయినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. తల్లి వరలక్ష్మి, అమ్మమ్మ సావిత్రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గత కొంతకాలంగా తల్లిదండ్రులు వేరువేరుగా ఉంటున్నారు. తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించారు.

‘డెంకాడకు చెందిన పూర్ణచంద్రిక మానసిక సమస్యలతో బాధపడుతోంది. గత కొంతకాలంగా తల్లిదండ్రులు వేర్వేరుగా ఉంటున్నారు. బాలికకు దయ్యం పట్టింది అంటూ ప్రార్థన కోసం చర్చికి తీసుకెళ్లారు. కొత్తవలసతో పాటు విశాఖలోని వేరు వేరు చోట్ల బాలికను తిప్పారు. బాలిక అరవడంతో నోటికి వస్త్రం చుట్టారు. కరుస్తుందని భయపడి వస్త్రాన్ని బిగించారు. ఆ తర్వాత బాలికను పడుకోబెట్టారు. బాలిక ప్రాణాలు కోల్పోయినట్టు చర్చి నుంచి మాకు సమాచారం అందింది. మృతదేహాన్ని మార్చురికి తరలించాం. మానసిక సమస్య ఉంటే వైద్యం చేయించాలి.. ప్రార్థన కోసం తీసుకువచ్చి బాలికను నియంత్రించారు. ముఖంపై కమిలిన గాయాలు ఉన్నాయి. పోస్టుమార్టం తర్వాత బాలిక మృతికి అసలు కారణం తెలుస్తుంది. బాలిక అమ్మ, అమ్మమ్మను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. విశాఖకు తీసుకువచ్చిన విషయం తండ్రి శ్రీనివాస్‌కు తెలియదు’ అని టీవీ9తో ఏసీపీ పృథ్వితేజ చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..