భారతీయ ఐటీ ఉద్యోగులకు అమెరికా షాక్..! H-1B రీన్యువల్‌పై కొత్త ఫీజుల మోత..!
అమెరికాలో ఉద్యోగాల కోసం H-1B, L-1 వీసాలపై ఆధారపడుతున్న లక్షలాది మంది విదేశీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ ఉద్యోగులకు ప్రభావం చూపే మరో కీలక ప్రతిపాదనను అమెరికా ప్రభుత్వం పరిశీలిస్తోంది. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) కొత్త ప్రతిపాదనలు రూపొందిస్తోంది. ఇకపై కొత్త H-1B, L-1 వీసా దరఖాస్తులకే కాకుండా, ఉద్యోగుల వీసాలను పొడిగించేందుకు వేల డాలర్ల అదనపు రుసుము చెల్లించాల్సి రావచ్చు.

అమెరికాలో ఉద్యోగాల కోసం H-1B, L-1 వీసాలపై ఆధారపడుతున్న లక్షలాది మంది విదేశీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ ఉద్యోగులకు ప్రభావం చూపే మరో కీలక ప్రతిపాదనను అమెరికా ప్రభుత్వం పరిశీలిస్తోంది. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) కొత్త ప్రతిపాదనలు రూపొందిస్తోంది. ఇకపై కొత్త H-1B, L-1 వీసా దరఖాస్తులకే కాకుండా, ఉద్యోగుల వీసాలను పొడిగించేందుకు వేల డాలర్ల అదనపు రుసుము చెల్లించాల్సి రావచ్చు. ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలో ఉన్నప్పటికీ అమల్లోకి వస్తే అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ నిపుణులపై, అలాగే వారిని నియమించుకునే కంపెనీలపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
ప్రస్తుతం 50 మందికి పైగా ఉద్యోగులు ఉండి, వారిలో సగానికి మించి H-1B లేదా L-1 వీసాలపై పనిచేస్తున్న అమెరికా సంస్థలు కొత్త H-1B లేదా L-1 పిటిషన్ దాఖలు చేసినప్పుడు మాత్రమే ప్రత్యేక అదనపు రుసుము చెల్లిస్తున్నాయి. H-1B వీసా కోసం ఈ రుసుము 4,000 డాలర్లు కాగా, L-1 వీసా కోసం 4,500 డాలర్లు. కొత్త ప్రతిపాదన ప్రకారం ఇదే రుసుము ఉద్యోగి వీసా పొడిగింపు సమయంలో కూడా తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వీసా రెన్యువల్ జరిగే సందర్భంలో కంపెనీలపై అదనపు ఆర్థిక భారం పడనుంది.
H-1B వీసాలు సాధారణంగా మూడు సంవత్సరాల కాలపరిమితితో జారీ అవుతాయి. అనంతరం వాటిని పొడిగించుకునే అవకాశం ఉంటుంది. గ్రీన్ కార్డ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు చాలా మంది భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డేటా నిపుణులు, కన్సల్టెంట్లు, టెక్నాలజీ ప్రొఫెషనల్స్ అనేక సంవత్సరాలు H-1B వీసాపైనే అమెరికాలో పనిచేస్తుంటారు. కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే ప్రతి రెన్యువల్‌కు వేల డాలర్లు అదనంగా చెల్లించాల్సి రావడంతో విదేశీ ఉద్యోగులను కొనసాగించడం కంపెనీలకు మరింత ఖరీదైన వ్యవహారంగా మారే అవకాశం ఉంది.
అమెరికాలో H-1B వీసా హోల్డర్లలో భారతీయులే అత్యధిక శాతం ఉన్నారు. ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), విప్రో, హెచ్‌సీఎల్ టెక్ వంటి భారతీయ ఐటీ దిగ్గజాలతో పాటు అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, ఆపిల్, గూగుల్ వంటి అమెరికన్ టెక్నాలజీ సంస్థలు కూడా వేలాది మంది భారతీయ నిపుణులను H-1B, L-1 వీసాలపై నియమించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త నిబంధనలు భారతీయ ఐటీ రంగంపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశముంది.
నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (NFAP) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2025 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగ కొనసాగింపునకు సంబంధించిన H-1B పిటిషన్లలో అమెజాన్ 14,532 ఆమోదాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత టీసీఎస్‌కు 5,293, మైక్రోసాఫ్ట్‌కు 4,863, మెటాకు 4,740, ఆపిల్‌కు 4,610, గూగుల్‌కు 4,509 H-1B పిటిషన్లు ఆమోదం పొందాయి. అయితే ఇవి ఉద్యోగుల మొత్తం సంఖ్య కాదని, ఒకే ఉద్యోగికి వీసా పొడిగింపు, ఉద్యోగ మార్పుల కారణంగా ఒకటి కంటే ఎక్కువ పిటిషన్లు ఆమోదం పొందే అవకాశం ఉంటుందని NFAP స్పష్టం చేసింది.
ఈ ప్రతిపాదన అమెరికా వలస విధానాల్లో జరుగుతున్న విస్తృత మార్పుల్లో భాగంగా భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో ట్రంప్ ప్రభుత్వం వీసా ఫీజుల పెంపు, కఠినమైన తనిఖీలు, విదేశీ కార్మికులపై ఆధారపడటాన్ని తగ్గించే చర్యలు వంటి అనేక మార్పులను ప్రతిపాదించింది. గతంలో ప్రతిపాదించిన భారీ H-1B ఫీజు పెంపు అంశం కూడా చర్చనీయాంశమైంది.
అయితే ఈ కొత్త ప్రతిపాదన ఇంకా అమల్లోకి రాలేదు. ప్రస్తుతం ఇది DHS నియంత్రణ అజెండాలో మాత్రమే ఉంది. ఫెడరల్ నిబంధనల ప్రక్రియ, ప్రజాభిప్రాయ సేకరణ, తుది ఆమోదం వంటి దశలు పూర్తయిన తర్వాతే అమల్లోకి వస్తుంది. అయినప్పటికీ ఇది అమలైతే H-1B, L-1 వీసాలపై ఎక్కువగా ఆధారపడే కంపెనీల ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో విదేశీ నిపుణుల నియామకాలు, వీసా పొడిగింపులు, దీర్ఘకాలిక ఉద్యోగ అవకాశాలపై కూడా ప్రభావం పడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే భారతీయ ఐటీ నిపుణులు ఈ పరిణామాలను నిశితంగా గమనించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
