AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో కరోనా సెకండ్ వేవ్.. గ్రామీణ ప్రాంతాలకు పాకిన వైరస్.. ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యాధికారులు..!

కరోనా వైరస్ రెండో విడత ప్రపంచాన్ని ఆవహించింది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. జనజీవనం మరోసారి అల్లాడుతోంది. అటు అగ్ర రాజ్యం కరోనా ధాటికి చిరుగుటాకులా వణికిపోతుంది.

అమెరికాలో కరోనా సెకండ్ వేవ్.. గ్రామీణ ప్రాంతాలకు పాకిన వైరస్.. ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యాధికారులు..!
Balaraju Goud
|

Updated on: Nov 25, 2020 | 1:46 PM

Share

కరోనా వైరస్ రెండో విడత ప్రపంచాన్ని ఆవహించింది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. జనజీవనం మరోసారి అల్లాడుతోంది. వైరస్ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతూ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. నిన్న ఒక్కరోజే ప్రపంచం మొత్తం మీద 5,26,105 కరోనా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రతతో ఉందో అద్దం పడుతోంది. వైరస్ వ్యాప్తి నగరాలకే కాకుండా రూరల్ ప్రాంతాలకు విస్తరిస్తోంది. దీంతో వైద్యాధికారుల్లో కొత్త టెన్షన్ మొదలైంది.

అటు అగ్ర రాజ్యం కరోనా ధాటికి చిరుగుటాకులా వణికిపోతుంది. రోజు రోజుకు అమెరికాలో కేసుల తీవ్రత మరింత పెరుగుతోంది. వాతావరణంలో అనూహ్యంగా వచ్చిన మార్పులు.. ప్రజలు మాస్కులు, భౌతిక దూరం పాటించకుండా నిర్లక్ష్యపు ధోరణితో తిరుగుతుండటం రికార్డు స్థాయిలో కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇంతకాలం కాస్త తగ్గుమొఖం పట్టిందనుకున్న కరోనా తీవ్రత పెరగటంతో అక్కడి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా అత్యధిక కేసులతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇప్పటివరకు పట్టణ ప్రాంతాలు, జనసమూహిక ప్రాంతాలకే పరిమితమైన వైరస్.. తాజాగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించిందని అమెరికా అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాల కొరత కారణంగా వైరస్ వేగంగా విస్తరిస్తుందంటున్నారు. ఇదే పరిస్థితి నెలకొంటే.. కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశముందని అధికారులు అంటున్నారు.

అమెరికాలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ మొదలు కావడంతో కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అమాంతం పెరిగింది. వైరస్ వల్ల ప్రతి రోజు అమెరికాలో వెయ్యి నుంచి రెండు వేల మంది వరకు మరణిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో కోవిడ్ 19 వల్ల 2లక్షల 64వేల మందికిపైగా మరణించారు. రెండు నెలల్లోనే 64వేల మంది మరణించగా.. రానున్న నెల రోజుల్లో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని, అమెరికా మృత్యు దిబ్బగా మారబోతుందని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

తాజాగా నమోదవుతున్న కేసులు, మరణాల లెక్కలపై అమెరికా ప్రముఖ వైద్యుడు ఆంథోనీ ఫౌసీ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా విలయం ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివరి నాటికి మరణాల సంఖ్య 3 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. జాగ్రత్తలు పాటించకపోతే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని తెలిపారు.