ఒకే ఆస్పత్రిలో ఒకే వార్డులో పనిచేస్తున్న ఆరుగురు నర్సులకు బ్రెయిన్ ట్యూమర్! ఎలా వచ్చిందంటే..?
అమెరికాలోని మసాచుసెట్స్‌లోని న్యూటన్-వెల్లెస్లీ ఆసుపత్రిలో ఒకే వార్డులో పనిచేసిన ఆరుగురు నర్సులకు బ్రెయిన్ ట్యూమర్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. ఆసుపత్రి వాతావరణంలోని క్యాన్సర్ కారకాలు లేదా ఇతర కారణాల వల్ల ఈ సమస్య వచ్చిందా అనేది ఇంకా తెలియదు.

సాధారణంగా ఒకరకమైన అనారోగ్యంతో బాధ పడేవారిని ఒకే వార్డులో ఉంచి చికిత్స అందిస్తారు. కానీ, విచిత్రంగా ఓ ఆస్పత్రిలో అందులోనా ఒకే వార్డులో పనిచేస్తున్న ఆరుగురు నర్సులకు ఒకరకమైన వ్యాధి వచ్చింది. అదేంటి నర్సులకు ఒకరకమైన వ్యాధి రావడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం.. అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఒకే ఆసుపత్రిలో, ఒకే అంతస్తులో పనిచేస్తున్న ఆరుగురు నర్సులకు బ్రెయిన్ ట్యూమర్లు ఉన్నట్లు నిర్ధారణ అయింది. న్యూటన్-వెల్లెస్లీ ఆసుపత్రిలో జరిగిన ఈ కేసు మొదట స్థానిక మీడియాలో ఏప్రిల్ ప్రారంభంలో ప్రచురితమైంది.
నర్సుల మెదడుల్లో చిన్న చిన్న నిరపాయకరమైన కణితులు కనిపించాయి. OHS (ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ) ఐదవ అంతస్తులో వివిధ షిఫ్టుల్లో పనిచేసిన ఆరుగురు సిబ్బందిని గుర్తించింది. వారికి నిరపాయకరమైన (క్యాన్సర్ కాని) మెదడు కణితులు అభివృద్ధి చెందినట్లు నిర్ధారించారు. ఒకే ఆస్పత్రిలో ఒకే ఫ్లోర్‌లో పనిచేస్తున్న ఆరుగురు సిబ్బందికి ఈ బ్రెయిన్ ట్యూమర్ ఎలా వచ్చిందనే విషయంపై పరిశీలన కొనసాగుతోంది. కాగా, ఆస్పత్రిలో మందుల వాడకం, రోగులకు చికిత్స అందించడం ద్వారా ఇది సోకలేదని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. అయితే.. వాతావరణంలోని క్యాన్సర్ కారక టాక్సిన్లు కణితులకు కారణమవుతాయి. నర్సులకు ఈ కణితుల ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగిస్తామని మసాచుసెట్స్ నర్సుల సంఘం తెలిపింది. ఆసుపత్రి దర్యాప్తు సమగ్రంగా లేదని, న్యూటన్-వెల్లెస్లీ ఆసుపత్రిలో ఏదో తప్పు జరిగినట్లు కనిపిస్తోందని సంఘ సభ్యులు ఆరోపించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
