US Coronavirus Cases: డెల్టాకు తోడైన ఒమిక్రాన్.. అగ్రరాజ్యంలో అల్లకల్లోలం.. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు
US Covid-19 cases: అగ్రరాజ్యం అమెరికా మరోసారి అల్లకల్లోలం అవుతోంది. అక్కడ బుధవారంనాడు రికార్డు స్థాయిలో..
Covid-19 Cases in US: కరోనా మళ్లీ మహోగ్రరూపం దాల్చింది. డెల్టాకు ఒమిక్రాన్ తోడవ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా రోజు వారి కేసులు దడ పుట్టిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా మరోసారి అల్లకల్లోలం అవుతోంది. అక్కడ బుధవారంనాడు రికార్డు స్థాయిలో కొత్తగా 4.88 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరుసటి రోజే ఈ రికార్డు బద్దలయ్యింది. గురువారంనాడు ఆ దేశంలో ఏకంగా 5.80 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత ఏడాది వింటర్‌తో పోల్చితే ఇప్పుడు అక్కడ రెట్టింపు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో అమెరికాలో మునుపెన్నడూ లేనంత స్థాయిలో వైరస్ విజృంభిస్తున్నట్లు గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. అయితే ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య, మరణాల సంఖ్య పెరగకపోవడం అమెరికాకు కాస్త ఊరట కలిగించే అంశం.
ఒమిక్రాన్‌తో తీవ్ర అస్వస్థతకు గురైయ్యే వారి సంఖ్య..డెల్టా బారినపడిన వారితో పోల్చితే చాలా తక్కువగానే ఉంది. గత రెండు వారాల్లో అక్కడ కోవిడ్ మరణాల సంఖ్య 5 శాతం మేర తగ్గింది. ప్రస్తుతం సరాసరిగా ప్రతిరోజూ 1,221 మరణాలు నమోదవుతున్నాయి. అదే సమయంలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యే కరోనా బాధితుల సంఖ్య 15 శాతం పెరిగింది. ప్రస్తుతం ప్రతి రోజూ సరాసరిగా 78,781 మంది కరోనా బాధితులు ఆస్పత్రిలో చేరుతున్నారు.
కరోనా, ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో అమెరికాలోని పలు విమానయాన సంస్థలు వేలాది విమాన సర్వీసులను రద్దు చేశాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా పరీక్షల కోసం క్యూలైన్లలో గంటల తరబడి నిల్చోవాల్సిన దుస్థితి నెలకొంటోంది. క్రిస్మస్, న్యూఇయర్ హాలిడే సీజన్ కారణంగా వైరస్ ఇన్ఫెక్షన్ పెరిగినట్లు వైద్య నిపుణులు నిర్థారణకు వచ్చారు. వైరస్ ఉధృతితో అమెరికాలో న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ చెప్పేందుకు ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్స్ రద్దవుతున్నాయి. మూడో సంవత్సరం కోవిడ్ భయాల ద్వారా కొత్త సంవత్సరాన్ని స్వాగతం పలికేందుకు అమెరికన్లు సన్నద్ధమయ్యారు.
గడిచిన 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 16 లక్షల మంది వైరస్ బారినపడ్డారు. 7,317 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్రాన్స్‌లో కేసులు 2 లక్షలకు తగ్గడం లేదు. జర్మనీలో పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. అమెరికా తర్వాత రష్యాలో మరణాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. పోలండ్‌లో మృతుల సంఖ్య అధికంగా నమోదవుతోంది. ఒమైక్రాన్ ఉధృతితో యూకే అతలాకుతలం అవుతోంది. ఇదివరకు ఎన్నడూ లేనంతగా కొత్తగా లక్షా 83 వేల పాజిటివ్ కేసులు అక్కడ నమోదయ్యాయి. ముందుజాగ్రత్తగా ప్రభుత్వం ఆస్పత్రుల్లో రోగులకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తోంది.
పెద్దగా మరణాలేవీ లేకుండా తమ దేశం ఒమిక్రాన్ వేవ్‌ను అధిగమించినట్లు దక్షిణాఫ్రియా ప్రకటించుకుంది. ఆ మేరకు ఆరోగ్య శాఖ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నట్లు తెలిపింది. అయితే మిగిలిన దేశాలు మాత్రం ఒమిక్రాన్ ఉధృతి పెరగడంతో హడలెత్తిపోతున్నాయి.
Also Read..
Google New Year: గూగుల్‌పై క్లిక్ చేస్తే ఏమవుతుందో చూశారా.? అయితే ఓ సారి ఇది చదవండి..
Ram Charan: శంకర్ సినిమాకు రామ్‌చరణ్ రెమ్యునరేషన్ రూ.100 కోట్లు.. క్లారిటీ ఇచ్చేసిన చెర్రీ..