టెర్రరిస్టులను హడలెత్తిస్తున్న గుర్తుతెలియని వ్యక్తులు.. కుల్‌భూషణ్ కిడ్నాప్ వెనకున్న పాక్ మతపెద్ద హతం
భారత వ్యతిరేక, పాక్ ఉగ్రవాదుల్ని గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కొక్కరిగా మట్టుబెడుతున్నారు. అత్యంత పకడ్భందీగా ఉగ్రవాదుల్ని హతమారుస్తున్నారు. దీంతో పాకిస్తాన్ ఉగ్రవాదులకు గుర్తుతెలియని వ్యక్తుల భయం పట్టుకుంది.. తాజాగా.. కుల్‌భూషణ్ జాదవ్ కిడ్నాప్ వెనకున్న పాక్ మతపెద్ద హతమయ్యాడు.. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో మరణించాడు..

పాక్ ఉగ్రవాదులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. పాక్‌లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వరుసగా వారిని హత్య చేస్తుండటంతో.. చాలా మంది రహస్య ప్రదేశాల్లో దాక్కుంటున్నారు. తాజాగా భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కిడ్నాప్‌లో పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్‌కు సహకరించిన పాక్ మతపెద్ద ముఫ్తీ షా మిర్ హత్యకు గురయ్యాడు. బలూచిస్థాన్‌లో గుర్తుతెలియని వ్యక్తి అతడ్ని కాల్చి చంపాడు. బలూచి ప్రాంతంలో ప్రముఖ మతపెద్ద అయిన ముఫ్తీ గతంలో రెండుసార్లు హత్యాప్రయత్నం నుంచి తప్పించుకున్నారు. గతవారం ముఫ్తీ పార్టీకి చెందిన ఇద్దర్ని ఖుజ్దార్‌లో కాల్చిచంపిన గుర్తు తెలియని వ్యక్తులు… ఇప్పుడు మిర్‌ను హత్య చేశారు.
ముఫ్తీ షా మిర్… మసీదులో ప్రార్థనలు ముగించుకుని బయటకు వెళ్తుండగా.. ద్విచక్రవాహనంపై వచ్చిన ముష్కరులు మెరుపుదాడి చేశారని పోలీసులు తెలిపారు. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో అతడిపై అనేకసార్లు కాల్పులు జరిపారని, తీవ్రగాయాలతో ఆసుపత్రిలో మరణించారని తెలిపారు. మత సంస్థ జమియత్ ఉలేమా-ఇ-ఇస్లాంలో సభ్యుడైన ముఫ్తీ షా మీర్.. పండితుడి ముసుగులో ఆయుధాలు, మానవ అక్రమ రవాణా లాంటి కార్యకలాపాలకు పాల్పడేవాడు.
పాకిస్థాన్‌లోని పలు ఉగ్రవాద సంస్థలతో ముఫ్తీ షా మిర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తరచూ పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను సందర్శించేవాడు. అంతేకాక ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడటానికి సహాయం చేసేవాడు. కుల్‌భూషన్ జాదవ్ కిడ్నాప్‌లో ఇతను ఐఎస్ఐకి సహకరించాడు. అయితే జాదవ్ కిడ్నాప్‌లో కీలకంగా వ్యవహరించిన జైషే అల్ అదల్ సంస్థ సభ్యుడు ముల్లాహ్ ఒమర్ ఇరానీ సైతం మిర్ మాదిరిగానే 2020లో హత్యకు గురయ్యాడు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
