కరోనాపై యుధ్ధం.. మూడు వారాల దిగ్బంధంలో ఇండియా. మరో ఇటలీలా మారనున్న అమెరికా .
కరోనాపై యుధ్ధానికి దిగిన ఇండియాలో ప్రధాని మోదీ ప్రభుత్వం మూడు వారాలపాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. బ్రిటన్ మాదిరే ఆ దేశం సరసన చేరింది.
కరోనాపై యుధ్ధానికి దిగిన ఇండియాలో ప్రధాని మోదీ ప్రభుత్వం మూడు వారాలపాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. బ్రిటన్ మాదిరే ఆ దేశం సరసన చేరింది. అక్కడ కూడా ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ మూడు వారాల షట్ డౌన్ ప్రకటించారు. భారత్ లో మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఖఛ్చితంగా లాక్ డౌన్ అమలులోకి రావడంతో.. జనజీవనం స్తంభించి పోయింది. అనేక నగరాల్లో వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. రైళ్లు, విమానాలు, బస్సులు సైతం రద్దు కావడంతో జనం ఎక్కడివారక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది. కొన్ని నగరాల్లో ప్రజలు యధేచ్చగా రోడ్లపైకి రావడంతో వారిని ఇళ్లలోనే ఉండేలా చూసేందుకు స్వయంగా సైన్యం రంగంలోకి దిగింది. దీంతో పోలీసులకు పనిభారం తగ్గింది. ఇండియాలో 563 కరోనా కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య 10 కి పెరిగింది. తమిళనాడు మదురైలో కరోనా రోగి ఒకరు మృతి చెందారు. కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడిన 41 మంది కోలుకున్నారు. కేరళలో 109 కి , మహారాష్ట్రలో 101 కి, కర్ణాటకలో 41 కి, తెలంగాణలో 39 కి, ఏపీలో ఏడుకు ఈ కేసులు పెరిగాయి.
ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 559 మందికి పెరగగా.. 42 వేల మందికి పైగా ఈ వైరస్ ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. ఒక్క రోజే సుమారు 10 వేల కేసులు నమోదైనట్టు అంచనా. ఇటలీ తరువాత అమెరికా రెండో వైరస్ ఎపి సెంటర్ గా మారవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాల్లో ఒక అగ్రరాజ్యమే మరో ‘ఇటలీ’ గా మారితే అంతకన్నా అధ్వాన్నం మరొకటి ఉండదని మిలన్ లోని యూనీ క్రెడిట్ బ్యాంక్ ఎకనమిస్ట్ ఎడోర్డో కాంపనెల్లా వ్యాఖ్యానించారు. గ్లోబల్ హెల్త్.. గ్లోబల్ రెసెషన్ (ఆర్ధిక మాంద్యం) లా మారే పరిస్థితి కనిపిస్తోందని కాంపనెల్లా అన్నారు. అయితే 2 ట్రిలియన్ డాలర్ల ఎకనామిక్ ప్యాకేజీని యుఎస్ సెనేట్ ఆమోదించడంతో ఇన్వెస్టర్లలో ఆశలు చిగురిస్తున్నాయి. గత 24 గంటల్లో యూరప్ లో 85 శాతం కరోనా కొత్త కేసులు నమోదు కాగా.. అందులో 40 శాతం అమెరికాలోనే నమోదు కావడం విశేషం. దీనిపై జెనీవాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మహిళా అధికార ప్రతినిధి మార్గరెట్ హారిస్ వ్యాఖ్యానిస్తూ.. అమెరికా వెంటనే కరోనా నివారణకు యుధ్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు.