ట్రంప్ గోల్డ్ కార్డ్ కోసం భారీగా దరఖాస్తులు..! ఇప్పటికే 70 వేల మంది నుంచి అప్లికేషన్స్
అమెరికా ప్రవేశపెట్టిన ట్రంప్ గోల్డ్ కార్డ్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటికే 70,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. 5 మిలియన్ డాలర్ల పెట్టుబడితో US పౌరసత్వం పొందే అవకాశం ఈ కార్డ్ అందిస్తోంది. ఈ కార్యక్రమం అమెరికా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడానికి, దేశ రుణభారాన్ని తగ్గించడానికి కూడా ఉద్దేశించబడింది.

అమెరికా ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డ్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు సుమారు 70వేల మంది ట్రంప్ గోల్డ్ కార్డ్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఈ గోల్డ్ కార్డు రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌ని ఈ నెల 12న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించారు. విదేశీ వలసదారులు అమెరికా ప్రభుత్వానికి 50 లక్షల డాలర్లు అంటే.. దాదాపు 43 కోట్లు చెల్లించడం ద్వారా గోల్డ్ కార్డ్ కొనుగోలు చేసి అమెరికా పౌరసత్వాన్ని పొందేందుకు వీలు కల్పించింది.
ట్రంప్ కార్డుపై ఆసక్తి ఉన్నవారు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు చాన్స్ ఇచ్చింది. దీనిలో అభ్యర్థి పేరు, మతం, చిరునామాను రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. trumpcard.gov పేరుతోఉన్న వైబ్‌సైట్‌లో గోల్డ్ కార్డు నమూనాను ఉంచారు. ఈ కార్డుపై ట్రంప్ బొమ్మ, ఆయన సంతకం, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, అమెరికా జెండా, 5 మిలియన్ డాలర్ల అంకె ముద్రించారు. యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా, ఓషియానియా, మధ్య అమెరికా, దక్షిణ అమెరికా, కరీబియన్, ఆఫ్రికా లాంటి 8 ప్రాంతాల నుంచి మాత్రమే అమెరికా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ట్రంప్ కార్డ్ అమెరికాలో నివాసం పొందాలనుకునే వ్యాపారస్థులు, సంస్థలను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుందని అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని అమెరికా 36 ట్రిలియన్ డాలర్ల రుణాన్ని తగ్గించడానికి ఆదాయాన్ని పెంచే చొరవగా కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం US EB-5 వీసా కార్యక్రమం విదేశీ పౌరులు 1.8 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడుల ద్వారా శాశ్వత నివాసం పొందేందుకు వీలు కల్పిస్తుంది. గత సంవత్సరం సుమారు 14,000 EB-5 వీసాలు జారీ చేసినట్లు ఇన్వెస్ట్ ఇన్ ది USA తెలిపింది. రాబోయే నెలల్లో వాణిజ్య శాఖ పదివేల ట్రంప్ కార్డులను జారీ చేయాలని యోచిస్తోంది. 200,000 వీసాలు జారీ చేయడం వల్ల అమెరికా ట్రెజరీకి 1 ట్రిలియన్ డాలర్లు రావచ్చని అంచనా.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
