Bullet Train: ఇండియా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌కు బిగ్ బూస్ట్..! జపాన్ నుంచి స్పెషల్ గిఫ్ట్స్
జపాన్, భారతదేశపు ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు కారిడార్ పరీక్షల కోసం E5, E3 షింకన్సెన్ బుల్లెట్ రైళ్లను విరాళంగా ఇవ్వనుంది. ఈ అత్యాధునిక రైళ్లు 2026లో అందుబాటులోకి వస్తాయి. తీవ్ర ఉష్ణోగ్రతలు, ధూళి వంటి పర్యావరణ సవాళ్లను అధిగమించే సామర్థ్యాన్ని ఈ రైళ్లు కలిగి ఉన్నాయి.

ఇండియా బుల్లెట్ ప్రాజెక్ట్‌కు బిగ్ బూస్ట్ ఇచ్చేలా జపాన్ ఓ రెండు రైళ్లను గిఫ్ట్‌గా ఇస్తోంది. అవి కూడా సాధారణ రైళ్లు కావు.. గంటకు ఏకంగా 30 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లే షింకన్‌సెన్ E5, E3 సిరీస్ బుల్లెట్ రైళ్లను ఇవ్వనుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్‌ను పరీక్షించేందుకు ఈ రైళ్లను ఇవ్వనుంది. ఈ రైళ్లు 2026లో అందుబాటులోకి వస్తాయి. కారిడర్ నిర్మాణం పూర్తి అవ్వగానే.. ఈ రైళ్లను పరుగులు తీయించి.. ట్రాక్ ను తనిఖీ చేస్తారు. ముఖ్యంగా ఇండియా ఎదుర్కొంటున్న పర్యావరణ సవాళ్లకు సంబంధించి, తీవ్రమైన ఉష్ణోగ్రతలు, ధూళి వంటి వాటిని పరిశీలించడానికి ఈ రైళ్లు సహాయపడతాయి. జపాన్ అభివృద్ధి చేస్తున్న బుల్లెట్ రైలు E10 సిరీస్‌ను ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ మార్గం కోసం పరిశీలిస్తున్నారు.
ఈ కొత్త మోడల్‌ను ఇండియాలో నడిపే ముందు E5, E3 రైళ్లను నడిపి పరిశీలిస్తారు. అలాగే E10 మోడల్ డిజైన్‌ను మెరుగుపరచడంలో జపాన్‌కు ఈ పరిశీలిన కూడా ఉపయోగపడుతుంది. E5 సిరీస్ అనేది తూర్పు జపాన్ రైల్వే (JR ఈస్ట్) అభివృద్ధి చేసిన ఆధునిక హై-స్పీడ్ రైలు, ఇది 2011 నుంచి సేవలు అందిస్తోంది. గంటకు 320 కి.మీ వేగంతో ప్రయాణించగల సామర్థ్యం కలిగిన దీనిని మొదట భారతదేశపు మొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు. కొంచెం పాతదైన E3 సిరీస్ ప్రధానంగా మినీ-షింకన్సెన్ సేవలకు ఉపయోగించబడుతుంది, అధునాతన భద్రతా వ్యవస్థలు. సున్నితమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఆల్ఫా-X అని పిలువబడే E10 గంటకు 400 కి.మీ వేగాన్ని అందుకోగలదు. జపనీస్ రైల్వే ఆవిష్కరణ అత్యాధునికతను సూచిస్తుంది. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈ అధునాతన రైలు 2030లో ఇండియాలో పరుగుల తీసే ఆస్కారం ఉంది.
ముంబై-అహ్మదాబాద్ కారిడార్‌లో E10 రైలును ప్రవేశపెడితే.. భారతీయ రైల్వే వ్యవస్థలో ఇదో చరిత్రగా మిగిలిపోతుంది. కారిడార్ తనిఖీ కోసం E5, E3 రైళ్లను ఉపయోగించడం ద్వారా E10 పూర్తి అమలుకు ముందు భారతదేశం ఈ సాంకేతికతతో విలువైన ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతుంది. కాగా ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం ఇండియా జపాన్ నుంచి అప్పు తీసుకుంటున్న విషయం తెలిసిందే. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA) నుండి తక్కువ-వడ్డీ రుణం పొందుతోంది. ఈ రుణం మొత్తం ఖర్చులలో దాదాపు 80 శాతం కవర్ చేస్తుంది. చాలా తక్కువ వడ్డీ రేటుతో 50 సంవత్సరాలలో తిరిగి చెల్లింపు చేయాల్సి ఉంటుంది. జపాన్ అంతర్జాతీయంగా షింకన్‌సెన్ టెక్నాలజీని పంచుకోవడం ఇదే మొదటిసారి కాదు. జపాన్ గతంలో తైవాన్ హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్ కోసం మొదటి తరం షింకన్‌సెన్ రైలును అందించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
