Trump: ఇండియన్స్‌కు ట్రంప్ బిగ్ షాక్.. గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలకు సంచలన ఆదేశాలు..
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయులకు షాకిస్తూ గూగుల్, మైక్రోసాఫ్ట్‌లకు కీలక ఆదేశాలు ఇచ్చారు. అమెరికన్ టెక్ కంపెనీల్లో భారతీయుల నియామకం వద్దని చెప్పారు. టెక్ కంపెనీలు ఇతరదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయని.. తన పాలనలో పాత రోజులు ముగిసిపోతాయని వ్యాఖ్యానించారు.

ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి తన నిర్ణయాలతో ప్రపంచానికి షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే భారత్ సహా పలు దేశాలపై భారీగా టారీఫ్‌లు విధించాడు. ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని 90 రోజుల పాటు వాయిదా వేశాడు. ఇప్పుడు ఆ గడువు ముగుస్తుండడంతో టారీఫ్‌లు పెంచే పనిలో ఉన్నారు. అమెరికా ఎన్నికల సమయంలోనే ఉదోగ్యాలకు సంబంధించి స్థానికులకే అధిక ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ఇప్పుడు దానికి సంబంధించి భారత్‌కు షాకిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌తో పాటు విదేశాలలో నియామకాలను నిలిపేయాలని గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలను ట్రంప్ హెచ్చరించారు. స్వదేశంలో ఉద్యోగాలను సృష్టించడంపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. అమెరికన్లకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
వాషింగ్టన్‌లో జరిగిన ఏఐ సమ్మిట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టెక్ సంస్థల గ్లోబలిస్ట్ మైండ్ సెట్‌ను ఆయన విమర్శించారు. చాలా మంది అమెరికన్లు పెద్ద పెద్ద కంపెనీలు తమను పట్టించుకోవడం లేదనే భావనలో ఉన్నారని చెప్పారు. పలు సంస్థలు అమెరికాలో లాభాలు అర్జించి.. విదేశాల్లో పెట్టుబడులు పెట్టాయని ఆరోపించారు. అమెరికాలోని టెక్ దిగ్గజ సంస్థలు.. చైనాలో కంపెనీలు నిర్మిస్తూ.. భారతీయ ఉద్యోగులను నియమించుకుంటూ.. ఐర్లాండ్‌ను అడ్డంపెట్టుకొని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛను అనుభవించాయని ట్రంప్ అన్నారు. ఇక్కడి ప్రజల అవకాశాలను పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం చేయడం వంటివి చేశారని విమర్శించారు. తన పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయన్నారు.
ఈ సదస్సులో ట్రంప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి మూడు కీలక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. ఏఐకు ఉన్న ఆటంకాలను తొలగించడం.. అభివృద్ధిని వేగవంతం చేయడం, ఇక ప్రభుత్వ నిధులు పొందుతున్న సంస్థలు తయారు చేసే ఏఐ టూల్స్ రాజకీయంగా తటస్థ వైఖరితో ఉండేలా చూడటం వంటి ఉత్తర్వులపై ట్రంప్ సంతకాలు చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
