Donald Trump: ట్రంప్‌ను నోబెల్ బహుమతికి నామినేట్ చేసిన పాకిస్తాన్.. ఎందుకో తెలుసా?
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడంతో పాటు పూర్తి స్థాయి యుద్ధాన్ని నివారించడంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దౌత్య పాత్రను పేర్కొంటూ, పాకిస్తాన్ ప్రభుత్వం ఆయనను 2026 నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది. ఈ విషయాన్ని పాకిస్తాన్‌కు ప్రభుత్వం ఓ అధికారిక ప్రకటన ద్వారా తెలియజేసింది.

పాగల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం- పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను తగ్గించేందుకు తానే మధ్యవర్తిత్వం వహించినట్టు తనంతకు తానే ప్రకటించుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ విషయంలో అనేక సందర్భాల్లో ప్రశంసలు అందుకున్నారు. కానీ భారత్ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను ఖండించింది. భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ కేవలం రెండు దేశాల దౌత్య చర్చలతోనే జరిగిందని పేర్కొంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధానమంత్రి మోదీ సైతం భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణలో మరే ఇతర దేశం పాత్ర లేదని చెప్పుకొచ్చారు.
అయితే, రెండు దేశాల మధ్య క్లిష్ట పరిస్థితుల సమయంలో ఇస్లామాబాద్, న్యూఢిల్లీ రెండింటినీ కలుపుకోవడం ద్వారా ట్రంప్ గొప్ప వ్యూహాత్మక దూరదృష్టి, అద్భుతమైన రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు” అని పాకిస్తాన్ పేర్కొంది. “అతని ప్రయత్నాలు కాల్పుల విరమణకు దారితీశాయి, ఇది ఒక విపత్కర సంఘర్షణను నివారించింది పాకిస్థాన్ విడుదల చేసిన ప్రకటనలో రాసుకొచ్చింది.
అయితే పహల్గామ్ దాడిని తమకు ఆపాదిస్తూ భారత్ చట్టవిరుద్ధమైన దురాక్రమణ”తో పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించి, తమ దేశ పౌరులకు ప్రాణనష్టం కలిగించడంతో సంక్షోభం మొదలైనట్టు పాకిస్థాన్ పేర్కొంది. భారత్ దానికి ప్రతీకారంగానే ఇస్లామాబాద్ ఆపరేషన్ బన్యన్-అన్-మర్సూస్‌ను ప్రారంభించింది, దేశ పౌరులను కాపాడేందుకు ఎదురుదాడికి దిగినట్టు తెలిపింది. ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో, ట్రంప్ కలుగజేసుకొని రెండు దేశాలతో చర్చలు జరపడంతోనే సంక్షోభం తగ్గి శాంతిని నెలకొల్పబడిందని పాకిస్తాన్ పేర్కొంది.
ఈ జోక్యం ట్రంప్ శాంతికర్త పాత్రకు, చర్చల ద్వారా వివాదాల పరిష్కరించిన ఆయన నిబద్ధతకు నిదర్శనమని పాకిస్తాన్ తెలిపింది. కాశ్మీర్ వివాద పరిష్కారానికి ట్రంప్ చేసిన ప్రతిపాదనలను ఇస్లామాబాద్ ప్రశంసించింది, ఆయన ప్రమేయాన్ని “దక్షిణాసియాలో శాశ్వత శాంతికి నిజాయితీగల నిబద్ధత”గా అభివర్ణించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా కాశ్మీర్ వివాదానికి పరిష్కారం లభించకపోతే ఈ ప్రాంతంలో నిజమైన శాంతి సాధ్యం కాదని పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
