Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పలుగు వారిదే.. పెత్తనం వారిదే.. అక్కడ పురుషులకు నో పర్మిషన్.. ఉమెజాలో ఉమెన్స్‌ రాజ్యం..!

ప్రమీల రాజ్యం కథ తెలుసు కదా! పురుషులే లేని రాజ్యం అది! ద్రవిడ సంప్రదాయంలో మాతృస్వామ్యమే ఉండేది. ఆర్యుల రాకతో మాతృస్వామ్యం స్థానంలో పితృస్వామ్య వ్యవస్థ చొరపడిందన్నది కొందరి వాదన!

పలుగు వారిదే.. పెత్తనం వారిదే.. అక్కడ పురుషులకు నో పర్మిషన్.. ఉమెజాలో ఉమెన్స్‌ రాజ్యం..!
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 08, 2021 | 2:39 PM

all women village in kenya : ప్రమీల రాజ్యం కథ తెలుసు కదా! పురుషులే లేని రాజ్యం అది! ద్రవిడ సంప్రదాయంలో మాతృస్వామ్యమే ఉండేది. ఆర్యుల రాకతో మాతృస్వామ్యం స్థానంలో పితృస్వామ్య వ్యవస్థ చొరపడిందన్నది కొందరి వాదన! ఇప్పుడీ వాదనలతో పని లేదు కానీ ఇప్పటికీ కొన్ని చోట్ల ప్రమీల రాజ్యాలున్నాయి.. అక్కడ మగవారికి అస్సలు చోటుండదు. పొరపాటునో గ్రహపాటునో వచ్చినా మహిళలు ఊరుకోరు.. కేవలం మహిళలు మాత్రమే ఉన్న ఆ గ్రామం కెన్యాలో ఉంది.. ఆ ఊరు పేరు ఉమెజా! కేవలం ఆడవాళ్ల కోసమే ఆ ఊరు ఏర్పాటయ్యింది.. అందుకు కారకురాలు రెబెకా! అందుకోసం ఆమె చాలా కష్టపడింది. అడ్డంకులు ఎదుర్కొంది. అవమానాలను భరించింది.. ఒకప్పుడు ఇక్కడ బ్రిటిష్‌ సైనికులు శిక్షణ పొందేవారు. శిక్షణ ఏదో తీసుకుని వెళ్లిపోకుండా అక్కడ ఉన్న మహిళలపై దాష్టికాలు మొదలు పెట్టారు. అత్యాచారాలు చేశారు.. హింసించారు.. ఇలా బ్రిటిష్‌ సైనికుల అకృత్యాలకు బలైన మహిళలకు భర్తల నుంచి ఊరడింపులు ఉండేవి కావు.. పైగా భర్తలు కూడా కండకావరమున్న మగవాళ్లలాగే ప్రవర్తించేవారు.. ఈ హింసను భరించలేక మహిళలు ఇల్లు వదిలి వెళ్లిపోయేవారు.. నిజానికి ఉమెజా గ్రామం ఉన్న సంబురు జిల్లాలో అనేకానేక దురాచారాలు, అంతకు మించిన మూఢనమ్మకాలు ఉండేవి. అక్కడి మహిళలకు ఎలాంటి హక్కులు ఉండేవి కావు.. అసలు నోరెత్తేవారు కాదు.. జీవచ్ఛవాల్లా బతుకును నెట్టుకొస్తుండేవారు. అత్యాచారాలకు గురైన వారు కూడా మాట మాట్లాడటానికి వీల్లేదు. అక్కడి చట్టాలు కూడా మగవాళ్లకు చుట్టాలే!

రెబెకా అక్కడి అమ్మాయే! తన తోటి మహిళలు పడుతున్న కష్టాలు చూసి చలించిపోయింది. ఆవేదన చెందింది.. దుఃఖించింది.. ఆ దుఃఖంలోంచి తెగింపు వచ్చింది.. అటు పిమ్మట కొండంత ధైర్యం వచ్చింది. అన్యాయాలను ఎదిరించాలనే తలంపు వచ్చింది. అణచివేతను ఎదుర్కొవాలనే నిర్ణయంపై కుటుంబసభ్యులే పెదవి విరిచారు. అయినా రెబెకా వెనక్కి వెళ్లలేదు. బ్రిటిష్‌ సైనికుల దురాగతాలపై నిలదీసింది.. ఇది జరిగిన తర్వాత రెబెకాపై దాడి చేశారు. ఇంటకొచ్చి మరీ కొట్టారు.. అప్పుడు పక్కనే ఉన్న భర్తలో ఎలాంటి స్పందన కనిపించలేదు.. ఆమెకు చాలా బాధేసింది.. వెంటనే ఇంటినుంచి బయటకు అడుగేసింది.. తనలాంటివారందరినీ చేరదీసింది.. అందరూ కలిసి ప్రత్యేకంగా ఓ గ్రామాన్నే నిర్మించుకున్నారు. ఊరుపేరును ఉమెజాగా పెట్టుకున్నారు. ఇది పురుషులకు నచ్చలేదు.. ఊరిపై పలుమార్లు దాడి కూడా చేశారు. మహిళలంతా ధైర్యంగా పోరాడి ఊరును కాపాడుకున్నారు. అణచివేతకు, అత్యాచారాలకు గురైన వారంతా ఊరులో ఆశ్రయం పొందడానికి వచ్చేవారు. కొందరైతే పిల్లా పాపాలతో వచ్చేశారు. అలా ఊరు క్రమంగా పెద్దదయ్యింది. సొంతంగా వ్యవసాయం చేసుకోసాగారు. ఆభరణాలను తయారు చేయసాగారు.. చేతి వృత్తులను నమ్ముకుని, వాటి ద్వారా వచ్చే ఆదాయంతో అవసరాలను తీర్చుకుంటున్నారిప్పుడు! ఇల్లు కట్టుకోవడం దగ్గర్నుంచి అన్ని పనులు మహిళలే చేసుకుంటారక్కడ! వారు తయారు చేసే ఆభరణాలను కొనడానికి టూరిస్టులు వస్తుంటారు. ఇంకో గొప్ప విషయమేమిటంటే వారు సంపాదనలో పది శాతం గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడం. ఇక్కడ వచ్చిన మహిళలకు అబ్బాయిలంటే వారు తల్లుల దగ్గర 18 సంవత్సరాల వరకు పెరగవచ్చు. ఆ తర్వాత తమ దారి తాము చూసుకోవాల్సిందే! ఇప్పుడా ఊరులో బడులు కూడా ఉన్నాయి. ఆ మహిళలు తయారు చేసిన వస్తువులు విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి.

Read Also… Corona Cases Update: దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. ఆ రెండు రాష్ట్రాల్లో భారీగా నమోదైన కొత్త కేసులు.!