AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Turkey Earthquake: ఇది కదా నాన్న ప్రేమంటే.. పిల్లాడికి తన శరీరాన్నే రక్షణ కవచంలా మలచిన ఓ తండ్రి.. భూకంప ప్రాంతాల్లో హృదయ విదారక దృశ్యాలు..

ఓ భవనం శిథిలాల కింద కూర్చున్న స్థితిలో ఉన్న ఓ వ్యక్తి డెడ్ బాడీ కనిపించింది. వెంటనే సహాయక సిబ్బంది శిథిలాలను ఇంకొంచెం తొలగించి చూడగా.. అతడి ఒడిలో ఓ పిల్లాడు కనిపించాడు. ఆ చిన్నారి కూడా చనిపోయి ఉంటాడని భావించారంతా.

Turkey Earthquake: ఇది కదా నాన్న ప్రేమంటే.. పిల్లాడికి తన శరీరాన్నే రక్షణ కవచంలా మలచిన ఓ తండ్రి.. భూకంప ప్రాంతాల్లో హృదయ విదారక దృశ్యాలు..
Turkey Earthquake
Surya Kala
|

Updated on: Feb 10, 2023 | 7:39 AM

Share

టర్కీ, సిరియాలో ప్రకృతి ప్రకోపానికి ఉనికినే కోల్పోయింది. భారీ భూకంపం సంభవించి నాలుగు రోజులు దాటినా.. ఇంకా అక్కడ ఏమూలకు వెళ్లినా హృదయవిదారక పరిస్థితులే కనిపిస్తున్నాయి. పేక మేడల్లా కూలిన భవనాల కింద ఇంకా ఎన్నో వేల మంది చిక్కుకునే ఉన్నారు. కాంక్రీట్ బిల్డింగ్‌ల శిథిలాల కింద.. ఇరుక్కున్న వారిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉంది. టర్కీ, సిరియాలో భూకంప మృతుల సంఖ్య గంట గంటకూ పెరుగుతూనే ఉంది. ఈ రెండు దేశాల్లో ఇప్పటికే 20 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అందులో 17వేల 134 మంది టర్కీలో 3వేల 162 మంది సిరియాలో ప్రాణాలు కోల్పోయారు. ఈ డెత్ టోల్ ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు.

దాదాపు నాలుగు రోజులు కావడంతో.. శిథిలాలను తొలగిస్తున్న సిబ్బందికి మృతదేహాలే కనిపిస్తున్నాయి. ఓ భవనం శిథిలాల కింద కూర్చున్న స్థితిలో ఉన్న ఓ వ్యక్తి డెడ్ బాడీ కనిపించింది. వెంటనే సహాయక సిబ్బంది శిథిలాలను ఇంకొంచెం తొలగించి చూడగా.. అతడి ఒడిలో ఓ పిల్లాడు కనిపించాడు. ఆ చిన్నారి కూడా చనిపోయి ఉంటాడని భావించారంతా. అంతా చీకటిగా ఉండటంతో అప్పటి వరకూ కళ్లు మూసుకొని ఉన్న ఆ బాబు.. వెలుతురు రావడంతో కళ్లు తెరిచాడు. ఇది చూసిన సహాయక సిబ్బంది ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ పిల్లాణ్ని హాస్పిటల్‌కు తరలించారు. తన కొడుకు మీద శిథిలాలు పడకుండా.. తన శరీరాన్నే రక్షణ కవచంలా మలచిన ఆ తండ్రి మాత్రం మాత్రం ఈ లోకం నుంచి వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ ఈ తండ్రి పడే ఆవేదన చూడండి. శిథిలాల కింద చిక్కుకున్న తన కుటుంబం కోసం ఎంత పరితపిస్తున్నాడో.. చేతిలో చిన్న రాయి పట్టుకుని, శబ్దం చేస్తున్నాడు. దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తున్నాడు. తనను ఎంతగానో ప్రేమించిన కుటుంబసభ్యులు ఖచ్చితంగా బతికే ఉన్నారు. ప్రాణాలతో బయటపడతారనే ఆశ అతనిని అలా చేయిస్తోంది. కానీ ఎంత అరిచినా ఎవరూ బదులు పలక్కపోవడంతో.. గుండెలు పగిలేలా రోధిస్తున్నాడు.

ఇంట్లో మంచం మీద పడుకున్న ఓ 15 ఏళ్ల బాలిక.. శిథిలాల కింద పడి ప్రాణాలు కోల్పోయింది. అది చూసి తట్టుకోలేని ఆ తండ్రి.. ఆ అమ్మాయి చేయి పట్టుకుని మూడు రోజులుగా అక్కడే కూర్చుండిపోయాడు. గడ్డకట్టే చలిలోనూ అక్కడ నుంచి కదలకుండా కూర్చున్న అతనిని చూసి అందరూ కంటతడి పెట్టుకుంటున్నారు.

భూకంపం ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం వెళ్లిన భారత బృందాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడమే కాకుండా.. అత్యవసర వైద్యంతో పాటు సేవలు అందించడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఏ మాత్రమూ అనుకూలించని వాతావరణంతో టర్కీ, సిరియాల్లో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఓవైపు గడ్డకట్టే చలి.. మరోవైపు మంచు వర్షంతో అత్యంత ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ సేవలు కొనసాగిస్తూనే ఉన్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అంతే కాకుండా పలు దేశాలు మన NDRF దళాలను అభినందిస్తున్నాయి.

ఈ విధ్వంసం నుంచి బయటపడేందుకు.. ప్రపంచ బ్యాంక్ అండగా నిలిచింది. 1.78 బిలియన్ల ఆర్ధిక సాయాన్ని రిలీఫ్ పండ్ కింద అందించేందుకు సిద్ధమైంది. అత్యవసర అవసరాలకు వినియోగించుకునేలా ఈ నిధులు వెంటనే అందేలా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు భూకంపం ధాటికి ఆ దేశం ఐదు నుంచి ఆరు మీటర్ల మేర పక్కకు కదిలినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..