వినాయక నిమజ్జనంకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. లండన్‌లో ఇద్దరు హైదరాబాద్ యువకుల దుర్మరణం
దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారు వినాయక చవితి ఉత్సవాలను అక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఇలానే లండన్ జరిగిన వినాయక నిమజ్జనం వేడుకల్లో పాల్గొని ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు తెలుగు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు హైదరాబాద్ వాసులుగా స్థానిక పోలీసులు గుర్తించారు.

విదేశాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న భారతీయుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. ఇటీవలే ఫ్యామిలీ టూర్‌కు వెళ్లిన హైదరాబాద్ చెందిన ఫ్యామిలీ అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. తాజాగా హైదరాబాద్‌కు చెందిన మరో ఇద్దరు యువకులు లండన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వినాయక చవితి సందర్భంగా లండన్‌లో ఉంటున్న కొంతమంది తెలుగు విద్యార్థులు వినాయక నిమజ్జనంలో పాల్గొని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. లండన్‌లో నివసిస్తున్న కొందరు తెలుగు విద్యార్థులు వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొని తిరిగి తమ ఇళ్లకు బయల్దేరారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారును వెనకనుంచి వేగంగా దూసుకొచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన చైతన్య, రిషితేజ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు.
కాగా ఈ ప్రమాదంలో మరణించిన వారు హైదరాబాద్‌లోని నాదర్‌గుల్, ఉప్పల్ ప్రాంతాలకు చెందిన చైతన్య, రిషితేజగా తెలుస్తోంది. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన బాధితులంతా తెలుగు రాష్ట్రాలకు చెందినవారేనని తెలుస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
