Sri Lanka: శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం.. ఒక్క భారత రూపాయి విలువ అక్కడెంతో తెలుసా..?
శ్రీలంక సంక్షోభం రోజుకో మలుపు తీసుకుంటోంది. ధరల పెరుగుదలను నిరసిస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బుధవారమూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి.
Sri Lanka Updates: శ్రీలంక…రావణకాష్టమవుతోంది. పాలకుల ఘోరతప్పిదాలకు అక్కడి జనం మూల్యం చెల్లించుకుంటోంది. నేతలంతా నేతులు తాగుతున్నారు..కానీ జనమే కన్నీళ్లతో కడుపునింపుకుంటున్నారు. తిందామంటే తిండిదొరకదు. వంటకు గ్యాస్ ఉండదు. కరెంట్ కూడా కటకటే. ఉక్కపోతతో ఉడికిపోతోందక్కడ ప్రజానీకం. బతుకునిచ్చే వ్యాపారం బంద్. ఉపాధినిచ్చే పర్యాటకం బంద్. దారి చూపే చదువు బంద్. టోటల్‌గా బతుకే బంద్. అందుకే దేశం మొత్తం యుద్ధం ప్రకటించింది. గో…గో గోటబయ(Go.. Go…Gotabaya) అన్న నినాదం మార్మోగుతోంది. ప్రజంట్ రోజుకు 13-14 గంటల కరెంటు కోతలు ఉన్నాయి. ఎగ్జామ్స్ రాయడానికి కనీసం పేపరు కూడా లేదు. నిత్యావసరాల ధరలు, పండ్లు, కూరగాయలు ఆకాశాన్నంటుతున్నాయి. 60 రూపాయలు పెడితే గాని ఒక్క నిమ్మకాయ కొనలేని పరిస్థితి ఏర్పడింది. 4 నెలల క్రితం యాపిల్ కిలో రూ. 500.. ఇప్పుడు కిలో రూ. 1000కి చేరింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన ఇంధనం, ఆహారం, ఔషధాలు నిలిచిపోయాయి. శ్రీలంక అంతటా తీవ్ర ఇంధన కొరత ఏర్పడింది.. పెట్రోలు ఎప్పుడొస్తుందో తెలియదు.. బంకుల దగ్గర భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ఫుడ్, ఇంధన కొరతతో శ్రీలంక తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో పోరాడుతోంది. కరోనా వైరస్ విజృంభణతో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనానికి దారితీసింది. విదేశీ మారకద్రవ్య కొరతను ఆ దేశం ఎదుర్కొంటోంది. శ్రీలంక విదేశీ మారక నిల్వలు గత రెండేళ్లలో 70% క్షీణించాయి. ఈ ఫిబ్రవరిలో కేవలం $2.31 బిలియన్లకు పడిపోయాయి. విదేశీ మారకనిల్వలను లేకపోవడం వల్ల ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే శ్రీలంక రూపాయి రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. ఒక అమెరికన్ డాలర్ విలువ శ్రీలంకలో 300 రూపాయలుగా ఉంది. ఇక భారత్ ఒక రూపాయి విలువ.. శ్రీలంకలో 4 రూపాయలుగా ఉంది. శ్రీలంక 1948లో స్వాతంత్య్రం పొందిన తర్వాత ఇప్పుడే ఇంతటి.. అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
గంటగంటకూ శ్రీలంకలో పరిణామాలు మారిపోతున్నాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా అన్ని వ్యవస్థలు కూలిపోతున్నాయి. కొన్నిరోజులుగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. కాగా సంక్షోభం తమ నిర్ణయాల వల్ల కాదని.. కరోనా కారణంగానే ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని విదేశీ మారక నిల్వలు కరిగిపోయాయని తమ చర్యలను ప్రభుత్వం సమర్థించుకుంటుంది.
Also Read: సామాన్యులకు అందని ద్రాక్షగా చికెన్ ముక్క, నిమ్మ చెక్క.. టమాట, ఉల్లి ధరలు మాత్రం ఢమాల్